మీడియా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం: శ్యామ్ చంద్రశేషు

ABN , First Publish Date - 2021-06-03T23:12:15+05:30 IST

ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న మీడియా స్వేచ్ఛను హరించటానికి ఏపీ

మీడియా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం: శ్యామ్ చంద్రశేషు

అమరావతి: ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న మీడియా స్వేచ్ఛను హరించటానికి ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తుందని ప్రముఖ న్యాయవాది, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి  డా. దాసరి శ్యామ్ చంద్రశేషు ఆరోపించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి, ఇపుడు అతని వారసుడు జగన్మోహన్ రెడ్డిలు తాము చేస్తున్న అక్రమాలను బయటపెడుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేయించారన్నారు. విశాఖలో ఆంధ్రజ్యోతి కార్యాలయం ఉన్న భవనాన్ని కూల్చివేశారన్నారు. ఎంపీ రఘురామ మీద పెట్టిన కేసులలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లను చేర్చడం కక్ష సాధింపుతో ప్రశ్నించే మీడియా గొంతు నొక్కడమేనని ఆయన విమర్శించారు.


 ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే మీడియా గొంతు నొక్కొద్దని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో హెచ్చరించిందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు కీలక పాత్ర వహిస్తాయని, పత్రికాస్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని సుప్రీం తీర్పు వెలువరించిందని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని మీడియా గొంతు నొక్కుతుందని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వం దీనికి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని శేషు హెచ్చరించారు.


ఇప్పటికైనా పత్రికల, మీడియా మీద దాడులు, కేసులు, రిపోర్టర్స్ మీద అట్రాసిటీ కేసులు లాంటివి మానుకోవాలని ఆయన సూచించారు. గత ప్రభుత్వాలు ఇలానే చేసి ఉంటే  సాక్షి ఛానల్, పత్రిక పరిస్థితి ఏమై ఉండేదో ఒకసారి జగన్ ఆలోచన చేసుకోవాలని డాక్టర్ శేషు అన్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రభుత్వాన్ని నడపాలని జగన్‌కు ఆయన సూచించారు. 

Updated Date - 2021-06-03T23:12:15+05:30 IST