జగనన్న టౌన్‌షిప్‌లకు ప్రభుత్వ భూములు

ABN , First Publish Date - 2021-07-28T08:22:33+05:30 IST

రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నివాస ప్లాట్లు అందించేందుకు రూపొందించిన జగనన్న..

జగనన్న టౌన్‌షిప్‌లకు ప్రభుత్వ భూములు

ఎంఐజీ లేఅవుట్‌లుగా మధ్యతరగతి ప్రజలకు విక్రయం!

శాఖల వద్ద ఖాళీ, వినియోగించని భూములు గుర్తించాలి

వాటిని కలెక్టర్‌ స్వాధీనం చేసుకుని పురపాలకశాఖకు అప్పగించాలి

దేవదాయ, వక్ఫ్‌, విద్యాసంస్థలు, దార్మిక సంస్థల భూములు వద్దు

రెవెన్యూశాఖ ఉత్తర్వుల

అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నివాస ప్లాట్లు అందించేందుకు రూపొందించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు ప్రభుత్వ శాఖల వద్ద ఖాళీగా ఉన్న, ఉపయోగించని భూములను వినియోగించనున్నారు. ఆయా భూములను గుర్తించి జిల్లా కలెక్టర్‌ ముందుస్తుగా పొజిషన్‌ తీసుకొని పురపాలక శాఖకు అప్పగించాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి తాజాగా ఉత్తర్వులు (193) జారీ చేశారు. పట్టణాల పరిధిలో తక్కువ ధరకే మధ్యతరగతి ప్రజలకు నివాస ప్లాట్లు(200 నుంచి 240 గజాలు) విక్రయించేందుకు ప్రభుత్వం తొలుత మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌ లేఅవుట్‌(ఎంఐజీ)లను ప్రతిపాదించింది. వీటినే జగనన్న స్మార్ట్‌టౌన్‌షి్‌పలుగా పిలుస్తున్నారు. 


ఆయా ప్రభుత్వ శాఖలకు ఇంతకు ముందు వివిధ సందర్భాల్లో రాష్ట్ర సర్కారు కేటాయించిన విలువైన భూముల్లో ఉపయోగించనివి, ఆయా శాఖలు సొంతంగా సమకూర్చుకున్నా ఆయా అవసరాలకు వాడని భూములను జగనన్న స్మార్ట్‌టౌన్‌షి్‌పలకు అందించాలి. ఆ భూముల వివరాలను ఆయా శాఖలు ముందుగా కలెక్టర్‌కు తెలియజేయాలి. నిబంధనల ప్రకారం వాటిలో అవసరమైనవి కలెక్టర్‌ గుర్తించి ముందుగానే పొజిషన్‌లోకి తీసుకొని పురపాలక శాఖకు అందించాలి. ఈ మేరకు కలెక్టర్లకు అధికారం కల్పించారు. ఏయే సంస్థలకు ఇచ్చిన, ఎలాంటి భూములను పొజిషన్‌లోకి తీసుకోవాలి? వేటిని ముట్టుకోకూడదన్న అంశంపై స్పష్టత ఇచ్చారు. 


ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విభాగాలు, అభివృద్ధి సంస్థలు, నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఇంతకు ముందు జీవో 57 ప్రకారం భూములు కేటాయించి, వాటి వినియోగంలో నిబంధనల ఉల్లంఘన జరిగినవి, ఆ భూములను ఉపయోగించని పక్షంలో, ఒక వేళ ఆయా సంస్థలు సమకూర్చుకున్న భూములు ఉపయోగించుకోని పక్షంలో వెనక్కితీసుకొని వాటిని పురపాలకశాఖకు అందించాలి. ఆ శాఖకు పొజిషన్‌ ఇచ్చిన భూములను జగనన్న స్మార్ట్‌టౌన్‌షి్‌పల కోసం ఉపయోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ భూములను స్వేచ్ఛగా ఉపయోగించుకునేందుకు భూ సేకరణ, పునరావాస చట్టంలోని సెక్షన్ల కింద ఇటీవలే మినహాయింపునిస్తూ ప్రజోపయోగ జాబితాలో చేర్చారు. 


ఈ భూములు వద్దు..

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి్‌పల కోసం దేవదాయ, ధర్మాదాయ శాఖ భూములను ముట్టుకోకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇంకా విద్యాశాఖ, విద్యాసంస్థలు, వక్ఫ్‌, ఇతర ధార్మిక సంస్థల భూములు, పర్యావరణపరంగా సున్నితమైనవి, చెరువులు, కాలువలు, ఇతర నీటి వనరులున్నవి, ఎత్తై న కొండ ప్రాంతం, అభ్యంతరక రమైన భూములు, కమ్యూనిటీ పోరంబోకు భూములను స్మార్ట్‌టౌన్‌షిప్‌ కోసం ముట్టుకోవద్దని స్పష్టం చేశారు.

Updated Date - 2021-07-28T08:22:33+05:30 IST