ఇప్పటికైనా మొద్దునిద్ర వీడండి

ABN , First Publish Date - 2020-08-09T08:47:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి, కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు...

ఇప్పటికైనా మొద్దునిద్ర వీడండి

  • కరోనా కట్టడికి చర్యలు తీసుకోండి.. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
  • నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధుల హెచ్చరిక 

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి, కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు. కరోనా వ్యాప్తి నిత్యం ఉధృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదల ప్రాణాలను కాపాడాలని, కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుప్రతుల్లో కరోనా చికిత్స ఫీజులను నియంత్రించాలని నేతలు కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నాయకుడు నరసింహారావు, టీడీపీ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నేత కె.గోవర్ధన్‌ భేటీ అయ్యారు. చాడ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితిని సీఎం సమీక్షించకపోవడం శోచనీయమన్నారు.


ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఫీజులను నియంత్రించాలని హైకోర్టు ఆదేశించినా స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కోదండరాం మాట్లాడుతూ కరోనా కారణంగా పారిశ్రామిక సంస్థలు మూతపడుతున్నాయని, కుటుంబాలు ఆర్థికంగా విచ్ఛిన్నం అవుతున్నాయని, వాటిని ఆదుకోవాలని అన్నారు. రమణ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రగతికి అడ్డుపడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొనడాన్ని ఖండించారు. కేసీఆర్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మానుకుని కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 15వ తేదీలోగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.


Updated Date - 2020-08-09T08:47:34+05:30 IST