పట్టా రిజిస్ట్రేషన్‌ వట్టిమాటే!

ABN , First Publish Date - 2021-01-11T08:00:31+05:30 IST

‘భవిష్యత్‌లో న్యాయస్థానాల్లోని కేసులు పరిష్కారమైన తదుపరి.. ప్రభుత్వం ముందుగా భావించిన ప్రకారం మీకు ఇంటిస్థలం రిజిస్ట్రేషన్‌ చేయించాలన్న నా ఆశయం దేవుడి దయతో త్వరగా నెరవేరుతుందని భావిస్తున్నాను.

పట్టా రిజిస్ట్రేషన్‌ వట్టిమాటే!

  • సీఎం లేఖ కంటితుడుపే.. కేంద్ర చట్టానికి భిన్నంగా అసాధ్యం?
  • సుప్రీంకోర్టులోనూ నిలబడదు
  • అయినా దేవుడి దయతో రిజిస్ట్రేషన్‌ ఎలా?
  • ప్రజల్లో భ్రమలు కల్పించడానికే!
  • మాట తప్పారన్న విమర్శ రాకుండా.. ప్రత్యర్థులపై నిందలు మోపే ఎత్తు?
  • పోనీ కోర్టులో సానుకూలత వచ్చినా..‘డీకేటీ’ పట్టాలు వెనక్కి తీసుకోవాలి
  • అలా చేయకుండా కన్వేయెన్స్‌ డీడ్‌లరిజిస్ట్రేషన్‌ చరిత్రలోనే జరగలేదు
  • జగన్‌ హామీలకు చట్టబద్ధత లేదు
  • అధికార వర్గాల మనోగతం

డీకేటీ పట్టాల రిజిస్ట్రేషన్‌ సాధ్యం కాదు. కేంద్ర అసైన్‌మెంట్‌ చట్టంతో పాటు రాష్ట్ర అసైన్‌మెంట్‌ చట్టం కూడా దీనిని అనుమతించదు. ఈ విషయమై అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా.. హడావుడిగా ఇంటి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌.. దేవుడి దయతో డి-పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని చెప్పడం ప్రజలను భ్రమల్లో పెట్టేందుకేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘భవిష్యత్‌లో న్యాయస్థానాల్లోని కేసులు పరిష్కారమైన తదుపరి.. ప్రభుత్వం ముందుగా భావించిన ప్రకారం మీకు ఇంటిస్థలం రిజిస్ట్రేషన్‌ చేయించాలన్న నా ఆశయం దేవుడి దయతో త్వరగా నెరవేరుతుందని భావిస్తున్నాను..’ ఇదీ ముఖ్యమంత్రి జగన్‌ ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు రాసిన లేఖలో పేర్కొన్న ముఖ్యమైన అంశం. అంటే.. కోర్టు కేసు తేలాక.. సర్కారు ఇచ్చిన డీకేటీ పట్టాలను పేదల పేరిటే రిజిస్ట్రేషన్‌ చేస్తారనే కదా దీనర్థం. లేక పేదలకు ఇచ్చిన డీ పట్టాలను పూర్తిగా ఉపసంహరించుకుని 30 లక్షల మందికి కన్వేయెన్స్‌ డీడ్‌లు ఇచ్చి వాటిని రిజిస్ట్రేషన్‌ చేస్తారా? అసలు కేంద్ర అసైన్‌మెంట్‌ చట్టానికి భిన్నంగా ఐదేళ్లకు అమ్ముకోవడానికి ఆస్కారం ఉందా? ఇప్పుడు పేదలను వేధిస్తున్న ప్రశ్నలివి. సీఎం అంతటి వ్యక్తి రాసిన లేఖలో దేవుడి దయతో రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పడంతో సహజంగానే ఆశలు పెరిగాయి. అయితే ఇవేవీ సాంకేతికంగా, చట్టప్రకారం ఆచరణ సాధ్యం కాదని అధికార వర్గాలు తేల్చిచెబుతున్నాయి. కన్వేయెన్స్‌ డీడ్‌లపై మాట తప్పారన్న విమర్శ రాకుండా.. రాజకీయంగా ఇతరులపై నిందలు మోపి.. పేదలను భ్రమల్లో ఉంచడానికే జగన్‌ లేఖలో ఈ విషయం ప్రస్తావించారని అంచనా వేస్తున్నాయి.


దీనిపై రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ చట్టం-1977, రెవెన్యూ బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ (బీఎ్‌సవో) ప్రకారం.. ‘డీ’ పట్టాలిచ్చిన వారికి వాటిని వెనక్కి తీసుకోకుండా లేదా రద్దుచేయకుండా.. కన్వేయెన్స్‌ డీడ్‌లు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేయడం అన్నది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒకవేళ రాష్ట్ర చట్టానికి సవరణ చేసినా.. కేంద్ర చట్టానికి భిన్నంగా ఉండే దీనిని సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా? పోనీ ప్రభుత్వ వాదనకు కోర్టు సమ్మతించినా.. ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ చట్టం సవరణ చేయకుండా పట్టాల రిజిస్ట్రేషన్‌ సాంకేతికంగా సాధ్యం కాదన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. ఏ కోణంలో నుంచి చూసినా సీఎం ఇచ్చిన హామీకి చట్టబద్ధత కనిపించడం లేదు. అలాంటప్పుడు చట్టపరిధిలోని అంశాలను దేవుడి దయతో అమలు చేస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 


కొత్త భ్రమలు కల్పించడమేనా? 

దేశవ్యాప్తంగా పేదలకు సాగుతోపాటు ఇంటిస్థలాలను అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారమే ఇస్తున్నారు. నిర్దేశిత నిబంధనలతో వాటిపై పేదలకు హక్కులు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే భూమి విలువైనది కాబట్టి అది పరాధీనం కాకూడదని, పేదల జీవితాలకు అది ఉపయోగపడాలన్న సంకల్పంతోనే హక్కులు బదలాయించడాన్ని నిషేధించారు. కేంద్ర చట్టాల్లోనూ, రాష్ట్ర అసైన్‌మెంట్‌ చట్టంలోనూ ఇదే అంశం ఉంది. పేదలకు ఇచ్చే ఇంటిస్థలాలను 20 ఏళ్లపాటు అమ్ముకోకూడదు, కొనుగోలు చేయకూడదంటూ 2019లో ప్రభుత్వం చట్టసవరణ చేసింది. అంతకుముందు చట్టంలో ఉన్న ఐదేళ్ల నిషేధ కాలపరిమితిని రద్దుచేసి.. 20 ఏళ్లను చేర్చారు. అసైన్డ్‌ ఇంటి స్థలాలు పేదల చేజారిపోకూడదని, ఒక కుటుంబానికి జీవితంలో ఒకసారికి ఇచ్చే ఇంటిస్థలాన్ని ఆర్థిక అవసరాలకు అమ్ముకుని.. మళ్లీ రోడ్డునపడి నిరాశ్రయులు కాకుండా ఉండాలన్న లక్ష్యంతోనే 20 ఏళ్ల నిషేధం తీసుకొచ్చారు. కన్వేయెన్స్‌ డీడ్‌లు ఇవ్వాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినప్పుడల్లా అధికారులు అసైన్‌మెంట్‌ చట్ట నిబంధనలను ఏకరువు పెట్టారు.


అలా ఇవ్వడం సాధ్యం కాదన్నా.. ఆయన పెడచెవిని పెట్టారు. చివరకు కన్వేయెన్స్‌ డీడ్‌లే ఇస్తామని గత ఏడాది ఫిబ్రవరిలో జీవో 44ను విడుదల చేశారు. వాటికి చట్టబద్ధత ఎక్కడుందన్న ప్రశ్నకు ప్రభుత్వం బదులివ్వలేకపోవడంతో హైకోర్టు ఆ జీవోను సస్పెండ్‌ చేసింది. ‘ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు విచారణకు రాకముందే.. అసైన్‌మెంట్‌ చట్టం కింద పేదలకు ఇచ్చే ఇంటిస్థలాలను 20 ఏళ్లపాటు అమ్మడం, కొనడం నిషిద్ధమంటూ గత ఏడాది రూల్స్‌ను విడుదల చేసింది. ఈ చట్టం అమల్లో ఉండగా.. ఐదేళ్ల తర్వాత అమ్ముకునే వీలు కల్పించే కన్వేయెన్స్‌ డీడ్‌లకు ఏ ప్రాతిపదికన అనుమతించాలని కోర్టు ప్రశ్నిస్తే బదులివ్వడానికి అధికారులు సమాధానం వెతుక్కుంటున్నారు’ అని ఓ సీనియర్‌ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. కోర్టులో కేసు తేలకముందే మళ్లీ పాత పద్ధతిలోనే సర్కారు డీపట్టాలు ఇచ్చింది. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక దేవుడి దయతో పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయాలన్న తన ఆశయం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదెలా సాధ్యమన్న అంశంపై ఇప్పుడు చర్చ సాగుతోంది.

Updated Date - 2021-01-11T08:00:31+05:30 IST