అమ్మమ్మ.. కోచ్‌.. ఓ తమిళమ్మాయి

ABN , First Publish Date - 2021-07-21T05:30:00+05:30 IST

అమ్మమ్మ.. కోచ్‌.. ఓ తమిళమ్మాయి

అమ్మమ్మ.. కోచ్‌.. ఓ తమిళమ్మాయి

అమ్మానాన్న లేరు, దురదృష్టవంతురాలన్నారు. అయితే ఆ బిడ్డను అమ్మమ్మ కంటికి రెప్పలా పెంచుకుంది. పస్తులున్నా సరే మనమరాలిని చదివించాలనే కోరిక తన అవ్వది. అవ్వకోసం ఏదైనా చేయాలని ఆకలి మంటను దిగమింగుకుని కష్టపడింది.  కనీసం బూట్లు కొనలేని స్థితిలో.. ఒట్టికాళ్లతో పరిగెత్తిన ఆ అమ్మాయి.. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడా సంగ్రామంలో తన సత్తా చాటడానికి సన్నద్ధమవుతోంది. ఆ రన్నర్‌ పేరు రేవతి వీరమణి.


‘‘నవంబర్‌, 2020..

మోకాలి నొప్పితో రన్నింగ్‌ ట్రాక్‌కు దూరమయ్యా. గాయం గట్టిగా సలుపుతుంటే కన్నీళ్లు రాలేవి. దీనికి తోడు కొన్ని నెలలపాటు కాలు బయటికి పెట్టకూడదని వైద్యులు చెప్పారు. మొండిగా వెళ్తే మాత్రం ఇబ్బంది పడతావన్నారు. వాస్తవానికి అలాంటి కష్టాలు నాకు కొత్తేం కాదు. ఆ మాటకొస్తే.. నా దయనీయకరమైన బాల్యంతో పోలిస్తే.. ఈ గాయం ఓ లెక్కేకాదు.


అమ్మమ్మ.. మా అమ్మానాన్న!

పరిగెత్తినపుడు కిందపడి దెబ్బలు తగిలించుకోవడం.. చూసిన మా అమ్మమ్మ కోప్పడేది. అంతలోనే బాధపడేది. నాకు తోడు మా చెల్లెలు ఉంది. మా ఇద్దరికి తిండిపెట్టి, బాగోగులు చూసుకుని, బుద్ధులు చెప్పి.. బడికాడ వదిలేసేది. మా అమ్మమ్మ పేరు ఆరమ్మల్‌. మధురై దగ్గర ఉండే సక్కిమంగళం మా ఊరు. తిట్టినా, కొట్టినా, ముద్దుపెట్టుకున్నా.. అంతా తానే. ఆమే మా లోకం. తను చేలో కూలిపనికి వెళ్లేది. ఇటుకలు మోసేది. ఇద్దరు మనమరాళ్లంటే ప్రేమ. తల్లీతండ్రీలేని మాకు అమ్మమ్మే దిక్కూ, మొక్కు. తను స్వతహాగా నిబ్బరంగా ఉండేది. చదువుకోమనేది. నాకేమో కాళ్లూ, చేతులు ఊరికే ఉండవు. నడవకుండా పరిగెత్తడమే నాకు ఇష్టం. కిందపడి దెబ్బలు తగిలితే గాయాలకు కట్టు కట్టేది. ‘‘మీ నాన్నకు కడుపునొప్పి వచ్చి సచ్చిపాయ. నా బిడ్డకు తలకాయలో ఏదో రోగం వచ్చి పాయ’’ అంటూ నిద్రపోయేప్పుడు బాధపడేది. ఎలాగైనా మమ్మల్ని పెద్ద చదువులు చదివించాలని కలలు కనేది. కూలిపనికి వెళుతూ.. ‘‘పరిగెత్తే పోటీలు పెట్టుకుంటే కాళ్లు విరగ్గొడతా’’ అనేది అమ్మమ్మ. 


అమ్మమ్మ కోసమే... 

నా ఏకాగ్రత అంతా పరుగుమీదే. నా కోపం అంతా నా పేదరికం మీదే ఉండేది. గట్టిగా పరిగెత్తి నా పేదరికాన్ని దాటేయాలనిపించేది. మా అమ్మమ్మను బాగా చూసుకోవడానికే వేగంగా పరిగెత్తాలనిపించేది. 2006లో ఆసియన్‌ గేమ్స్‌(దోహా)లో మనదేశం తరఫున ట్రాక్‌లోకి దిగి నాలుగో స్థానం సాధించా. 2016లో జూనియర్‌ నేషనల్స్‌లో వందమీటర్లు, రెండు వందలమీటర్లలో బంగారు పతకాలు సాధించా. సీనియర్‌ నేషనల్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించా. 2016లో  ఉత్తరాదికెళ్లి పాటియాలా ప్రాంతంలో శిక్షణ తీసుకునే అవకాశం వచ్చింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌(ఎన్‌ఐఎస్‌) వారి నేషనల్‌ క్యాంపులో గట్టిగా పోరాడా. ఆ సమయంలోనే కొత్త కోచ్‌ గలీనా బుఖరీనా సర్‌ ‘నాలుగువందల మీటర్ల స్ర్పింటర్‌ అవ్వు’ అన్నారు. నా మెంటర్‌ కణ్ణన్‌ సర్‌ కూడా ‘నీకు తిరుగేలేదు’ అన్నారు. ‘అమ్మమ్మ.. చెల్లెలు.. పేదరికం.. కోచ్‌.. ఇలా అందరూ నా జీవితాన్ని మంచి ట్రాక్‌లోకి తీసుకెళ్లారు’. మీకో విషయం తెలుసా.. ‘ఇంటిపట్టున హాయిగా కూర్చోని తినొచ్చుగా ఆరమ్మల్‌’ అంటూ తెగ సలహాలిస్తున్నారు మా బంధువులు. చుట్టుపక్కనోళ్లకు ‘ఖాళీగా కూర్చుంటే ఎలా. ఏదో పని చేసుకోవాలి’ అంటోంది అమ్మమ్మ. మనమరాళ్లా.. మజాకా!


సీన్‌ కట్‌ చేస్తే..

రేవతి వీరమణి.. గాయాలనుంచి తేరుకుంది. ఒలింపిక్స్‌కోసం ముగ్గురు మహిళా రన్నర్లకోసం అథ్లెటిక్‌ సమాఖ్య ఎంపిక చేస్తోంది. ఆ రోజు. జూలై 4, 2021. కేవలం 53.55 సెకండ్స్‌లో రేవతి చిరుతలా పరిగెత్తింది. తమిళనాడు తరఫున ఒలింపిక్స్‌కు వెళ్లే డజను మందిలో తన పేరును ఖాయం చేసుకుంది. తమిళ స్టార్‌ హీరో రజనీకాంత్‌ నటించిన ఓ సినిమాలో ‘లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చా’ అంటాడు. రేవతి కూడా.. అదీ లెక్క! ఏకంగా జపాన్‌లోని టోక్యో ఒలింపిక్స్‌లోకి అడుగెట్టింది. ఇండియా తరఫున ఈ 23 ఏళ్ల రేవతి వీరమణి 400 మీటర్ల పరుగుపందెంలో బంగారు పతకం కొట్టి తన 76 ఏళ్ల అమ్మమ్మ చేతిలో పెట్టడమే ఆమె ఆశయం. 

రేవతి గెలవడం, గెలవకపోవడం కొన్ని క్షణాలు పక్కనబెడితే.. ‘రేవతి గొప్పస్థాయికి వెళ్తుంద’నే అమ్మమ్మ కలను.. జపాన్‌లోని టోక్యో దాకా తీసుకెళ్లింది. ఇంతకంటే ఏం కావాలి?


గతేడాదినుంచి రేవతి సదరన్‌ రైల్వేలో మధురై డివిజన్‌లో టీటీఇ(ట్రావెలింగ్‌ టికెట్‌ ఎగ్జామినర్‌)తో పాటు కమర్షియల్‌ క్లర్క్‌ ఉద్యోగం చేస్తోంది. ‘రేవతి వీరమణి.. ఇండియా తరఫున టొక్యో ఒలంపిక్స్‌కు వెళ్లే రన్నర్‌’ అంటూ దక్షిణాది రైల్వే సంస్థ ట్వీట్‌ చేసింది. ఇది వైరల్‌గా మారి.. రేవతి పేరు మార్మోగిపోయింది. ఆమె చెల్లెలు మధురైలో పోలీసు ఉద్యోగం చేస్తోంది. ఒలంపిక్స్‌కు వెళ్లే రెండు రోజుల ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ అందరితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున అన్ని వసతులు కల్పిస్తామన్నారు. గోల్డ్‌ మెడలిస్టులకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఆటగాళ్లతో పాటు కోచ్‌లకు ఆయన అభినందనలు చెప్పారు. అమ్మమ్మ, చెల్లెలు సెండాఫ్‌ ఇవ్వగా రేవతి జపాన్‌కు వెళ్లింది. 


ఒట్టికాళ్లతో పరిగెత్తా..

నాతో పాటు చెల్లిని చూసుకోవడం మా అమ్మమ్మకూ కష్టమైన పనే. తక్కువ కూలి డబ్బులతో ముగ్గురికీ బతుకు భారమయ్యేది. దీంతో రెండో తరగతి నుంచి మా ఇద్దరినీ గవర్నమెంట్‌ హాస్టల్‌లో వేసింది. అక్కడయినా వేళకు ఇంత బువ్వ దొరుకుతుందని. అమ్మమ్మకు బుద్ధిపుట్టినపుడు.. నెలకు ఒకట్రెండు సార్లు మా హాస్టల్‌కు వచ్చేది. అది కూడా ఆదివారాల్లో. సెలవురోజుల్లో మేం ఇద్దరం అమ్మమ్మతోనే గడిపేవాళ్లం. నేను కరికులమ్‌ యాక్టివిటీస్‌లో ముందుండేదాన్ని. మా చెల్లికూడా బాగా పరిగెత్తేది. ఇంటర్‌  రెండో సంవత్సరంలో నేను రన్నింగ్‌ రేస్‌ పోటీలో పాల్గొన్నా. అది జోనల్‌ లెవల్‌ పోటీ. బూట్లు కొనుక్కోవడానికి స్థోమత లేదు. అందుకే ఆ పొద్దు.. ఒట్టికాళ్లతోనే పరిగెత్తాలనుకున్నా. అలానే పరిగెత్తా. మా కోచ్‌ కణ్ణన్‌ సర్‌ గమనించారు. ‘నీకు నేను శిక్షణ ఇస్తానమ్మా’ అన్నారు. ‘నా చదువు అయిపోయిన తర్వాతనే ఏదైనా. మా అమ్మమ్మ ఒప్పుకోవాల’న్నాను సర్‌తో. 


అలా ట్రాక్‌మీదకు..

కోచ్‌ కణ్ణన్‌ సర్‌ మా ఇంటిని వెతుక్కుంటూ వెళ్లారు. తమిళనాడు స్పోర్ట్స్‌ అథారిటీలో పెద్దపోస్టు అయిన ఆయన అమ్మమ్మ దగ్గరకు వెళ్లటం వింతగా తోచింది. ‘మీ రేవతి టాలెంట్‌. భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకుంటుంది. శిక్షణ ఇస్తాను’ అంటూ మాట్లాడారు. మా అమ్మమ్మ ఒప్పుకోనేలేదు. అందుకు కారణం పేదరికమే. రెండు, మూడుసార్లు మా ఇంటికొచ్చారు. మా అమ్మమ్మ తన బాధలను చెప్పింది. మంచి తిండి, మంచి బట్టలు ఇవ్వలేనంది. అధికారులను ఒప్పించి ఉచితంగా శిక్షణ ఇవ్వటానికి ముందుకొచ్చారాయన. నాకు ఆహారంతో పాటు అకామిడేషన్‌ ఇప్పిస్తానన్నారు. అయినప్పటికీ వద్దనుకున్నా. ఎందుకంటే.. ఇంటినుంచి స్టేడియానికి వెళ్లి రావాలంటే నలభై రూపాయల బస్సు చార్జీ అవుతుందని. దీన్ని అధిగమించేందుకు.. స్టేడియం దగ్గరలో ఉండే లేడీ డోక్‌ కాలేజీలో స్పోర్ట్స్‌కోటా కింద ఉచితంగా హాస్టల్‌ వసతి కల్పించారు. దీంతో ఎక్కువ సమయం నేను రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేసేదాన్ని. అలా ట్రాక్‌ మీదకు పూర్తిగా వచ్చేశా. నా శక్తి అంతా పరిగెత్తడానికే ఉపయోగించా. ఈ లోపల నా చెల్లెలు కూడా ఆ ట్రాక్‌కు వచ్చి తనూ రన్నింగ్‌ చేసింది. పోలీసు ఉద్యోగం సంపాదించాక మా కుటుంబం ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడింది. అలా ట్రాక్‌.. మా ఇద్దరినీ సెట్‌ చేసింది.

Updated Date - 2021-07-21T05:30:00+05:30 IST