Abn logo
Nov 28 2020 @ 00:10AM

‘గ్రేటర్‌’ సవాల్‌

  • శివార్లలో పట్టుకోసం చెమటోడుస్తున్న ఉమ్మడి జిల్లా నేతలు
  • ఇద్దరు మంత్రులకూ ప్రతిష్టాత్మకం
  • ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు టీఆర్‌ఎస్‌ తంటాలు
  • చాపకింద నీరులా దూసుకుపోతున్న బీజేపీ
  • పరువు కోసం కాంగ్రెస్‌ నేతల తంటాలు


గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలు బిజీబిజీగా ఉన్నారు. ప్రధాన పార్టీలన్నీ శివారులోని అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ఉమ్మడి జిల్లా నాయకులకు అప్పగించడంతో వారు ఎన్నికలను సవాల్‌గా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీకి కమలనాథులు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండటంతో టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడు తున్నారు. బీజేపీ కూడా ఢిల్లీ నాయకులను గల్లీలోకి దించుతోంది. బస్తీమే సవాల్‌ అంటూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ కూడా తన ఓటు బ్యాంకును నిలబెట్టుకు నేందుకు  ముమ్మరంగా ప్రయత్నిస్తుంది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నేతలకు సవాల్‌గా మారాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ నేతలు ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు చెమటోడుస్తున్నారు. గ్రేటర్‌ ఎన్ని కలు భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత గ్రేటర్‌ ఎన్నికల్లో శివార్లలో దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసిన టీఆర్‌ఎస్‌.. ఈసారి మాత్రం కలవరపడుతోంది. కారుకు శివార్లలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. దుబ్బాక ఫలితం జోష్‌తో కమలం అనూహ్యంగా దూసుకుపోతోంది. అనేకచోట్ల బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తూ టీఆర్‌ఎస్‌కు సవాళ్లు విసురుతోంది. గ్రేటర్‌లో సత్తా చాటేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను తెరపైకి తెస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పార్టీ అగ్రనేతలంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. దాదాపు కేంద్ర నాయకత్వం మొత్తం గ్రేటర్‌ ఎన్నికలపై ఫోకస్‌  పెట్టింది. అంతుచిక్కని వ్యూహాలతో అధి కార టీఆర్‌ఎస్‌ను ఢీ కొడుతోంది. దీంతో  గ్రేటర్‌ ఎన్నికలు రంజుగా మారాయి. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, కాం గ్రెస్‌ నేతలు గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకత్వం డివిజన్ల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తిష్టవేశారు. అయితే మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డిలతోపాటు శివారు ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గ్రేటర్‌ ఎన్నికలు ఇజ్జత్‌కా సవాల్‌గా మారాయి. వీరు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ప్రతికూల ఫలితాలు వస్తే ఇటు టీఆర్‌ఎస్‌ పార్టీతోపాటు వ్యక్తిగతంగా కూడా భారీ మూల్యాన్ని చెల్లిం చుకోవాల్సి వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీగా ఓట్లు కోల్పో యింది. శివారు ప్రాంతాల్లో ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలో టీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది. చేవెళ్ల పార్ల మెంట్‌ స్థానంలో స్వల్ప మెజార్టీతో బయటపడింది. అయితే ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్‌ ఎన్నికల్లో పరిస్థితి కొంత పుంజుకోవచ్చని టీఆర్‌ఎస్‌ భావించినప్పటికీ పరిస్థితి మొత్తం తారుమారైంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ నుంచి పోటీ ఎదు ర్కొన్న టీఆర్‌ఎస్‌.. గ్రేటర్‌ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీతో సవాల్‌ ఎదుర్కొంటోంది. గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లపై వ్యతిరేకత బాగా పెరిగింది. ఈ ఎన్నికల్లో దాదాపు సిట్టింగ్‌లందరికీ మళ్లీ అవకాశం కల్పించారు. ఇది కూడా టీఆర్‌ఎస్‌ కొంపముంచే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితులను బీజేపీ అనుకూలంగా మలుచుకుంటోంది. 


నాడు స్వీప్‌.. మరి నేడు?

 ఇదిలాఉంటే ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో 64 డివిజన్లు ఉండగా ఇందులో 62 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌, బీజేపీలకు చెరొకటి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ స్థానాలను గణనీయంగా పెంచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ దూకుడుగా ఉంది. గత ఎన్నికల్లో ఒక్క ఆర్కేపురం డివిజన్‌లో విజయం సాఽఽధించిన బీజేపీ.. ఇప్పుడు శివార్లలో సగం స్థానాలకుపైగా గురిపెట్టింది. అనేక చోట్ల అధికార పార్టీతో నువ్వా-నేనా అన్నట్లుగా పోటీపడుతోంది. అలాగే కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా పరిధిలో నాచారం డివిజన్‌లో మాత్రమే విజయం సాఽధించగా.. ఈసారి రెండు డిజిట్లు సాఽఽధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిఽధిలో ఎక్కువ దృష్టిసారించింది. ఇక్కడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో గణనీయంగా ఓటు బ్యాంకు సాఽధించిన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో పరపతి కాపాడుకునే యత్నం చేస్తోంది. పీసీసీ రేస్‌లో ఉన్న రేవంత్‌ రెడ్డికి కూడా ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. తాను ప్రాతినిథ్యం వహి స్తున్న పార్లమెంట్‌ పరిధిలో ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు శ్రమిస్తు న్నారు. ఇక గత ఎన్నికల్లో కూకట్‌పల్లి డివిజన్‌లో మాత్రమే విజయం సాఽధించిన టీడీపీ.. ఈసారి ఈ సంఖ్యను పెంచుకునే యత్నం చేస్తోంది. అయితే బలమైన నాయకత్వం లేకపోవడంతో టీడీపీ డీలాపడింది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న శివారు ప్రాంతాల్లో ఇప్పుడు నాయకత్వం కరువైంది.


ఎల్‌బీనగర్‌లో అత్యధికం

ఉమ్మడిజిల్లాలో గ్రేటర్‌ పరిధిలో 64డివిజన్లు ఉండగా.. ఇందులో అత్యధికంగా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉన్నాయి. అలాగే శేరిలింగంపల్లిలో 10, ఉప్పల్‌లో 10, కూకట్‌పల్లిలో 9, మల్కాజిగిరిలో 9, కుత్బుల్లాపూర్‌లో 8,  రాజేంద్రనగర్‌లో 5, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో 2డివిజన్లు ఉన్నాయి. 

Advertisement
Advertisement