యాభైం శాతం ఎందుకు దాటలేదు?

ABN , First Publish Date - 2020-12-04T12:23:47+05:30 IST

ఎన్నికల రోజంటే పల్లెవాసులకు పెద్దపండగ. ఆ రోజు కొత్తబట్టలేసుకొని, పోలింగ్‌ బూత్‌కు బాటకట్టే వాళ్లు బోలెడు మంది. ఓటరు కార్డులో పేరు తారుమారైనా, ఇతర సమస్యలు ...

యాభైం శాతం ఎందుకు దాటలేదు?

‘‘పోలింగ్‌ డే...పల్లెల్లో పండగ రోజు. అదే నగరంలో కేవలం హాలిడే మాత్రమేనా. యాభైశాతం ఓట్లు కూడా నమోదుకాకపోడానికి కారణం... నగరవాసి అలసత్వమా లేక అసమ్మతా.! నగర ఓటరు పోలింగు బూత్‌కెళ్లేందుకు వెనకాడిన కారణాలపై రాజకీయ, సామాజిక విశ్లేషకుల అభిప్రాయాలతో...!’’


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఎన్నికల రోజంటే పల్లెవాసులకు పెద్దపండగ. ఆ రోజు కొత్తబట్టలేసుకొని, పోలింగ్‌ బూత్‌కు బాటకట్టే వాళ్లు బోలెడు మంది. ఓటరు కార్డులో పేరు తారుమారైనా, ఇతర సమస్యలు తలెత్తినా గ్రామీణులు అస్సలూరుకోరని కొందరి అభిప్రాయం. అధికులు ఓటును తమ అస్తిత్వానికి గుర్తింపు కార్డుగా భావిస్తారు. అందుకే పల్లె ఎన్నికలప్పుడు నగరాల నుంచి కొన్ని వందల బస్సులు క్యూ కడతాయి. బస్సు, రైళ్లలో సీటు దొరక్కుంటే, నిల్చోనైనా ఊరెళ్లి ఓటేసొచ్చే గ్రామీణులు చాలామందే. అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఓటు వినియోగాన్ని అస్సలు మిస్‌కారు. అదే నగరాల్లో వాతావరణం పూర్తి భిన్నం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగు 45శాతంతో గట్టెక్కుతున్నాయి. ‘నగరపాలక మండలి ఎన్నికల్లో యాభైశాతం పోలింగు నమోదుకావాలంటే, మరో యాభై ఏళ్లు పడుతుందేమో’ అని ఎత్తిపొడిచేవాళ్లూ లేకపోలేదు. బల్దియా ఓటింగు శాతంపై సామాజిక మాధ్యమాల్లోనూ వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు విపరీతంగా ట్రోల్‌ అవుతున్నాయి. ‘‘ఓటేయని వాళ్లకు ప్రభుత్వ పథకాలు రద్దుచేయాలని’’ ఏకంగా ఒక ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


సమస్యల ప్రస్తావనెక్కడ....

కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్టు, బల్దియా పోలింగు శాతం తగ్గడానికి కూడా పలు కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా మున్సిపల్‌ ఎన్నికలపట్ల నగరవాసుల్లో నిర్లిప్తత నెలకొనుంటుంది. అందుకు కారణం, స్థానిక నేతలపట్ల సదాభిప్రాయం లేకపోవడం. మరొకటి, అభ్యర్థుల గురించి తెలియకపోవడం. వీటికి తోడు ఈ సారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జాతీయ స్థాయి ప్రచార సరళిని తలపించాయి. కొందరు జాతీయ నాయకులూ, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ప్రచారంలో పాల్గొన్నారు. దాంతో దేశరాజకీయాల్లోనూ బల్దియా పోరు ఒక సెంటర్‌ఆఫ్‌ అటెన్షన్‌గా మారాయనడంలో అతిశయోక్తిలేదు. నగర సంస్కరణలపై ఒక సంస్థ చేపట్టిన సర్వేలో, మంచిరోడ్లు కావాలని 67శాతం మంది అడిగారు. ప్రజారోగ్యం మెరుగుపర్చాలని 54శాతం మంది కోరారు. పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని 61శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మెరుగుపరచాలని 34శాతం మంది విన్నవించారు. సగటు నగరవాసి మంచిరోడ్లు, పరిశుభ్రత, సక్రమమైన డ్రైనేజీ వ్యవస్థ, ప్రజారోగ్యం తదితర సౌకర్యాలను ఆశిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగర సమస్యలపై చర్చకు అవకాశమే లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్సీ ఆచార్య కె.నాగేశ్వర్‌ చెబుతున్నారు. ప్రజలకు సంబంధంలేని అంశాలతో ప్రచారపర్వం కొనసాగడంకూడా నగర ఓటింగ్‌ తగ్గడానికి ఒక ప్రధాన కారణమని ఆయన వ్యక్తంచేస్తున్నారు. 


కొవిడ్‌ వల్ల....

బల్దియా ఎన్నికలపై కొవిడ్‌ ప్రభావం చూపిందని విశ్లేషకుల అభిప్రాయం. కరోనా భయంతో కొందరు పోలింగు బూత్‌కెళ్లడానికి సంశయించారు. లాక్‌డౌన్‌ వల్ల మరికొందరు ఉపాధి, ఉద్యోగావకాశాలు కోల్పోయి సొంతూర్లకి వెళ్లారు. అలా ప్రత్యక్షంగా, పరోక్షంగా కొవిడ్‌ పోలింగు తగ్గడానికి మరొక ప్రధానకారణంగా నిలిచింది. ఓటింగు స్లిప్‌లు తారుమారు, ఒకే కుటుంబంలోని వ్యక్తులకు వేర్వేరు పోలింగు బూత్‌లలో ఓటు ఉండటం తదితర లోపాలూ ఓటర్లను కొంత వెనక్కిలాగాయని ఆచార్య కె. నాగేశ్వర్‌ విశ్లేషిస్తున్నారు.


మేయర్‌ అభ్యర్థిని ప్రకటించకుండా....

బల్దియా ఎన్నికలపై స్థానికుల్లో కొంత చిన్నచూపుంది. అందుకు కారణం, స్థానిక అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకోవడమే. నగర ప్రథమ పౌరుడి అభ్యర్థిని ముందే ప్రకటించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనడంలో సందేహం లేదు. అభ్యర్థుల సామర్థ్యంపై చర్చసాగకుండా, ఓటరు వాళ్లను నమ్మేదెలా. స్థానిక సంస్థల్లో మేయర్‌, జిల్లా ఛైర్మన్‌  తదితర పదవులకు ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు ఎంసీహెచ్‌ మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించారు. అదొక మంచి అడుగు. తర్వాత సీఎం వైఎస్‌ ఆ విధానాన్ని రద్దుచేశాడు. తద్వారా మేయర్‌ అధికారాలను తగ్గించినట్లు అయింది. ఇప్పుడూ అదే కొనసాగుతోంది. నగర పాలక మండలికి స్వయంప్రతిపత్తిని కల్పించడంద్వారా నగరవాసుల్లో కొంత విశ్వాసం పెంచగలం. అప్పుడే ఓటింగు శాతం పెరుగుతుంది. ఈ విషయంలో పల్లెను, పట్టణాన్ని పోల్చలేం. గ్రామాల్లో పరిస్థితులు పూర్తి భిన్నం.

- ఆచార్య సి.రామచంద్రరావు, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ స్టడీస్‌


 మొబైల్‌ పోలింగ్‌ కేంద్రాలు...

బల్దియా ఎన్నికల ప్రచారంలో నగర సమస్యలు పక్కకెళ్లాయి. అనవసరమైన అంశాలు తెరమీదకొచ్చాయి. అవి నగరవాసుల్లో ఒకలాంటి నిరాసక్తతను తీసుకొచ్చాయనిపిస్తోంది. రాజకీయ పార్టీల ధోరణి, గెలిచాక పార్టీ మారడం వంటి సంస్కృతిపై సగటు ఓటరుకి విరక్తి కలిగింది. ఇప్పుడున్న ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒక్కటే అని కొందరి అభిప్రాయం. అభ్యర్థులు కూడా, ఒక పార్టీలో సీటురాకుంటే, మరొక పార్టీలో చేరుతుంటారు. గెలిచాక, అవకాశం ఉన్న పార్టీలోకి మారతారు. ఇవన్నీ రాజకీయాలపై సామాన్యుల్లో అసమ్మతిని పెంచాయి. దాంతో పాటు కొవిడ్‌ ప్రభావం మరికొంత. ఇవన్నీగాక ఓటర్లజాబితాలో లోటుపాట్లు పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణమయ్యాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న నగరంలో ఇంకా ఓటర్ల జాబితాలో తప్పులు తలెత్తడం అర్థరహితం. మొబైల్‌ పోలింగ్‌ కేంద్రాలు నిర్వహించడం, పోలింగ్‌ బూత్‌ ఎంపికపై ఓటరుకు అవకాశం ఇవ్వడం వంటి కొన్ని పద్ధతులతో పోలింగ్‌ శాతం పెంచేందుకు ప్రయత్నించవచ్చు. కానీ, అలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదనిపిస్తోంది. 

- ఆచార్య కె.నాగేశ్వర్‌, ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు 

Updated Date - 2020-12-04T12:23:47+05:30 IST