Advertisement
Advertisement
Abn logo
Advertisement

గ్రీన్ సిగ్నల్..!

ప్రభుత్వ గురుకులాల పునఃప్రారంభం

హైకోర్టు ఓకే.. విద్యార్థుల భవిష్యత్తు కోసమే..

కొవిడ్‌ నిబంధనలను పాటిస్తాం: ఏజీ ప్రసాద్‌

నేటి నుంచే గురుకులాలు 

జ్వరంతో బాధపడే పిల్లల కోసం ప్రత్యేక గదులు

సందేహం వస్తే స్థానిక పీహెచ్‌సీలో కొవిడ్‌ పరీక్ష

పాజిటివ్‌ అని తేలితే వెంటనే ఇంటికి తరలింపు.. 

పీహెచ్‌సీల సాయంతో నిరంతరం వైద్య పరీక్షలు


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఏడాదిన్నర విరామం తర్వాత గురుకుల విద్యా సంస్థలు గురువారం తిరిగిఏడాదిన్నర విరామం తర్వాత గురుకుల విద్యా సంస్థలు గురువారం తిరిగి తెరుచుకుంటున్నాయి. హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన అనంతరం గురుకులాల పునఃప్రారంభంపై ఉన్నతాధికారులు బుధవారం సర్క్యులర్లు జారీ చేశారు. కొవిడ్‌ మార్గదర్శకాల అనుగుణంగా తరగతి గదిలో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల విషయంలో హెల్త్‌ ప్రొటోకాల్‌ పాటించాలని నిర్ణయించారు. ఎవరైనా విద్యార్థులు జ్వరం, దగ్గు, జలుబుతో బాధ పడుతుంటే క్లాస్‌ టీచర్‌ తక్షణమే ప్రిన్సిపాల్‌కు చెప్పాలి. విద్యార్థిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలి.


కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఎవరికైనా పాజిటివ్‌ వస్తే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి.. వెంటనే ఇంటికి పంపించనున్నారు. పిల్లలు ఎవరైనా సాధారణ జలుబు, జ్వరం బారిన పడితే మిగతా పిల్లలకు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక గదులు సిద్ధం చేశారు. పిల్లల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించేందుకు స్థానిక పీహెచ్‌సీలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఇందుకోసం అవసరమైతే ఆశా, ఏఎన్‌ఎంల సహాయం తీసుకుంటారు. అలాగే, తమ పరిధిలో ఉన్న పార్ట్‌టైం హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఏసీటీ పోస్టులు భర్తీ చేసే విధంగా రీజనల్‌ కోఆర్డినేటర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్యాస్‌సిలిండర్లు, ఇతర వస్తువులు బయటి నుంచి తీసుకొచ్చే వారికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసిన తర్వాతే గురుకులంలోకి అనుమతించనున్నారు.


‘‘గురుకులాల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేశాం. పిల్లల్ని పంపించాలని తల్లిదండ్రులకు సమాచారం అందిస్తాం. విద్యార్థుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని ఉన్నతాధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చర్యలు

గురుకులాలకు టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది 100% హాజరయ్యే విధంగా రీజనల్‌ కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. చాలా కాలం తర్వాత విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నందున వారు ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ముందుగా విద్యార్థులు ఎంత వరకు చదవగలుగుతున్నారో.. అర్థం చేసుకుంటున్నారో.. తెలుసుకుని అందుకు తగ్గట్టుగా బోధన కొనసాగించనున్నారు. 


టీచర్ల రెన్యువల్‌కు ఆమోదం

కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లు, జిల్లాల్లో లోకల్‌బాడీ విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్‌, పార్ట్‌ టైం, గెస్ట్‌ బేసి్‌సలో పనిచేసిన 5,323 మంది టీచర్ల రెన్యువల్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సెప్టెంబరు 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు వీరిని కొనసాగించేందుకు ఆర్థిక శాఖ అంగీకరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు ఓకే

ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని గురుకుల పాఠశాలలనూ ప్రారంభించుకోవడానికి హైకోర్టు బుధవారం ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. సెప్టెంబరు 1నుంచి అన్ని పాఠశాలలనూ తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఎం. బాలకృష్ణ గతంలో హైకోర్టులో పిల్‌ వేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు కొనసాగడంపై పిటిషనర్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. విద్యార్థులు తమకు ఇష్టం ఉంటే పాఠశాలలకు వెళ్లవచ్చని.. స్కూళ్లకు వెళ్లడం తప్పనిసరికాదని పేర్కొంటూ ఆగస్టు 31న హైకోర్టు తీర్పు ఇచ్చింది.


అయితే సాంఘిక సంక్షేమ, ఇతర గురుకులాలను తెరవడంపై మాత్రం స్టే ఇచ్చింది. ఈ స్టేను ఎత్తేయాలని కోరుతూ ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వ్యాజ్యం వేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఏజీ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం గురుకులాలను తెరుచుకోవడానికి అనుమతిచ్చింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement