టీడీపీలో లుకలుకలు!
ABN , First Publish Date - 2021-02-27T15:28:36+05:30 IST
బెజవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య లుకలుకలు తగ్గలేదు. అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
విజయవాడ: బెజవాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య లుకలుకలు తగ్గలేదు. అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో నేతలను బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. నిన్నటివరకు 39వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గురించి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, ఎంపీ కేశినేని నాని మధ్య విభేదాలు కొనసాగాయి. చివరకు నాని సూచించిన శివశర్మ పేరును ఖరారు చేశారు. ఆ తర్వాత బుద్దా వెంకన్న, నాగుల్ మీరాను టీడీపీ అధినేత చంద్రబాబు పిలిపించి బుజ్జగించారు. ఆ తర్వాత అందరినీ అభిప్రాయాల మేరకు 39వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా శివశర్మ పేరును టీడీపీ ఖరారు చేసింది.
39వ డివిజన్ సమస్యను సుఖాంతంగా ముగించారు. ఇంతలోనే బెజవాడలో మరో డివిజన్ చిచ్చురేపుతోంది. 11వ డివిజన్ నుంచి కేశినేని నాని కుమార్తె శ్వేత కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేతను దాదాపుగా ఖరారు చేయడంతో మాజీ ఎమ్మెల్యే బొండ ఉమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలోను తూర్పు నియోజకవర్గం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వారికి మేయర్ అభ్యర్థి ఇచ్చారని, ఈ సారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి వేరే సామాజికవర్గానికి మేయర్ పదవి ఇవ్వాలని ఉమ వాదిస్తున్నారు. దీంతో ఈ పార్టీ నేతలు లోకేష్, అచ్చెన్నాయుడు నచ్చచెప్పడంతో ఉమ సానుకూలత వ్యక్తం చేశారు. అయితే 30వ డివిజన్‌లో గోగుల రమణను కాకుండా గరిమెళ్ల చిన్నాను అభ్యర్థిగా రంగంలోకి దించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై టీడీపీ వర్గాలు కేశినేని నానితో మాట్లాడుతున్నాయి.
గుంటూరు నగరపాలక సంస్థపై కూడా టీడీపీ దృష్టి పెట్టింది. ఇందులోభాగంగా అచ్చెన్నాయుడు విభేదాలన్న ఐదు వార్డుల అభ్యర్థులను పిలిపించి మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థులందరీతో మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకు సూచించారు.