Abn logo
Apr 6 2020 @ 03:50AM

మనస్ఫూర్తిగా విరసంతో ఉన్నారు!

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 23-3-2020 సోమవారం ‘వివిధ’ పేజీలో ‘‘‘కెవిఆర్‌’’తో ఉద్యమ స్నేహానుబంధం’ పేరుతో నిఖిలేశ్వర్‌ రాసిన వ్యాసం అచ్చయింది. అందులో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల గురించిన వివరణను విరసం తరఫున ఇవ్వడానికి ఈ ఉత్తరం రాస్తున్నాం. 


‘‘విరసం అంతర్గత గ్రూపు రాజకీయాలలో సీనియర్స్‌కు ఆసక్తి వుండేదికాదు. ...కెవిఆర్‌ ఎటూ తేల్చుకోలేక సంస్థ బాగోగులు, నిర్వహణ గురించి బాధపడేవారు’’ అని నిఖిల్‌ రాశారు. అలాగే, 1975లో విరసంలో ఏర్పడ్డ చీలిక పరిణామాల అనంతరం, ‘‘కెవిఆర్‌ కొన్ని సంశయాలతోనైనా చివరిదాకా విరసంలో కొనసాగారు’’ అనికూడా రాశారు.


1975 తరవాత కూడా కెవిఆర్‌ విరసం నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి, సభ్యుల చైతన్యాన్ని పెంచడానికి, విరసాన్ని అఖిలభారత స్థాయి నిర్మాణంగా మార్చడానికి ఎంతగానో కృషిచేసిన విషయం అందరికీ తెలుసు. ఇందుకోసం ఆయన దేశవ్యాప్తంగా కూడా పర్యటించారు. అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి వ్యవస్థాపక కార్యదర్శిగా సంస్థను బలోపేతం చేయడానికి వివిధ రాష్ట్రాలలో అనేక సంక్లిష్ట అంశాలపైన సెమినార్లను నిర్వహించడంలో ఆయనది కీలకపాత్ర. 1987లో మద్రా్‌సలో క్యాస్ట్‌-క్లాస్‌ అంశంపై జరిగిన సెమినార్‌కు ఆయన వివరణాత్మకమైన, విశ్లేషణాత్మక సుదీర్ఘ వ్యాసాన్ని రాశారు. ఆ బాధ్యతల్లో భాగంగానే గోవా రాష్ట్ర ప్రభుత్వం మోపిన రాజద్రోహ నేరాన్నికూడా ఎదుర్కొన్నారు. 1993లో హైదరాబాదులో జరిగిన ఏ.ఐ.ఎల్‌.ఆర్‌.సి. మహాసభల దాకా ఆయన దాని ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. విరసం రాష్ట్ర సభల్లో, రాష్ట్రస్థాయి సాహిత్య పాఠశాలల్లో ఆయన లోతైన ప్రసంగాలు అనేకం చేశారు. అరుణతార నిర్వహణలో ఆయన సంపాదకులుగా వున్నప్పుడూ, తదనంతర కాలంలోనూ చేసిన కృషి అపారమైనది. 20యేళ్ళ విరసం సందర్భంగా, పాతికేళ్ళ విరసం సందర్భంగా విరసం రూపొందించుకొన్న స్వీయ విమర్శ పత్రాల తయారీలో ఆయనది కీలకపాత్ర. కెవిఆర్‌ తన మర ణానికి మూడు రోజుల ముందు 1998 జనవరిలో శ్రీకాకుళంలో జరిగిన విరసం రాష్ట్రమహాసభల్లో అధ్యక్ష పదవి స్వీకరించారు. 


సంస్థ భావజాలం పట్ల నిబద్ధత, కార్యాచరణ పట్ల నిమగ్నత లేకుండానే ఆయన ఇంతటి సుదీర్ఘ కృషి చేసారని అంటే అది ఎవరూ నమ్మని కువిమర్శ. సంశయాత్మకంగా కొనసాగడం, అరాకొరా మనస్సుతో పనిచేయడం ఆయన తత్వానికే విరుద్ధం. విరసంతో ఆయనకున్న అనుబంధానికి, విరసం బాధ్యుడిగా, సభ్యుడిగా, మార్గదర్శిగా ఆయన కృషికి సజీవ నిదర్శనం ఆయన రచనలే. అవన్నీ దాదాపు పుస్తక రూపంలో వచ్చాయి. అలాంటిది, నిఖిలేశ్వర్‌ ‘‘కెవిఆర్‌ కొన్ని సంశయాలతోనైనా చివరిదాకా విరసంలో కొనసాగారు’’ అని రాయడం వాస్తవ విరుద్ధం. ఒక వ్యక్తి సజీవుడుగా లేనప్పుడు, తనని తాను స్పష్టంచేసుకునే స్థితిలో లేనప్పుడు అలాంటి వ్యక్తులపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం అచారిత్రకం. రాజకీయ విభేదాల్ని గ్రూపు రాజకీయాలుగానూ, సభ్యులు ముఠాలుగా వ్యవహరించడంగానూ చిత్రించడం మేధా సంస్కారం కాదు. ఎవరు ఏమనుకున్నా కెవిఆర్‌ విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమ నావకు సరంగు.

సి.య్‌స.ఆర్‌. ప్రసాద్‌, వి. చెంచయ్య

(విరసం సభ్యులు)


Advertisement
Advertisement
Advertisement