హెచ్‌సీఎల్‌ లాభం రూ.3,263 కోట్లు

ABN , First Publish Date - 2021-10-15T06:47:02+05:30 IST

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో..

హెచ్‌సీఎల్‌ లాభం రూ.3,263 కోట్లు

న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికం లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.3,263 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.3,146 కోట్లు)తో పోల్చితే నికర లాభం స్వల్పంగా వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం వృద్ధితో రూ.18,594 కోట్ల నుంచి రూ.20,655 కోట్లకు పెరిగినట్లు హెచ్‌సీఎల్‌ వెల్లడించింది. డిజిటల్‌ వ్యాపారం దన్నుతో పాటు అన్ని సర్వీసుల పోర్టుఫోలియోలు పటిష్ఠమైన వృద్ధిని కనబరచటం కలిసివచ్చిందని హెచ్‌సీఎల్‌ సీఈఓ, ఎండీ విజయ్‌ కుమార్‌ అన్నారు. త్రైమాసిక కాలంలో కొత్త 14 డీల్స్‌ కుదుర్చుకున్నామని, దీంతో మొత్తం కాంట్రాక్టు విలువ రూ.16,563 కోట్లకు చేరిందని తెలిపారు. 


డిసెంబరు నాటికి కొత్తగా 22 వేల నియామకాలు:

కాగా సెప్టెంబరుతో త్రైమాసికంలో కొత్తగా 11,135 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు విజయ్‌ వెల్లడించారు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఒక త్రైమాసిక కాలంలో ఇంత మం ది ఉద్యోగులను చేర్చుకోవటం ఇదే తొలిసారని పేర్కొన్నారు. సెప్టెంబరు 30 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,87,634కి చేరిందని తెలిపారు. కాగా డిసెంబరు నాటికి కొత్తగా 20,000-22,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. అలాగే వచ్చే ఏడాది 30 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-10-15T06:47:02+05:30 IST