నదులకు భారీ వరద

ABN , First Publish Date - 2020-09-21T08:15:18+05:30 IST

భారీ వర్షాలతో కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదుల్లో వరద పోటెత్తుతోంది. పెన్నా నదిలో సోమశిల జలాశయానికి 1.30 లక్షల

నదులకు భారీ వరద

పెన్నా ఉగ్రరూపం

నీట మునిగిన గ్రామాలు

సోమశిల గేట్లు ఎత్తివేత 

తుంగభద్రకు మళ్లీ వరద

సాగర్‌ 14 గేట్ల నుంచి   నీరు విడుదల


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): భారీ వర్షాలతో కృష్ణా, పెన్నా, తుంగభద్ర నదుల్లో వరద పోటెత్తుతోంది. పెన్నా నదిలో సోమశిల జలాశయానికి 1.30 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. సోమశిల డ్యాం గరిష్ఠ నీటిమట్టం 330 అడుగులు కాగా, ప్రస్తుతం 329 అడుగులుంది. దీంతో గేట్లు ఎత్తివేసి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో 48 మంది రైతులు, వ్యవసాయ కూలీలు  వరదలో చిక్కుకోగా ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలు పడవల సాయంతో వారిని రక్షించాయి.


నెల్లూరు నగరంలోని జయలలితనగర్‌, పొర్లుకట్ట, భగత్‌సింగ్‌ కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. చేజర్ల, అనంతసాగరం, సంగం, నెల్లూరు రూరల్‌ తదితర మండలాల్లో సుమారు ఐదు వేల ఎకరాల్లో వరి, వేరుశనగ, పత్తి, కూరగాయల పంటలు, పూలతోటలు దెబ్బతిన్నాయి. కలెక్టర్‌ చక్రధర్‌బాబు పడవలో సంగం మండలం వీర్లగుడిపాడు వెళ్లి పరిశీలించారు.


సోమశిల బ్యాక్‌ వాటర్‌ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం గంగపేరూరు, తప్పెటవారిపల్లి, నందలూరు మండలం పొత్తపి గ్రామాలను చుట్టుముట్టాయి. రెండు మూడు రోజులుగా ఆ గ్రామాల ప్రజలు మోకాళ్ల  లోతు నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. అలాగే, వేల ఎకరాల వరి, మిరప, అరటి తదితర పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుంగభద్ర డ్యాంకు మళ్లీ వరద పెరిగింది.


సోమవారానికి 1.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. జలాశయం 12 గేట్లను ఎత్తి తుంగభద్ర నదిలోకి 36,384 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా,  ప్రస్తుతం 1632.98 అడుగులుంది. నీటి నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100.778 టీఎంసీల నీరు  నిల్వ ఉంది. ఇన్‌ ఫ్లో 26,796 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 46,800 క్యూసెక్కులు.


ఇక కృష్ణానదిలో వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.20 అడుగులుంది. ఇది 210.99 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి 1,55,326 క్యూసెక్కులు,  సుంకేశుల నుంచి 41,720 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 4590 క్యూసెక్కులు నీరు శ్రీశైలానికి ఇన్‌ఫ్లో గా వస్తోంది. శ్రీశైలం నుంచి 2,50,789 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు.


నాగార్జున సాగర్‌లో గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.20 అడుగులు ఉంది. ఇది 309.65 టీఎంసీలకు సమానం. నాగార్జునసాగర్‌ 14 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,07,907 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. అలాగే కుడి కాలువ ద్వారా 8,404  ఎస్‌ఎల్‌బీసీ 1800, ఎడమ కాలువ ద్వారా 2818, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 29,597(మొత్తం ఔట్‌ఫ్లో 2,50,789) క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.


గుంటూరు జిల్లా సత్రశాలలోని టెయిల్‌పాండ్‌  నుంచి పులిచింతలకు 2,37,247 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈ చెప్పారు. ప్రాజెక్టు 20 గేట్లకుగాను 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Updated Date - 2020-09-21T08:15:18+05:30 IST