ఆదిలాబాద్‌లో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-06-11T09:50:05+05:30 IST

రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షానికి జైనథ్‌, బేల, తాంసి, భీంపూర్‌, తలమడుగు మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు,

ఆదిలాబాద్‌లో భారీ వర్షం

జైనథ్‌ మండలంలో 9 సెం.మీ., బేలలో 7.9 సెం.మీ...

పొంగిపొర్లిన వాగులు.. కొట్టుకుపోయి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లో పలు చోట్ల మోస్తరు వాన

తుర్కయాంజాల్‌లో 10 సెం.మీ.!


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షానికి జైనథ్‌, బేల, తాంసి, భీంపూర్‌, తలమడుగు మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరింది. జైనథ్‌ మండలంలో 9.03 సెం.మీ., బేల మండలంలో 7.93 సెం.మీ., ఆదిలాబాద్‌ అర్బన్‌లో 6.50 సెం.మీ., బీంపూర్‌లో 3.50 సెం.మీ. వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో రోడ్లపై నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భీంపూర్‌ మండలం అంతర్గాం గ్రామ వాగు పొంగడంతో రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భీంపూర్‌ మండలం నిపాని గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ వెంకట్‌గౌడ్‌ (44) ఈ వాగు దాటే ప్రయత్నంలో వరదలో చిక్కుకుని మృతి చెందాడు.


రాజధాని నగరంలో వాన

హైదరాబాద్‌ నగరంలో గురువారం పలు ప్రాంతాల్లో చిరుజల్లులు మొదలుకుని మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా మాదాపూర్‌లో 2.23 సెం.మీ., షాపూర్‌నగర్‌లో 2.3, వెంగళ్‌రావునగర్‌, సీతాఫల్‌మండిలో 2, శ్రీనగర్‌కాలనీ, జీడిమెట్లలో 1.98, మెట్టుగూడలో 1.95 సెం.మీ. వాన పడింది. సూర్యాపేటని 60 ఫీట్ల రోడ్డు, కొత్త బస్టాండ్‌, ఎంజీ రోడ్డు, శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలో రహదారులు, లోతట్టు ప్రాంతాలు మునిగాయిు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట, రుద్రంగి, గంభీరావుపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసింది. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో వర్షం కురిసింది. 


ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో అత్యధికంగా 10.5 సెం.మీ. వర్షం పడింది. మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలో 4.23, బాచుపల్లిలో 4.03, అల్వాల్‌లో 3.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 6 సెం.మీ. వర్షం పడింది. జిల్లాలోని పలు మండలాల్లోనూ భారీ వాన కురిసింది. దాదాపు రెండు గంటల పాటు కురిసిన వర్షంతో సంగారెడ్డిలో రోడ్లు జలమయమయ్యాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.




రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం

రాగల కొన్ని రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఇది బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిసా వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. 

Updated Date - 2021-06-11T09:50:05+05:30 IST