బీభత్సం..రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం

ABN , First Publish Date - 2020-09-21T06:40:56+05:30 IST

పెద్దేముల్‌ మండలం ఇం దూరు, తట్టెపల్లి, ఆత్కూర్‌, సిద్దన్నమడుగుతండాతోపాటు పలు గ్రామాల్లో ఆదివారం భారీవర్షం కురిసింది

బీభత్సం..రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం

ఉమ్మడి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతోపాటు పంటలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వాగులు వంకలు పొంగిపొర్లడంతో రహదారులపై  వరదనీరు పారి  జనం రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది


పెద్దేముల్‌ / చౌదరిగూడ / షాద్‌నగర్‌ / ధారూరు / కొడంగల్‌ / శంషాబాద్‌ : పెద్దేముల్‌ మండలం ఇం దూరు, తట్టెపల్లి, ఆత్కూర్‌, సిద్దన్నమడుగుతండాతోపాటు పలు గ్రామాల్లో ఆదివారం భారీవర్షం కురిసింది. వర్షానికి వరదనీరు ఇందూరు గ్రామంలోకి చేరింది. పక్కనే ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామంలోకి వరద నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు. వరదనీరు ఇళ్లలోకి చేరి వంటసరుకులు తడిసి ముద్దయ్యాయి. గ్రామ సమీపంలోని కల్వర్టు సక్రమంగా లేకపోవడం వల్లనే వరదనీరు సాఫీగా వెళ్లలేదని గ్రామస్థులు ఆరోపించారు. ఈ యేడాది ఇలా గ్రామంలోకి భారీగా వరదనీరు రావడం రెండోసారి కావడంతో జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అధికారులు స్పందించి వెంటనే వాగుపై పెద్ద వంతెన నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందూరులో భారీగా వరదనీరు ఇళ్లలోకి చేరిందన్న  విషయం తెలుసుకున్న తహసీల్దారు చిన్నప్పలనాయుడు, ఎస్‌ఐ.చంద్రశేఖర్‌ గ్రామాన్ని సందర్శించారు. ఎవరికీ ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వారికి భరోసా కల్పించారు. అదే విధంగా వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌, ధారూరు మండలాల్లో శని, ఆదివారాల్లో కురిసిన వర్షంతో పంటపొలాలకు తీవ్రనష్టం వాటిల్లింది. 


వాగు దాటబోయి పల్టీ కొట్టిన ఆటో..

ఇందూరు జైరంగాతండా సమీపంలోని చిన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శంకర్‌పల్లి వైపు నుంచి వచ్చిన ఒక ఆటోను వాగును దాటించబోయారు. వరద ఉధృతికి ఆటో పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తు అందులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. గ్రామస్థులు ఆటోకు తాళ్లు కట్టి ట్రాక్టర్‌తో లాగి బయటకు తీశారు. 


చౌదరిగూడ మండలంలో భారీ వర్షం

షాద్‌నగర్‌ నియోజకవర్గం చౌదరిగూడ, కొందుర్గు మండలాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో చౌదరిగూడ మండల పరిధిలోని తూంపల్లి వాగు, చేగిరెడ్డి ఘనాపూర్‌ సమీపంలోని పెద్దవాగు, చౌదరిగూడ సమీపంలోని గొల్లకేరివాగుతోపాటు కొందుర్గు మండలంలోని లాలాపేట వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తూంపల్లి, చౌదరిగూడ వెళ్లే రహదారుల్లో వాగులపై వంతెనలు లేని కారణంగా రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇదిలావుండగా షాద్‌నగర్‌తోపాటు ఫరూఖ్‌నగర్‌, కొ త్తూర్‌, కేశంపేట, నందిగామ మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు కురిసింది. 


శంషాబాద్‌లో..

శంషాబాద్‌లో భారీ వర్షం పడింది. బస్టాండు నుంచి గ్రామంలోకి వెళ్లే రైల్వేవంతెన కింద భారీగా వరదనీరు చేరడంతో వాహనం మునిగిపోయింది. ఆర్టీసీ బస్టాండ్‌లోనికి కూడ పెద్ద ఎత్తున వర్షపునీరు చేరింది.

Updated Date - 2020-09-21T06:40:56+05:30 IST