ముంచిన వాన

ABN , First Publish Date - 2020-10-15T06:56:23+05:30 IST

భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ క్రమంలో పలు చోట్ల వరద

ముంచిన వాన

రైతన్నకు క(న)ష్టం మిగిల్చిన భారీవర్షం

వేలాదిఎకరాల్లో చేతికొచ్చిన పంటలు ధ్వంసం

ఖమ్మం జిల్లాలో 75,364, భద్రాద్రిలో 8,313ఎకరాల్లో నష్టం

ప్రాథమిక అంచనా వేసిన వ్యవసాయశాఖ 

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఖమ్మం కలెక్టర్‌

పలు చోట్ల కోతకు గురైన రోడ్లు, కూలిన విద్యుత్‌ స్తంభాలు 


ఖమ్మం/కొత్తగూడెం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ క్రమంలో పలు చోట్ల వరద ధాటికి పంటలతో పాటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల పరిధిలోని రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల విద్యుత్‌స్తంభాలు నేలకూలాయి. దీంతో ఆయా శాఖలు నష్టాన్ని అంచనా వేసే పనిలో పడ్డాయి. 


అన్నదాతలకు తీరని నష్టం..

ఖమ్మం జిల్లాలో 75,364ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 8,313ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని, 53,358మంది రైతులు నష్టపోయారని  వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో వరి 38,111ఎకరాలు, పత్తి 37,227ఎకరాలు, కంది 26ఎకరాల్లో దెబ్బతిన్నది. సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు, సత్తుపల్లి, కల్లూరు,పెనుబల్లి, తల్లాడ, మధిర నియోజకవర్గంలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌, వైరా, చింతకాని, ముదిగొండ తదితర మండలాల్లో పొట్టదశలో ఉన్న వరినీటిపాలైంది. కొన్నిచోట్ల పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పత్తి కాయలు వర్షానికి చెట్టుపైనే నల్లబడి నీరుకారుతున్నాయి. కుళ్లిపోయి పురుగులు పడ్డాయి. మిర్చితోటలు, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏన్కూరు, కామేపల్లి, రఘునాధపాలెం, కొణిజర్ల, మధిర, ఎర్రుపాలెం, తదితర మండలాల్లో మిర్చి చేలల్లో నీరు నిలిచి ఎర్రబడుతున్నాయి. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి  వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సుమారు 18సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో వరి, పత్తి, వేరుశనగ, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు తెలిపిన సమాచారం మేరకు భద్రాద్రి జిల్లాలోని 86 గ్రామాల్లో 4,198మంది రైతులకు సంబంధించిన 8,313 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా వరిపంట 7,212ఎకరాలు,  పత్తి 686ఎకరాలు, వేరు శనగ 155ఎకరాలు,  మిరప 260ఎకరాల్లో దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. 


ఉప్పొంగుతున్న జలవనరులు..

జిల్లాలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి అన్ని ఏరులు, వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. మున్నేరు 19 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. తమ్మిలేరు, కట్టలేరు, ఆకేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మంరూరల్‌ మండలంలోని తీర్థాల వద్ద మున్నేరు చప్టాపై నుంచి ప్రవహిస్తోంది. ఎర్రుపాలెం మండలంలో కట్టలేరు, మధిర ఎర్రుపాలెం మండలాల మధ్య చప్టాపై ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి ఎడమకాలవకు గండిపడడంతో వరిపొలాల్లోకి ఇసుక మేటలు వేశాయి. కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో 23అడుగులు దాటి ప్రవహిస్తోంది. నాయకన్‌గూడెం వద్ద సాగర్‌ ఎడమకాలవకు గండిపడింది. జిల్లాలో బుధవారం 2.9సెంమీ సగటు వర్షపాతం నమోదైంది. వైరా ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తోంది.


చంద్రుగొండ మండలంలో సీతాయిగూడెం ప్రాంతంలోని వెంగళరాయ సాగర్‌ ప్రాజెక్ట్‌కు గండిపడింది. దీని మరమ్మతుల కోసం ప్రభుత్వానికి రూ.12కోట్లు ప్రతిపాదనలు పంపారు. ములకలపల్లి మండలంలోని పాములేరు వాగు, దమ్మపేట మండలంలో ముకుందాపురంలో చెరువు, అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్‌, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, పినపాక, కొత్తగూడెం, గుండాల, ఆళ్లపల్లి తదితర మండలాల్లోని చెరువులు, ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాల్వంచలోని కిన్నెరసాని రిజర్వాయర్‌కు నీరు భారీగా వచ్చి చేరడంతో రెండు గేట్లు ఎత్తి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


పంటలను పరిశీలించిన కలెక్టర్‌.. 

ఖమ్మం జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ బుధవారం పరిశీలించారు.  సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో వరి, పత్తి పొలాలను, బేతుపల్లి చెరువు ఎడమకాలవ గండిని పరిశీలించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. సర్వే చేసి నష్టం వివరాలను సేకరించి బాధిత రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - 2020-10-15T06:56:23+05:30 IST