జల కళ..ఉమ్మడి జిల్లాలో జోరుగా కురస్తున్న వర్షాలు

ABN , First Publish Date - 2020-08-13T10:40:23+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జలాశయాలకు జలకళ సంతరించుకుంటోంది. వరుసగా నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో

జల కళ..ఉమ్మడి జిల్లాలో జోరుగా కురస్తున్న వర్షాలు

మత్తడి పోస్తున్న లక్నవరం చెరువు

రామప్ప, పాకాల చెరువుల్లో పెరుగుతున్న నీటిమట్టం

ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి నది

ఆయకట్టు రైతుల్లో వెల్లివిరుస్తున్న హర్షాతిరేకాలు


హన్మకొండ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జలాశయాలకు జలకళ సంతరించుకుంటోంది. వరుసగా నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన జలాశయాలు, వాగులు, చెరువులు నిండుతున్నాయి. ప్రధానంగా లక్నవరం చెరువు బుధవారం మత్తడి పోస్తోంది. అలాగే కాకతీయుల చెరువులైన రామప్ప, పాకాలలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ఆయకట్టు పరిధి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చిన్నా చితక చెరువులు, వాగులు సైతం నిండుతున్నాయి.


మత్తడి పోస్తున్న లక్నవరం చెరువు

గోవిందరావుపేట: మండలంలోని ప్రఖ్యాత లక్నవరం సరస్సు మత్తడి దునుకుతోంది. 33.5 ఫీట్ల మేర నీరు చేరడంతో బుధవారం ఉదయం నుంచి మత్తడి పోయడం ప్రారంభమైంది. ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతూనే ఉంది.  దీంతో మత్తడి ఉధృతి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నవరం మత్తడిపోస్తుండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటికే ఆయకట్టులో 80శాతం వరినాట్లు పూర్తయ్యాయి.


ఉప్పొంగుతున్న గోదావరి 

మహదేవపూర్‌: కొద్ది రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదిలో ప్రవాహం పెరుగుతోంది. ప్రాణహిత, గోదావరి సంగమం కాళేశ్వరం వద్ద క్రమంగా పెరుగుతోంది. బుధవారం 7.8 మీటర్ల ఎత్తులో గోదావరి ఉగ్రరూపాన్ని దాల్చింది. 1.50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది.


రామప్ప సరస్సులో పెరుగుతున్న నీటిమట్టం

వెంకటాపూర్‌(రామప్ప): మండలంలోని రామప్ప సరస్సులో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. 35 అడుగుల సామర్థ్యం గల సరస్సులోకి గత రాత్రి నుంచి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 28.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  5100 ఎకరాల సాగు విస్తీర్ణంలో ఇప్పటి వరకు సగానికి పైగా నాటు వేశారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తే యాసంగి పంటతోపాటు నాలుగు మండలాలకు తాగునీటికి ఢోకా ఉండదని తెలుస్తోంది.


26.6 అడుగులకు చేరిన పాకాల నీటిమట్టం

ఖానాపురం, ఆగస్టు 12: మండలంలోని పాకాల సరస్సు నీటిమట్టం బుధవారం నాటికి 26.6 అడుగులకు చేరుకుంది. సరస్సులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 30 అడుగుల సామర్థ్యం గల సరస్సు పూర్తిస్థాయిలో నిండితే రబీకి ఇబ్బందులు లేవని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఉప్పొంగిన మోరంచవాగు

గణపురం : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలాల్లోని చెరువులు, కుంటలు నిండి మత్తళ్లు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మోరంచవాగు అవతలి వైపు ఉన్న గ్రామాలు అప్పయ్యపల్లి, సితరాంపురం, కొండాపూర్‌ ప్రజలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అను నిత్యం మండల కేంద్రానికి వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  అలాగే మండలంలోని బుద్దారం గ్రామ శివారు వంగపెల్లివాణి చెరువు  మత్తడి పోస్తోంది.  రెండు పంటలకు సరిపడా సాగునీటి అందుతుందని రైతులు అంటున్నారు. మత్తడి పడటంతో వృథాగా  పోయే నీరంతా గణపసముద్రం చెరువులోకి కలుస్తోంది.  దీంతో గణపసముద్రం చెరువు నీటిమట్టం 22.4 ఫీట్లకు చేరుకుంది.


మత్తడి పోస్తున్న తిమ్మంపేట చెరువు

దుగ్గొండి: మండలంలో తిమ్మంపేటలోని గుండం చెరువు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో బుధవారం మత్తడి పోస్తుంది. మండలంలోని 14ఐబీ చెరువులు, 76 పంచాయతీరాజ్‌ చెరువులు సైతం నిండినట్లు రైతులు తెలిపారు.

Updated Date - 2020-08-13T10:40:23+05:30 IST