8 జిల్లాల్లో హైఅలర్ట్‌

ABN , First Publish Date - 2021-04-09T08:20:02+05:30 IST

రాష్ట్రంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న జిల్లాలపై వైద్యశాఖ దృష్టిసారించింది. 8 జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించింది. ఫస్ట్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలో

8 జిల్లాల్లో హైఅలర్ట్‌

కొవిడ్‌ పాజిటివ్‌లు అక్కడే అధికం

ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ

ఒకేచోట 5-10 కేసులుంటే.. సూక్ష్మ కట్టడి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న జిల్లాలపై వైద్యశాఖ దృష్టిసారించింది. 8 జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించింది. ఫస్ట్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉండగా.. సెకండ్‌ వేవ్‌ తీవ్రత జిల్లాల్లో ఉంది. దీంతో నియంత్రణకు అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌, జనగామ, సంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ క్రమంలో ఆ 8 జిల్లాల్లో డీఎంహెచ్‌వో, మెడికల్‌ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వైద్యశాఖ ఉన్నతాధికారులు సూచించారు.


ఆ జిల్లాల్లోనే ఎందుకు?

8 జిల్లాల్లోనే వైరస్‌ అధికంగా ఎందుకు వ్యాపిస్తోంది? అనే అంశంపై వైద్యశాఖ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. దీని ప్రకారం.. ఆ జిల్లాల్లో  సుమారు 40ు మందికి ఇప్పటికీ వైర్‌సపై అవగాహన లేదని, మరో 30ు మంది తమకు ఏం కాదులే అనే భావనతో ఉన్నారని, మరో 20ు మంది మాస్కు, భౌతిక దూరం వంటి కనీస నిబంధనలను పాటించడం లేదని అంచనా వేసింది. 10ు మంది తగిన జాగ్రత్తలు పాటించకుండా.. రాకపోకలు సాగించే క్రమంలో వైరస్‌ వ్యాప్తి జరుగుతోందని పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పరిస్థితి చేయి జారిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజామాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌లలో మహరాష్ట్ర నుంచి వైరస్‌ ప్రభావం అధికంగా ఉంది. మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో యూకే స్ట్రెయిన్‌ వ్యాప్తి చెందుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


వారం రోజులుగా పైపైకి

గడిచిన వారం రోజులుగా 8 జిల్లాల్లో కేసులు విజృంభిస్తున్నాయి. ఈనెల 1 నుంచి 7 వరకు మేడ్చల్‌లో 1,088 నమోదు కాగా, రంగారెడ్డిలో 909, నిజామాబాద్‌లో 802, నిర్మల్‌లో 474, జగిత్యాలలో 380, సంగారెడ్డిలో 346, కరీంనగర్‌లో 345, వరంగల్‌ అర్బన్‌లో 313 కేసులు రికార్డు అయ్యాయి.


కట్టడికి అధికారుల చర్యలివే..

వైద్యఆరోగ్య శాఖ బృందాలకు అనుసంధానంగా గతంలో గ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించిన టీమ్‌లను రంగంలోకి దింపుతారు. ఈ బృందాలు పాజిటివ్‌ తేలిన ప్రాంతాన్ని, వ్యక్తులను ప్రతీ రోజూ పరిశీలించి నియంత్రణ చర్యలను చేపడతాయి.

5-10 కేసుల కంటే అధికంగా ఉన్న ప్రాంతాలను మైక్రో కంటైన్‌మెంట్లుగా విభజించి.. వారం రోజుల పాటు రాకపోకలపై నియంత్రణ విధిస్తారు.

వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో చెక్‌ పాయింట్‌లను ఏర్పాటు చేస్తారు.

పరీక్షలను నాలుగు రెట్లు పెంచుతారు.

కేసుల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్‌ సంచార పరీక్ష కేంద్రాన్ని నిర్వహిస్తారు.

Updated Date - 2021-04-09T08:20:02+05:30 IST