అక్రమాలపై జోక్యం చేసుకోవద్దా: హైకోర్టు

ABN , First Publish Date - 2021-03-08T10:21:19+05:30 IST

ఎన్నికల ప్రక్రియకు కళంకం తెచ్చేలా వ్యవహారాలు ఉన్నప్పుడు కూడా కలగజేసుకోకూడదా అని హైకోర్టు ప్రశ్నించింది. చిత్తూరు కార్పొరేషన్‌

అక్రమాలపై జోక్యం చేసుకోవద్దా: హైకోర్టు

చిత్తూరులో ‘ఫోర్జరీ ఉపసంహరణల’పై వాదనలు 

పూర్తి వివరాలు సమర్పించాలని ఎస్‌ఈసీకి ఆదేశం 

పిటిషన్‌కు విచారణార్హత లేదన్న 

ప్రభుత్వ న్యాయవాది .. విచారణ నేటికి వాయిదా 


అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రక్రియకు కళంకం తెచ్చేలా వ్యవహారాలు ఉన్నప్పుడు కూడా కలగజేసుకోకూడదా అని హైకోర్టు ప్రశ్నించింది. చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలోని 18 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణ చేశారన్న ఆరోపణలపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు ఆదివారం ఆదేశాలు ఇచ్చారు. చిత్తూరులోని 18డివిజన్లలో తమ నామినేషన్లను ఆర్వోలతో అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించారని, వాటిని పునరుద్ధరించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ టీడీపీ అభ్యర్థి బీఎస్‌ వెంకటేశన్‌తో పాటు మరో 17మంది అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి ఆదివారం ఇంటివద్ద నుంచే విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ... పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. ఎన్నికల్లో అక్రమాలపై ఎన్నికల ట్రైబ్యునల్‌ని ఆశ్రయించాలన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించే అధికారం ఎస్‌ఈసీకి లేదన్నారు. ఎస్‌ఈసీ సూపర్‌ ట్రైబ్యునల్‌గా వ్యవహరిస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలపై న్యాయమూర్తి స్పందిస్తూ, పై విధంగా ప్రశ్నించారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ, ఎన్నికల్లో వంచనపూరితంగా వ్యవహరించినప్పుడు న్యాయస్థానాలు కలగజేసుకోవచ్చని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. ‘‘పిటిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసి వారి ప్రమేయం లేకుండానే నామినేషన్లు ఉపసంహరించారు.


ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని నిష్పాక్షిక ఎన్నికలు నిర్వహించేలా ఎస్‌ఈసీని ఆదేశించండి. నామినేషన్ల ఉపసంహరణలో అనుమానం తలెత్తితే సంబంధిత అభ్యర్థితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని ఆర్వోలను ఎస్‌ఈసీ ఆదేశించింది. ఉపసంహరణ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌-40 ప్రకారం ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధి, ప్రతిపాదించిన వ్యక్తి, ఎన్నికల ఏజెంట్‌ మాత్రమే నామినేషన్లు ఉపసంహరించుకోగలిగే వీలుంది. ఈ 18 వార్డుల్లో నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి వీడియో ఆధారాలను కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలి’’ అని దమ్మాలపాటి కోరారు. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ అభ్యర్ధుల ప్రమేయం లేకుండా సంతకాలు ఫోర్జరీ చేసి నామినేషన్లు ఉపసంహరించినట్లు ఫిర్యాదులు అందాయన్నారు. ఆర్టికల్‌ 243(కే) మేరకు ఎస్‌ఈసీకి ఉన్న అధికారాలతో ఈ వ్యవహారంపై నివేదికలు పంపాలని కలెక్టర్‌ను కోరామన్నారు. సోమవారం వాటిని కోర్టు ముందు ఉంచుతామన్నారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం వ్యాజ్యంపై విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది. 

Updated Date - 2021-03-08T10:21:19+05:30 IST