ప్రైవేటు దోపిడీ ఆపండి

ABN , First Publish Date - 2021-05-20T09:46:30+05:30 IST

కరోనా చికిత్స కోసం అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల కట్టడికి హైకోర్టు చర్యలు చేపట్టింది. కొవిడ్‌ బాధితులు నోడల్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో సొమ్ము

ప్రైవేటు దోపిడీ ఆపండి

నోడల్‌ అధికారుల పర్యవేక్షణలో

ఆస్పత్రుల ఫీజుల చెల్లింపు!

విధివిధానాలు రూపొందించండి

హాస్పిటల్స్‌లో నోడల్‌ అధికారుల నంబర్లు

ప్రమాద బాధితులకు కరోనా పరీక్షలు వద్దు

దుకాణాల వద్ద రద్దీని నియంత్రించాలి

రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం


అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): కరోనా చికిత్స కోసం అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల కట్టడికి హైకోర్టు చర్యలు చేపట్టింది. కొవిడ్‌ బాధితులు నోడల్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు విధివిధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డబ్బు చెల్లించిన వ్యక్తి నుంచి అకనాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలని స్పష్టంచేసింది. అప్పుడే.. డబ్బు చెల్లిస్తేనే మృతదేహం అప్పగిస్తామనకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపింది. ఆస్పత్రుల్లో ప్రజలందరికీ తెలిసేలా నోడల్‌ అధికారులు/హెల్ప్‌డెస్క్‌ మేనేజర్ల ఫోన్‌నంబర్లు ప్రదర్శించాలని ఆదేశించింది. రోడ్డు ప్రమాదాల వంటి అత్యవసర కేసుల్లో కొవిడ్‌ పరీక్ష కోరకుండా ఆస్పత్రుల్లో చేర్చుకునేలా ఆదేశాలివ్వాలని సూచించింది. దుకాణాల వద్ద రద్దీని నియంత్రించేందుకు, ఒకేచోట ఎక్కువ మంది చేరకుండా చూసేందుకు పోలీసు కానిస్టేబుల్‌ను నియమించే విషయాన్ని పరిశీలించాలని పేర్కొంది.


పట్టణ ప్రాంతాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం కోరిన విధంగా కేంద్రం ఆక్సిజన్‌ సరఫరా చేయాలని అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎ్‌సజీ)ను ఆదేశించింది.  విచారణ సందర్భంగా లేవనెత్తిన పలు అంశాలపై మెమో రూపంలో వివరాలను అందజేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను 27కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజుల వసూలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని పేర్కొంటూ సామాజిక కార్యకర్త, జర్నలిస్టు తోట సురేశ్‌బాబు గత సెప్టెంబరులో పిల్‌ దాఖలు చేశారు. అలాగే కరోనా కట్టడికి ఈ ఏడాది మార్చి 23న కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ పౌరహక్కుల అసోసియేషన్‌(ఏపీసీఎల్‌ఏ) జాయింట్‌ సెక్రెటరీ  బి.మోహనరావు పిల్‌ వేశారు. ఆక్సిజన్‌ అందక చోటు చేసుకున్న మరణాలకు పరిహారం ఇప్పించడంతో పాటు కొవిడ్‌ చికిత్సలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానన్యాయమూర్తికి న్యాయవాదులు రాసిన మూడు లేఖలను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా స్వీకరించిన విషయం తెలిసిందే.


ఇవన్నీ ధర్మాసనం ముందు బుధవారం విచారణకు వచ్చాయి. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సి.సుమన్‌, కేంద్రం తరఫున ఏఎ్‌సజీ హరినాథ్‌ వాదనలు వినిపించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని బంధువులకు తెలియజేసేందుకు బులిటెన్‌ విడుదల.. బెడ్ల లభ్యత వివరాలు తెలియజేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఽధర్మాసనం ప్రశ్నించింది. ఎస్‌జీపీ స్పందిస్తూ.. ఆస్పత్రుల్లో నోడల్‌ అధికారులు.. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై బంధువులకు సమాచారం ఇస్తున్నారన్నారు. బెడ్ల లభ్యత వివరాలను పర్యవేక్షణ వ్యవస్థకు తెలియజేయాలని హెల్ప్‌ డెస్క్‌ మేనేజన్లను ఆదేశించామని చెప్పారు. తదుపరి విచారణ నాటికి వివరాలు అందజేస్తామని తెలిపారు. కర్ఫ్యూ వల్ల కేసులు తగ్గాయా.. కంటైన్‌మెంట్‌ జోన్లు ప్రకటించారా అని ధర్మాసనం ఆరా తీసింది. ఎస్‌జీపీ స్పందిస్తూ.. ప్రస్తుతం కేసులు విస్తృతంగా ఉన్నాయని.. రాష్ట్రం మొత్తాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించాల్సి వస్తుందన్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


అందరికీ రెమ్‌డెసివివర్‌ అవసరం లేదు..

కొవిడ్‌ చికిత్సకు అవసరమైన రెమ్‌డెసివిర్‌ వయల్స్‌తో పాటు ఆక్సిజన్‌ సరఫరాపై ధర్మాసనం ఆరా తీసింది. ఏఎస్‌జీ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 2.30 లక్షల వయల్స్‌ అడిగితే.. కేంద్రం 2.81 లక్షల వయల్స్‌ సరఫరా చేసిందన్నారు. ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ రెమ్‌డెసివిర్‌ అవసరం ఉండదన్నారు. ఎస్‌జీపీ సుమన్‌ కలుగజేసుకుని, రాష్ట్రానికి 2.75 లక్షల వయల్స్‌ మాత్రమే అందాయని, కేంద్రం చెబుతున్న లెక్కలకు, రాష్ట్ర ప్రభుత్వానికి అందినదానికి వ్యత్యాసం ఉందని చెప్పారు. ఎక్కువ కేసులున్న ఏపీకి తక్కువ ఆక్సిజన్‌ సరఫరా చేస్తూ.. బాధితులు తక్కువగా ఉన్న తెలంగాణకు ఎక్కువ ఆక్సిజన్‌ సరఫరా చేయడాన్ని ధర్మాసనం ప్రస్తావించింది.


హరినాథ్‌ బదులిస్తూ.. ఏపీకి సంబంధించిన కేసులు వైద్యం కోసం తెలంగాణకు వెళ్తున్నందున అదనంగా కేటాయించాలని ఆ ప్రభుత్వం కోరిందన్నారు. ‘ఏపీకి 590టన్నులు సరఫరా చేస్తుండగా, తెలంగాణకు 690టన్నులు సరఫరా అవుతోంది. ఏపీ ప్రభుత్వం అదనపు ఆక్సిజన్‌ కోరింది. కేంద్రం పరిశీలిస్తోంది. రాష్ట్రంలో 42 ప్లాంట్ల నిర్మాణానికి అంగీకరించింది. జూన్‌ 1కల్లా 15ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయి. మిగిలినవి పూర్తి చేసేందుకు 3నెలలు పడుతుంది’ అని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు తరలించకుండా రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు ఉపయోగించవచ్చు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. విషయాన్ని నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించింది. ఈ అంశాన్ని కేంద్రానికి నివేదిస్తానని ఏఎ్‌సజీ తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్‌, అశోక్‌రామ్‌, నర్రాశ్రీనివాస్‌, గంగిశెట్టి ఉమాశంకర్‌, జీవీ సుధాకర్‌, పి.సురేశ్‌, అమికస్‌ క్యూరీ రవిప్రసాద్‌ వాదనలు వినిపించారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అదనంగా 30వేల మంది సిబ్బందిని రిక్రూట్‌ చేయాలని కోరారు. మద్యం దుకాణాల వద్ద ప్రజలు ఒకేచోట చేరుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.


రుయా మరణాలపై వివరాలివ్వండి

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక చోటు చేసుకున్న మరణాల వివరాలను అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి, రుయా ఆసుపత్రి డైరెక్టర్‌, చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామంటూ జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక కరోనా బాధితులు మరణించడంపై  తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త బి.భానుప్రకాశ్‌ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి వాదనలు వినిపించారు. 

Updated Date - 2021-05-20T09:46:30+05:30 IST