ప్రైవేటీకరణకు.. ప్రత్యామ్నాయాలు లేవా?

ABN , First Publish Date - 2021-04-16T10:07:19+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన

ప్రైవేటీకరణకు.. ప్రత్యామ్నాయాలు లేవా?

వాటిని పరిగణనలోకి తీసుకున్నారా?

భూములిచ్చిన వారి ఆందోళన మాటేంటి?

పెట్టుబడుల ఉపసంహరణపై న్యాయసమీక్ష పరిమితమే 

ప్రభుత్వ ఆర్థిక విధానాలు సరైనవో కాదో ఈ కోర్టు తేల్చజాలదు

అయితే ప్రాథమిక, మానవ హక్కులు ప్రభావితమైతే న్యాయ సమీక్ష చేయొచ్చు

హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

విశాఖ ఉక్కుపై కేంద్రానికి నోటీసులు

పూర్తి వివరాలతో కౌంటర్‌కు ఆదేశం

విచారణ 4 వారాలకు వాయిదా


అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటీకరణ  నిర్ణయానికి ముందు.. ప్లాంటు కోసం భూములిచ్చిన వారి హక్కుల పరిరక్షణ కోసం పిటిషనర్‌, రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకున్నారో లేదో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ ఎం.గంగారావుతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో న్యాయసమీక్ష పరిమితమని విచారణ సందర్భంగా పేర్కొంది.


ప్రభుత్వ ఆర్థిక విధానాలు సరైనవో కాదో తేల్చడం ఈ కోర్టు పరిధి కాదని.. అయితే ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు ప్రభావితమైనప్పుడు ఆర్థికపరమైన నిర్ణయాలు న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ‘ప్రైవేటీకరణ నిర్ణయంతో భూములిచ్చినవారి హక్కులకు, లక్షలాది మంది జీవనోపాధికి భంగం కలుగుతుందని రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని పిటిషనర్‌ కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూములు ఇచ్చినవారి ఆందోళనలు, రాష్ట్ర ప్రభుత్వం చూపిన ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకున్నారో లేదో వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. విశాఖ ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జాయిన్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది.


ప్రజాపోరాటంతోనే ఆ కర్మాగారం..

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర ప్రజల పోరాటంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశారు. కర్మాగారంలో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ ఏడాది జనవరి 27న అనుమతించింది. పెట్టుబడులు ఉపసంహరణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో సమాధానం ఇచ్చారు. ఆ స్టీల్‌ప్లాంట్‌ నెలకొల్పేందుకు 22 వేల ఎకరాల భూమిని సేకరించారు. పునరావాస ప్యాకేజీ కింద భూయజమానులకు పరిహారంతో పాటు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్లాంట్‌ ఏర్పాటు చేసి 20 ఏళ్లు గడుస్తున్నా కొద్దిమందికే ఉద్యోగాలు కల్పించారు.


కర్మాగారంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించకుండా, భూములిచ్చినవారి హక్కులు భద్రత కల్పించకుండా ప్రైవేటీకరిస్తే వారి జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది భూములిచ్చిన వారి హక్కులు హరించడమే. భూసేకరణ సమయంలో ఉద్యోగం కల్పిస్తామని ఇచ్చిన హామీని విస్మరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పరిశ్రమను లాభాలబాట పట్టించేందుకు ప్రత్యామ్నాయాలు పరిగణనలోకి తీసుకోకుండా కేవలం నష్టాలను సాకుగా చూపి ప్రైవేటుపరం చేయడం సరికాదు. గతంలో నష్టాల పేరుతో హిందూస్థాన్‌ జింక్‌ పరిశ్రమను ప్రైవేటుపరం చేశారు. యాజమాన్యం కార్మాగారాన్ని మూసివేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసింది. ప్రభుత్వాలు ఇష్టానుసారం ఆర్థికపరమైన విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. ఇలాంటి వ్యవహారాలను న్యాయస్థానాలు సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేసేలా ఆదేశాలివ్వండి’ అని అని కోరారు.


రాష్ట్రప్రభుత్వం లేఖ రాసింది: ఏజీ

ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేసేందుకు పిటిషనర్‌ పలు ప్రత్యామ్నాయాలు సూచించారని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమ నష్టాలను పూడ్చేందుకు ప్రత్యామ్నాయాలతో కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలను పరిగణనలోకి తీసుకుందో లేదో కేంద్రం హైకోర్టుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉం న్నారు. ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2021-04-16T10:07:19+05:30 IST