నౌహీరా భూములు స్వాధీనం

ABN , First Publish Date - 2020-08-09T09:05:05+05:30 IST

స్కీముల పేరుతో స్కాములకు పాల్పడ్డ హీరా గోల్డ్‌ సంస్థల అధినేత్రి నౌహీరా షేక్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్‌ కోణంలో విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌ షేక్‌పేట్‌ మండల పరిధిలో...

నౌహీరా భూములు స్వాధీనం

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): స్కీముల పేరుతో స్కాములకు పాల్పడ్డ హీరా గోల్డ్‌ సంస్థల అధినేత్రి నౌహీరా షేక్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్‌ కోణంలో విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌ షేక్‌పేట్‌ మండల పరిధిలోని టోలిచౌకిలో సుమారు రూ.70 కోట్ల విలువైన నౌహీరాకు సంబంధించిన భూములను స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్లు 41, 174, 177, 178, 179, 1801, 181, 182, 211లో ఉన్న ప్లాట్లను స్వాధీనం చేసుకుంటున్నట్లు శనివారం బోర్డు ఏర్పాటు చేశారు. ఈ స్థలం అమ్మకం, బహుమతిగా ఇవ్వడం, తనఖా చేయరాదని పేర్కొన్నారు.


స్థానిక రియల్టర్‌ నుంచి నౌహీరా షేక్‌ ఈ భూమి కొనుగోలు చేశారు. ఆమె అరెస్ట్‌ తర్వాత భూమి కొంత ఆక్రమణలకు గురైనట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ నిర్మాణాలు వెలిశాయి. నౌహీరా షేక్‌ను గతంలో విచారించిన అధికారులు పలు కీలక విషయాలు రాబట్టారు. కీలక నిందితులుగా ఉన్న బీజూ థామస్‌, మౌళి థామ్‌సను ఈడీ అధికారులు విచారించారు. ఈడీ అధికారులు ఇప్పటికే సుమారు రూ. 300 కోట్లు విలువైన స్థిర, చరాస్తులను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశ విదేశాల్లోని 1,72,114 మంది నుంచి నౌహీరా రూ. 5,600 కోట్ల వరకు వసూలు చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. హీరా గోల్డ్‌ పేరుతో 24 సంస్థలు ఏర్పాటు చేసి వేర్వేరు బ్యాంకుల్లో 182 ఖాతాలు నిర్వహిస్తున్నట్లు, అమెరికా, సౌదీ అరేబియా సహా మరికొన్ని దేశాల్లో 10కి పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. 

Updated Date - 2020-08-09T09:05:05+05:30 IST