దమ్ముంటే పట్టుకో

ABN , First Publish Date - 2021-06-10T09:06:00+05:30 IST

‘‘సార్‌ నమస్తే. మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు. హైదరాబాద్‌ నుంచి ఫలానా ట్రైన్‌లో వచ్చారు. మా రాష్ట్రంలో ఫలానా చోట దిగి.

దమ్ముంటే పట్టుకో

  • నా ఫొటో స్ర్కీన్‌ షాట్‌ తీసుకో
  • నేనే మీకు దొరకాలి తప్ప 
  • మీరు దణ్నం పెట్టి వేడుకున్నా దొరకను
  • హైదరాబాద్‌ నుంచి మా రాష్ట్రానికొచ్చారు
  • మీకు సమీపంలో మంచి హోటల్‌ ఉంది.. ఫుడ్‌ బాగుంటుంది.. 
  • తిని వెళ్లండి బిల్లు నేనే కడతా.. 
  • బంజారాహిల్స్‌ పోలీసులకు రాజస్థానీ దొంగోడిసవాల్‌
  • నాలుగు నెలల క్రితం నిర్మాత కారు చోరీ


బంజారాహిల్స్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ‘‘సార్‌ నమస్తే. మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారు. హైదరాబాద్‌ నుంచి ఫలానా ట్రైన్‌లో వచ్చారు. మా రాష్ట్రంలో ఫలానా చోట దిగి.. ఆరా తీస్తూ నా ఆచూకీ గుర్తించారు. ఇందుకు మీరు చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్‌. కానీ, నేను చిక్కుతానని నమ్మకం పెట్టుకోవద్దు. నేను కొట్టేసిన కారు ఆచూకీ కూడా.. నేను దయ తలిచి చెబితే తప్ప మీరు తెలుసుకోలేరు. ఎలాగూ ఇంత దూరం వచ్చారు. మీరున్న చోటుకు కొద్ది దూరంలో మాంచి హోటల్‌ ఉంది. ఫుడ్‌ మస్తుగ ఉంటది. చక్కగా లాగిచ్చి వెళ్లండి. మిమ్మల్ని మా అతిథులుగా భావించి బిల్లు కూడా నేనే కడతా..’’ ..ఓ నిర్మాత కారు చోరీ కేసులో ఆరా తీస్తూ రాజస్థాన్‌కు వెళ్లిన పోలీసులకు ఓ దొంగోడు ఇచ్చిన ఝలక్‌ ఇది! అంతేనా.. ‘‘నా స్ర్కీన్‌ షాట్‌ తీసి పెట్టుకోండి. నా అంతట నేను దొరికిపోవాలని అనుకుంటే తప్ప.. మీరు దణ్నం పెట్టి వేడుకున్నా నేను దొరకను’’ అంటూ మరో పోలీసు అధికారికి వీడియో కాల్‌ చేసి కాలరెగరేశాడు. కారు కూడా తనకు నచ్చినన్నాళ్లు వాడుకుని ఎక్కడో ఒక చోట వదిలేస్తానని, అప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఉచితసలహా కూడా ఇచ్చాడు. దీంతో.. ఎన్నో క్లిష్టమైన కేసులను సైతం ఛేదించిన రికార్డు ఉన్న బంజారాహిల్స్‌ పోలీసులే ఏం చేయలేక రెండు  నెలలుగా తమ ప్రయత్నాలు మానుకున్నారు. ఆ నేరగాడు దొరికినప్పుడే చూద్దాంలే అనే ధోరణిలో పడ్డారు.


దేశ వ్యాప్తంగా 56 చోరీలు..

నిందితుడిది రాజస్థాన్‌ అని దర్యాప్తులో గుర్తించిన పోలీసులు.. అతడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్లి, నాలుగు రోజులపాటు అష్టకష్టాలు పడి అతని ఇంటి ఆచూకీ తెలుసుకున్నారు. అక్కడ ఆరా తీయగా దేశవ్యాప్తంగా అతడిపై 56 కార్ల చోరీ కేసులు ఉన్నాయని.. ఒక్కసారి కూడా పోలీసులకు పట్టుబడలేదని తేలింది. మరోవైపు.. పోలీసులు అక్కడ ఉండగానే నిందితుడు వారికి ఫోన్‌ చేసి షాక్‌ ఇచ్చాడు. రాజస్థాన్‌లో వారు ఎక్కడెక్కడ బస చేసిందీ.. తన ఆచూకీ కోసం ఎవరెవరినీ కలిసిందీ.. అన్నింటినీ పూసగుచ్చినట్టు చెప్పాడు. ఎంత కష్టపడ్డా తాను దొరికేది లేదని.. స్థానికంగా ఉన్న రెస్టారెంట్‌లో మంచి ఆహారం తిని తిరిగి వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చాడు. నిందితుడి కోసం పదిహేను రోజుల పాటు గాలించిన పోలీసులు.. ఆ కాల్‌ తర్వాత ఉత్తచేతులతో తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారు వచ్చిన రెండు రోజులకు సదరు చోరుడు ఇక్కడి పోలీసు అధికారికి వాట్సాప్‌ వీడియో కాల్‌ చేసి గంట సేపు మాట్లాడాడు. ‘నేను మరోసారి కనిపించను. నా ఫొటోను స్ర్కీన్‌ షాట్‌ తీసుకోండి’ అని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. కార్ల చోరీలో తాను అనుసరిస్తున్న స్టైల్‌ వల్లనే తప్పించుకోగలుగుతున్నానని చెప్పాడు. తనను వెతుక్కుంటూ వచ్చిన వారిలో బంజారాహిల్స్‌ పోలీసులే మొదటి వరుసలో ఉన్నారని ప్రశంసించాడు. కారును పోగొట్టుకున్న నిర్మాతేమో.. తన కారు పోయినా పర్వాలేదుగానీ, స్థలాల పత్రాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు. పోలీసులేమో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.


అసలేం జరిగిందంటే..

బెంగళూరుకు చెందిన  మంజునాథ్‌ సినీ నిర్మాత, వ్యాపార వేత్త. పని నిమిత్తం ఫార్చ్యూనర్‌ కారులో జనవరి 22న హైదరాబాద్‌కు వచ్చారు. బంజారాహిల్స్‌లోని అత్యంత ఖరీదైన హోటల్‌లో బస చేశారు. 26న పని ముగించుకుని హోటల్‌కు తిరిగి వచ్చారు. కారును హోటల్‌లోనే పార్కింగ్‌ చేసిన డ్రైవర్‌.. విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు. మర్నాడు పార్కింగ్‌ వద్దకు వెళ్లి చూసేసరికి కారు అక్కడ లేదు. కారులో బంగారు గణపతి విగ్రహంతో పాటు పలు స్థలాల తాలూకు డాక్యుమెంట్లు కూడా ఉండటంతో మంజునాథ్‌ పోలీసులను ఆశ్రయించారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పార్క్‌ హయత్‌తో పాటు బంజారాహిల్స్‌లో అన్ని సీసీ కెమెరాల్లో పరిశీలించారు. చోరుడు సాంకేతిక సహాయంతో కారు తాళం తీసి చోరీ చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. సెల్‌ఫోన్‌లో ఓ యాప్‌తో పాటు కొన్ని పరికరాలను దొంగ ఉపయోగించినట్టు తేలింది. చోరీ జరిగిన రెండు రోజుల తరువాత ఔటర్‌ టోల్‌ గేట్‌ నుంచి కారు బయటకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం కూకట్‌పల్లిలో కారు రెండు రోజుల పాటు నిలిపి ఉంచినట్టు.. పోలీసులు తనను అనుసరించడం లేదని తేలాక కారుతో సహా పారిపోయినట్టు గుర్తించారు.

Updated Date - 2021-06-10T09:06:00+05:30 IST