ఇంటికి బీమా ధీమా

ABN , First Publish Date - 2021-01-10T07:15:01+05:30 IST

ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి స్టాండర్డ్‌ హోమ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారత బీమా నియంత్రణ

ఇంటికి బీమా ధీమా

  • ఇక గృహాలకూ స్టాండర్డ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు
  • ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అందుబాటులోకి.. 


ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి స్టాండర్డ్‌ హోమ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ప్రకటించింది. అగ్ని ప్రమాదాలతో పాటు తుపాన్లు, వరదలు, భూకంపాలు వంటి పర్యావరణ విపత్తుల్లోనూ ఈ పథకం మీ ఇంటికి బీమా కవరేజీ కల్పిస్తుంది.

గృహ నిర్మాణాలతోపాటు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఆస్తుల కోసమూ నియంత్రణ మండలి బీమా పథకాలనూ ప్రకటించింది. అగ్ని, అనుబంధ ప్రమాదాలకు ఇప్పటికే ఇన్సూరెన్స్‌ పాలసీలను విక్రయిస్తోన్న అన్ని సాధారణ బీమా కంపెనీలు ఏప్రిల్‌ నుంచి స్టాండర్డ్‌ హోమ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను ఆఫర్‌ చేయాలని ఐఆర్‌డీఏఐ నిర్దేశించింది. 


భారత్‌ గృహ రక్ష 

 గృహ నిర్మాణంతో పాటు ఇంట్లోని వస్తువులకూ ఆటోమేటిక్‌గా (ఎలాంటి డిక్లరేషన్‌ లేకుండానే) భవన సమ్‌ ఇన్స్యూర్డ్‌లో 20 శాతం కవరేజీ (గరిష్ఠంగా రూ.10 లక్షలు) లభిస్తుంది. ఇంటి వస్తువుల డిక్లరేషన్‌ ద్వారా అధిక సమ్‌ ఇన్స్యూర్డ్‌ ఎంచుకునేందుకూ వీలుంటుంది. 


 ప్రమాదం లేదా నష్టం జరిగిన వారం రోజుల్లో కవరేజీ లభిస్తుంది. 


 ఈ పాలసీ రెండు ఆప్షనల్‌ కవరేజీలను ఆఫర్‌ చేస్తుంది. ఇందులో మొదటిది.. ఆభరణాలు, పాతకాలం నాటి విలువైన పాత్రలు వంటి విలువైన వస్తువులకు బీమా సదుపాయం. రెండోది.. ఈ పాలసీ పరిధిలోకి వచ్చే ప్రమాదం వల్ల పాలసీదారుతో పాటు తన జీవిత భాగస్వామికి జరిగే వ్యక్తిగత ప్రమాదానికీ బీమా సదుపాయం పొందవచ్చు.


 ఈ పాలసీలో అండర్‌ ఇన్సూరెన్స్‌కు ఎలాంటి మినహాయింపు లభించదు. ఉదాహరణకు, మీ ఇంట్లోని టీవీ, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషీన్‌ విలువ రూ.50 వేలు అనుకుంటే, వాటికి రూ.25 వేలకే ఇన్సూరెన్స్‌ తీసుకుంటే.. క్లెయిమ్‌ సమయంలో బీమా కంపెనీ సమ్‌ ఇన్స్యూర్డ్‌ మేరకే చెల్లింపులు జరుపుతుంది. 

 

భారత్‌ సూక్ష్మ ఉద్యమ్‌ సురక్ష 

జూ సూక్ష్మ పరిశ్రమలు లేదా వ్యాపారాల ఆస్తులకు ఈ పాలసీ బీమా కవరేజీ కల్పిస్తుంది. అయితే, పరిశ్రమ భవనం, ప్లాంట్‌, దాంట్లోని యంత్రాలు, సరుకు నిల్వతో పాటు కవరేజీ పరిధిలోకి వచ్చే తదితర వస్తువులన్నింటి విలువ రూ.5 కోట్లకు మించకూడదు. కవరేజీ పొందిన ఆస్తులన్నీ ఒకే ప్రాంతంలోనివై ఉండాలి. 


 ఈ పాలసీలో బేసిక్‌ కవరేజీకి అదనంగా పలు ఇన్‌ బిల్ట్‌ కవరేజీలు కూడా  అందుబాటులో ఉంటాయి. 


 ఈ పథకంలో అండర్‌ ఇన్సూరెన్స్‌కు 15 శాతం వరకు మినహాయింపు లభిస్తుంది. 


భారత్‌ లఘు ఉద్యమ్‌ సురక్ష 


 కనీసం రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు విలువ చేసే పరిశ్రమల ఆస్తులకు ఈ పాలసీ ద్వారా బీమా కవరేజీ పొందవచ్చు. 


 భారత్‌ సూక్ష్మ ఉద్యమ్‌ సురక్ష తరహాలో ఈ పథకంలో బేసిక్‌ కవర్‌కు అదనంగా పలు ఇన్‌ బిల్ట్‌ కవరేజీ సదుపాలు అందుబాటులో ఉంటాయి.  


    పథకం వేటికి కవరేజీ 

భారత్‌ గృహ రక్ష గృహాలు, ఇంట్లోని వస్తువులు, ఉపకరణాలు 

భారత్‌ సూక్ష్మ ఉద్యమ్‌ సురక్ష రూ.5 కోట్ల వరకు విలువ చేసే సూక్ష్మ పరిశ్రమలు 

భారత్‌ లఘు ఉద్యమ్‌ సురక్ష రూ.5-50 కోట్ల వరకు విలువ చేసే చిన్న పరిశ్రమలు 


ఈ 3 పాలసీల కవరేజీ పరిధిలోకి వచ్చే ప్రమాదాలు


అగ్ని ప్రమాదాలు, అన్ని రకాల తుపాన్లు, వరదలు, ఉప్పెన, సుడిగాలి, సునామీ, టోర్నడో, భూకంపాలు, నీటిలో మునిగిపోవడం, భూమిలోకి కుంగిపోవడం, భూపాతం, కొండ చరియలు విరిగి పడటం, కార్చిచ్చు, అల్లర్లు, దాడులు, ద్వేషపూరిత చర్యలు, తీవ్రవాదం వల్ల ఏర్పడిన నష్టాలు, వాటర్‌ ట్యాంక్‌ లేదా పైపులు పగిలిపోవడం లేదా పొంగిపొర్లడం వల్ల జరిగే నష్టాలు, దొంగతనం తదితరాలు.


Updated Date - 2021-01-10T07:15:01+05:30 IST