Abn logo
Jun 2 2020 @ 00:43AM

శ్రామిక ఉత్పాదకత పెరిగేదెలా?

అమెరికాలో ఒక కార్మికుడు 16,698 డాలర్ల విలువైన సరుకులు ఉత్పత్తి చేస్తుండగా భారత్‌లో ఒక కార్మికుడు 6414 డాలర్ల విలువైన సరుకులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాడు. మన దేశంలో కంటే చైనాలోనూ శ్రామిక ఉత్పాదకత అధికస్థాయిలో ఉన్నది. ఈ అంతరానికి మన కార్మిక చట్టాలూ ఒక ప్రధాన కారణం. 


పారిశ్రామిక సంస్థల అనుకూల కార్మిక విధానాలు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రయోజనకరంగా తోడ్పడుతాయి. మన దేశంలో ‘కార్మిక విపణి’ ఉన్నది. వీధి చివర కూరగాయల మార్కెట్ వంటిదే ఇది కూడా. మార్కెట్‌లో ఆలుగడ్డల ధర వాటి సరఫరా, గిరాకీ పై ఆధారపడి వుంటుంది. సరఫరా అధికంగా ఉంటే వాటి ధర తక్కువగా ఉంటుంది. అదే విధంగా శ్రామికుల లభ్యత అధికంగా ఉన్నప్పుడు శ్రమ ధర తక్కువగా ఉంటుంది. మరి మన దేశంలో జనాభా అత్యధికంగా ఉన్నది కనుక కార్మికుల సరఫరా కూడా అపరిమితంగా ఉన్నది. ఇదొక తిరుగులేని వాస్తవం. కార్మికుల సరఫరా అత్యధికంగా ఉన్నది కనుక వారి మార్కెట్ వేతనాలు అనివార్యంగా తక్కువగా ఉన్నాయి. 


సరే, ప్రభుత్వం కృత్రిమంగా కార్మికుల వేతనాలు పెంపొందించగలదు. ఇది, ఉద్యోగిత కుదించుకుపోవడానికే దారితీస్తుంది. మళ్ళీ కూరగాయల మార్కెట్ ఉదాహరణకు వెళదాం. ఆలుగడ్డల విక్రయదారులు ఒక సంఘంగా ఏర్పడి, కిలో రూ.50 కంటే తక్కువకు అమ్మకూడదని నిర్ణయం తీసుకుంటే జరిగేదేమిటి? ఆలుగడ్డల అమ్మకాలు తగ్గిపోతాయి. వినియోగదారులు టొమేటాల కొనుగోలుకు మొగ్గు చూపుతారు. ఆలుగడ్డలను తక్కువగా కొనుగోలు చేస్తారు. కొంత మంది వినియోగదారులు మరో సమీప మార్కెట్లో చౌక ఆలుగడ్డలను కొనుగోలు చేసుకుంటారు. అదే విధంగా కార్మిక వేతనాలను కృత్రిమంగా పెంచితే పారిశ్రామిక సంస్థలు యంత్రాలను ఎక్కువగా ఉపయోగించుకోవడం ప్రారంభిస్తాయి. శ్రమ శక్తిని వినియోగించుకోవడాన్ని తగ్గిస్తాయి. కొంత మంది పారిశ్రామికులు తమ కార్యకలాపాలను కార్మిక వేతనాలు తక్కువగా ఉండే బంగ్లాదేశ్ కు మార్చినా మార్చవచ్చు.


నాకు తెలిసిన ఒక చక్కెర ఫ్యాక్టరీ యాభై సంవత్సరాల క్రితం 2000 మంది కార్మికులతో రోజుకు 2000 బ్యాగుల చక్కెర ఉత్పత్తి చేసేది. అదే ఫ్యాక్టరీ ఇప్పుడు కేవలం 500 మంది కార్మికులతో రోజుకు 8000 బ్యాగుల చక్కెర ఉత్పత్తి చేస్తోంది. కార్మికులను స్వల్పసంఖ్యలో వినియోగించుకోవడం ద్వారా మనం ఒక విధంగా ‘కార్మిక కులీనత’ను నెలకొల్పాము. ఈ కార్మికులు తమ ప్రయోజనాలను సాధించుకునేందుకు ‘ఘొరావ్’ మొదలైన ఎత్తుడగలను అనుసరించేందుకు వెనుకాడరు. కనుకనే ‘ప్రాచ్య దేశాల మాంచెస్టర్’గా ప్రసిద్ధ మైన కాన్పూర్ లో ఫ్యాక్టరీలు ఈ ‘కార్మిక కులీనత’ వల్లే ఇప్పుడు భూతాల  నిలయాలుగా మారిపోయాయి. 1970 దశకంలో దత్తా సామంత్ ఆందోళనల ఫలితంగా ముంబైలోని ఔళి మిల్లులు గుజరాత్‌కు వెళ్ళిపోయాయి. ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకునే కార్మికులకు బదులుగా యంత్రాలను ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా లేదా ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిపోకుండా ఉండేందుకు కార్మిక చట్టాలను సంస్కరించేందుకు ప్రభుత్వం పూనుకున్నది. 


కార్మిక చట్టాలకు రెండు కోణాలు ఉన్నాయి. నిర్దిష్ట చట్టాలు కార్మికుల వేతనాలను పెంచుతాయి. మరికొన్ని చట్టాలు శ్రామిక ఉత్పాదకత తగ్గుదలకు దారితీస్తాయి. ఈ రెండో విధమైన చట్టాలపై మనం ఇప్పుడు దృష్టి పెట్టాలి. ఎందుకు? యంత్రాలకు వ్యతిరేకంగా కార్మికుల పోరాటాలు విజయవంతమవ్వాలంటే శ్రామిక ఉత్పాదకత పెరిగి తీరాలి. ఉదాహరణకు ఒక చక్కెర ఫ్యాక్టరీ యజమాని తమకు అవసరమైన అవసరమైన సంచులను చేతితో కుట్టాలా లేక యంత్రాలతో కుట్టించాలా అనే విషయమై నిర్ణయం తీసుకోవల్సి వుంటుంది. ఒక కార్మికుడు గంటకు 20 బస్తాల చొప్పున కుట్టగలిగితే యజమానికి అది లాభదాయకమవుతుంది. అలా కాకుండా ఒక కార్మికుడు ఒక గంటకు కేవలం పది బస్తాలను మాత్రమే కుట్టగలిగితే యజమాని నష్టపోయే అవకాశమున్నది. కనుక పారిశ్రామిక వేత్తలు కార్మికులు మరింత ఎక్కువ సంఖ్యలో నియోగించుకునేలా చేయాలంటే శ్రామిక ఉత్పాదకతను గణనీయంగా పెంపొందించవలసివున్నది.


ఈ కోణం నుంచి పారిశ్రామిక వివాదాల చట్టంపై పురాలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. పనిలో సమర్థత చూపని కార్మికులను తొలగించడాన్ని కష్ట సాధ్యం చేస్తోందీ చట్టం. ఒక పారిశ్రామికవేత్త నాకు ఇలా చెప్పాడు: ‘తమ కార్మికులు సంచులు కుట్టే మెషీన్‌ను తమ చేతుల్లో పెట్టుకుని పనిచేయకుండా విశ్రాంతి తీసుకుంటారు. పని చేయవయ్యా అని అంటే’ నన్ను డిస్మిస్ చేసుకోండి. ఇంటి వద్ద కూచుంటే 50 శాతం వేతనం అందుతుంది. ఆ తరువాత కార్మిక న్యాయస్థానం మళ్ళీ నా ఉద్యోగాన్ని నాకు ఇస్తుంది అంటాడు. ఇక నేనేం చెయ్యాలి?’. ఇటువంటి పరిస్థితులు ఉండబట్టే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ఒకటి ఇలా పేర్కొంది: అమెరికాలో ఒక కార్మికుడు 16, 698 డాలర్ల విలువైన సరుకులు ఉత్పత్తి చేస్తుండగా భారత్ లో ఒక కార్మికుడు 6414 డాలర్ల విలువైన సరుకులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాడు. మన దేశంతో పోలిస్తే చైనాలోనూ శ్రామిక ఉత్పాదకత అధికస్థాయిలో ఉన్నది. కారణమేమిటి? ఉత్పత్తిని భారీ స్థాయిలో చేయడంతో పాటు మెరుగైన సాంకేతికతలను ఉపయోగించడమేనని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే మన దేశంలోని ఖచ్చితమైన కార్మిక చట్టాలు కూడా శ్రామిక ఉత్పాదకతలో భారత్, చైనాల మధ్య అంతరానికి చెప్పుకోదగిన విధంగా దోహదం చేస్తున్నాయనేది స్పష్టం. 


ముందే చెప్పినట్టు మన దేశంలో కార్మికుల లభ్యత అపారంగా ఉన్నందున వారికి అధిక వేతనాలు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. అయితే శ్రామిక ఉత్పాదకతను ఇతోధికంగా పెంపొందించవచ్చు. ఇందుకు పారిశ్రామిక వివాదాల చట్టాన్ని సంస్కరించడం ద్వారా తక్కువ వేతనాలతో నైనా సరే అధిక సంఖ్యలో కార్మికులను నియోగించుకునేలా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి. ఫ్యాక్టరీల చట్టం, కార్మికుల నష్టపరిహార చట్టం మొదలైన కార్మిక శాసనాలు శ్రామిక ఉత్పాదకతను ప్రభావితం చేయలేవు. అయితే ఈ చట్టా లను బలహీనపరచడం వల్ల పని స్థలాలలో పరిస్థితులు దిగజారిపోయే అవకాశం ఎంతైనా ఉన్నది. ఇది కార్మిక శ్రేయస్సుకుగానీ, పారిశ్రామిక పురోగతికి గానీ శ్రేయస్కరం కాదు. 


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...