ఆ ఫొటోలు తిరిగి పొందవచ్చా?

ABN , First Publish Date - 2020-02-15T06:08:48+05:30 IST

నా దగ్గర ఉన్న మెమరీ కార్డులో ఉన్న ఫోటోలు మొబైల్‌లో ఓపెన్‌ చేసినప్పుడు ఓపెన్‌ అవడం లేదు. మరలా వాటిని తిరిగి పొందడం ఎలా?

ఆ ఫొటోలు తిరిగి పొందవచ్చా?

నా దగ్గర ఉన్న మెమరీ కార్డులో ఉన్న ఫోటోలు మొబైల్‌లో ఓపెన్‌ చేసినప్పుడు ఓపెన్‌ అవడం లేదు. మరలా వాటిని తిరిగి పొందడం ఎలా? 

- జికె


మెమరీ కార్డును వివిధ డివైజ్‌లకు వాడుతున్నప్పుడు అందులో ఉండే ఫైల్స్‌ కరప్ట్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఒక డివైజ్‌ నుంచి మరో డివైజ్‌కి మెమరీ కార్డుని మార్చి మార్చి వాడటం సరైన పద్ధతి కాదు. చాలా సందర్భాలలో అలా చేయడం వల్ల డేటా నిరుపయోగమవుతుంది. మీరు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటికే మీ మెమరీ కార్డులో ఉన్న ఫోటోలు కరప్ట్‌ అయ్యాయి. ఏమైనా ఫైళ్లను మీరు డిలీట్‌ చేసినప్పుడు వాటిని డేటా రికవరీ సాఫ్ట్‌వేర్ల ద్వారా వెనక్కి తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి గానీ, కరప్ట్‌ అయిన ఫోటోలను తిరిగి వెనక్కి పొందడం మాత్రం సాధ్యపడదు. కాబట్టి ఈ విషయంలో చేయగలిగిందేమీ లేదు. అలా మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటికప్పుడు మీ ఫోటోలను గూగుల్‌ ఫొటోస్‌ వంటి క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసులలో బ్యాకప్‌ తీసుకోండి.


ఫోన్‌ కాంటాక్టులు ఎందుకలా?

మా నాన్న మొబైల్‌లో సేవ్‌ చేస్తున్న కాంటాక్టులు నా మొబైల్‌లో వస్తున్నాయి. మా నాన్న మొబైల్‌లో మెయిల్‌ సింక్‌ అవకుండా సైన్‌అవుట్‌ అయ్యాను. వేరే మెయిల్‌తో లాగిన్‌ అయ్యాను. నేను వేరే మెయిల్‌ వాడుతున్నాను. అయినా కాంటాక్టులు నా ఫోన్‌లో సేవ్‌ అవుతున్నాయి. దీనికి పరిష్కారం చెప్పండి.

- రేణు, తణుకు


మీ ఇద్దరి ఫోన్లలో ‘కాంటాక్ట్స్‌ అప్లికేషన్‌’ కరప్ట్‌ అయినప్పుడు ఇలా జరుగుతుంది. మీ ఫోన్లో సెట్టింగ్స్‌లో అప్లికేషన్స్‌ విభాగంలోకి వెళ్లి కాంటాక్ట్స్‌ గానీ, ఫోన్‌ అనే యాప్‌ గానీ వెతికి పట్టుకొని దాని డేటా క్లియర్‌ చేయండి. అలాగే మీరు మీ నాన్న ఫోన్లో మెయిల్‌ ఏ ప్రదేశంలో సైన్‌ అవుట్‌ అయ్యారో వివరంగా తెలపలేదు. సెట్టింగ్స్‌ లో, అకౌంట్స్‌ అనే విభాగంలోకి వెళ్లి అక్కడ మాత్రమే అకౌంట్‌ తొలగించండి. అప్పుడే సరైన ఫలితం ఉంటుంది. మీరు వేరే మెయిల్‌ వాడుతున్నప్పటికీ, గతంలో మీ నాన్న అకౌంట్‌ని మీ ఫోన్లో అకౌంట్స్‌ విభాగంలో కాన్ఫిగర్‌ చేసి ఉంటే కొన్నిసార్లు కాన్ఫిగరేషన్‌ ఇబ్బందుల వల్ల డేటా సింక్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి.

Updated Date - 2020-02-15T06:08:48+05:30 IST