మంత్రి సబితా కుమారుడి పేరిట మోసాలకు పాల్పడిందెవరు..?

ABN , First Publish Date - 2021-01-08T11:56:47+05:30 IST

మంత్రి సబితా కుమారుడి పేరిట మోసాలకు పాల్పడిందెవరు..?

మంత్రి సబితా కుమారుడి పేరిట మోసాలకు పాల్పడిందెవరు..?

హైదరాబాద్/రాజేంద్రనగర్‌ : విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి  మూడో కుమారుడైన పి.కళ్యాణ్‌రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఆదిలాబాద్‌ టౌన్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌(32) అనే వ్యక్తిని రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ వెల్లడించారు. నాదర్‌గుల్‌ ప్రాంతంలో నివాసం ఉండే శివరాంపల్లికి చెందిన బీజేపీ నాయకుడు సామల నరేందర్‌రెడ్డి బావకు తిరుపతి పీఆర్‌వో స్నేహితుడు. నరేందర్‌రెడ్డి బావ తిరుపతి పీఆర్‌ఓకు ఫోన్‌ చేసి తన కూతురుకు ఇబ్రహీంపట్నంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో సీటు కావాలని అడిగినప్పుడు, ఆయన, తనకు విద్యాశాఖ మంత్రి మూడో కుమారుడు కళ్యాణ్‌రెడ్డి పరిచయం ఉన్నారు అని,  ఎవరికైనా తిరుపతి దర్శనం కావాలంటే తనతో మాట్లాడుతుంటాడని చెప్పాడు.


కళ్యాణ్‌రెడ్డి పేరుతో పరిచయమైన ఆదిలాబాద్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌కు నరేందర్‌రెడ్డి బావ ఫోన్‌ చేసి ఇంజనీరింగ్‌ కాలేజీలో సీటు కావాలని కోరగా.. అందుకు సరేనన్న ప్రవీణ్‌కుమార్‌ రూ.7లక్షలను గూగుల్‌ పే ద్వారా తన అకౌంట్‌లో వేయాలని చెప్పాడు. ఆ డబ్బును మూడు నెలల క్రితం గూగుల్‌పే ద్వారా ప్రవీణ్‌కుమార్‌కు పంపించారు. ఎంతకూ కాలేజీలో సీటు ఇప్పించకపోవడంతో నరేందర్‌రెడ్డికి అతని బావ ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో ఆయన నేరుగా అసలు కళ్యాణ్‌రెడ్డితో మాట్లాడాడు. ‘మీరనుకున్న కళ్యాణ్‌ను నేను కాదని, నా పేరుతో వేరే ఎవరో మోసాలకు పాల్పడుతుండవచ్చు’ అని సబితారెడ్డి తనయుడు కళ్యాణ్‌రెడ్డి చెప్పాడు. దీంతో సామల నరేందర్‌రెడ్డి డబ్బులు తీసుకున్న వ్యక్తిపై రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు కళ్యాణ్‌రెడ్డి పేరును వాడుకుంటూ డబ్బులు గుంజిన వ్యక్తి ఆదిలాబాద్‌ టౌన్‌ నివాసి ప్రవీణ్‌కుమార్‌ అని తేల్చారు. అతన్ని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. విచారణలో ప్రవీణ్‌కుమార్‌ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బీటెక్‌ చదువుకున్న ప్రవీణ్‌కుమార్‌ జల్సాలకు అలవాటు పడి క్లబ్‌లు, పబ్‌లకు వెళ్లడానికి డబ్బులు చాలక మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కళ్యాణ్‌రెడ్డి ప్రొఫైల్‌ను తెలుసుకుని ఆయన పేరుతో మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. 


కళ్యాణ్‌ ఇంద్రారెడ్డి పేరుతో...

కళ్యాణ్‌ ఇంద్రారెడ్డిగా ట్రూ కాలర్‌లో తన పేరును పెట్టుకున్న ఆదిలాబాద్‌ టౌన్‌ నివాసి ప్రవీణ్‌కుమార్‌ తిరుపతి పీఆర్‌వోకు ఫోన్‌ చేసి తన బంధువులు తిరుపతి వస్తున్నారని, దర్శ నం బాగా చేయించు అని గతంలో మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. ఆసి్‌ఫనగర్‌ డీఈవోను ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తానని కూడా ప్రవీణ్‌కుమార్‌ రూ.లక్షను తీసుకున్నట్టు తెలిసింది. తనకున్న రెండు మొబైల్‌ ఫోన్లలో ఒకటి కళ్యాణ్‌ ఇంద్రారెడ్డి అని, మరొకటి ప్రవీణ్‌కుమార్‌ అని ట్రూ కాలర్‌లో ఆ మేరకు  పెట్టుకుని కళ్యాణ్‌రెడ్డి అన్న చెప్పాడని అందరికీ ఫోన్‌ చేసి డబ్బు లు తీసుకునేవాడు. 


మహవీర్‌ ఆస్పత్రిలో నీళ్లకు ఇబ్బందిగా ఉందని సమాచారం తెలుసుకున్న ప్రవీణ్‌కుమార్‌ మిషన్‌ భగీరథతో ఆస్పత్రిలో నీటి సౌకర్యం కల్పిస్తానని చెప్పి రూ. 2లక్షల మోసానికి పాల్పడ్డాడు. మహవీర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో లాక్‌డౌన్‌ సమయంలో విద్యా తరగతులతోపాటు పాసు లు ఇప్పిస్తానని లక్షలు తీసుకున్నాడు. ప్రవీణ్‌కుమార్‌ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌తో కూడా మాట్లాడినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో పరిచ యం అయిన ఒక అమ్మాయితో కళ్యాణ్‌రెడ్డి పేరుతో చాటింగ్‌ చేసి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.5లక్షలు తీసుకున్నాడు.

Updated Date - 2021-01-08T11:56:47+05:30 IST