మానవ హక్కుల నేత జయశ్రీ కన్నుమూత

ABN , First Publish Date - 2021-08-02T06:55:05+05:30 IST

మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాకుమాని జయశ్రీ (61) శనివారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో చనిపోయారు.

మానవ హక్కుల నేత జయశ్రీ కన్నుమూత

ప్రొద్దుటూరు అర్బన్‌, ఆగస్టు 1: మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాకుమాని జయశ్రీ (61) శనివారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో చనిపోయారు. ఆమె భౌతికకాయాన్ని ఆదివారం కడప జిల్లా ప్రొద్దుటూరు శాస్ర్తీనగర్‌లోని ఆమె స్వగృహానికి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల నేతలు ప్రొద్దుటూరుకు తరలివచ్చి అంతిమ వీడ్కోలు పలికారు. సాయంత్రం ఎర్రగుంట్ల రోడ్డులోని ఆర్యవైశ్య హిందూ శ్మశానవాటికలో దహన సంస్కారాలు జరిగాయి. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, విరసం నేతలు జయశ్రీ భౌతికకాయాన్ని సందర్శించారు. జయశ్రీ 1960 ఏప్రిల్‌ 15న ప్రొద్దుటూరులో కాకుమాని బంగారయ్య, వెంకటమ్మ దంపతులకు ఆఖరిసంతానంగా జన్మించారు. 1986లో న్యాయవాద పట్టా పొందారు. 1988లో పౌరహక్కుల సంఘంలో చేరి పోలీసుల చట్టవ్యతిరేక చర్యలను ఎండగడుతూ వచ్చేవారు.  సాయుధ ముఠాల వ్యతిరేక పోరాట కమిటీలో క్రియాశీలకంగా పనిచేసి ఫ్యాక్షన్‌ రాజకీయాల నిర్మూలనకు హక్కుల నేతలతో కలిసి ఉద్యమించారు. 1998 నుంచి మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌గా ఆమె జిల్లాలో యురేనియం వ్యతిరేక ఉద్యమం, కుందూ పెన్నానది ఉద్యమం, కడపకు వైఎ్‌సఆర్‌ పేరుకు వ్యతిరేకంగా ఉద్యమం, పెద్ద పసుపులలో మద్య వ్యతిరేక ఉద్యమం, గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు.  మైనింగ్‌ శాఖలో 160 మంది గిరిజనుల ఉద్యోగాలు తొలగించడంపై నేషనల్‌ షెడ్యూల్‌ ట్రైబ్‌ కమిషన్‌కు చేసిన ఫిర్యాదు మేరకు సోమవారం ఢిల్లీలో కమిషన్‌ ముందు హియరింగ్‌కు వెళ్లాల్సి ఉంది. శనివారం హైదరాబాదులో సోదరుడి ఇంటిలో ఫోన్‌లో మాట్లాడుతూ గుండెపోటుతో కుప్పకూలారు.

Updated Date - 2021-08-02T06:55:05+05:30 IST