టెన్త్‌ పిల్లల ఆకలి కేకలు!

ABN , First Publish Date - 2021-04-14T08:37:37+05:30 IST

పబ్లిక్‌ పరీక్షల ముంగిట టెన్త్‌ విద్యార్థులకు ఆకలి పాట్లు మొదలయ్యాయి. స్టడీ క్లాసుల నిర్వహణ తీరు వారి కడుపులను కాలుస్తోంది. జూన్‌ 7నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించేలా

టెన్త్‌ పిల్లల ఆకలి కేకలు!

ఉదయం 10.30 గంటలకు పెట్టే భోజనంతో సరి

సాయంత్రం 5 వరకు స్టడీ క్లాసులతో నకనక’స్నాక్స్‌ పెట్టకపోవడంతో 

కాలుతున్న కడుపులు జూన్‌లో పబ్లిక్‌ పరీక్షలు

అప్పటి వరకూ ఇంతేనా?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పబ్లిక్‌ పరీక్షల ముంగిట టెన్త్‌ విద్యార్థులకు ఆకలి పాట్లు మొదలయ్యాయి. స్టడీ క్లాసుల నిర్వహణ తీరు వారి కడుపులను కాలుస్తోంది. జూన్‌ 7నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ క్లాసులు ప్రారంభించారు. ఈ నెల 1 నుంచి ఒంటిపూట బడులు జరుగుతుండగా పదో తరగతి విద్యార్థులు ఉదయం 8గంటలకే పాఠశాలలకు చేరుకుంటున్నారు. 1నుంచి 9వ తరగతి వరకు మధ్యాహ్నం 12.30వరకే స్కూళ్లు నిర్వహిస్తున్నారు. టెన్త్‌ విద్యార్థులు మాత్రం సాయంత్రం 5గంటల వరకు తరగతుల్లోనే మగ్గుతున్నారు.


ఈ విద్యా సంవత్సరం 5నెలలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో వారికి సిలబస్‌ ఇప్పుడిప్పుడే పూర్తవుతోంది. అందువల్ల స్టడీక్లాసులు నిర్వహణ అనివార్యమైంది. ఒంటిపూట బడుల కారణంగా ఉదయం 10.30గంటలకే మధ్యాహ్న భోజన పథకం కింద పిల్లలందరికీ భోజనం పెడుతున్నారు. దాంతోనే టెన్త్‌ పిల్లలు సాయంత్రం 5గంటల వరకు సరిపెట్టుకోవలసి వస్తోంది. ఎక్కడైనా ప్రధానోపాధ్యాయులు, టీచర్లు చొరవ తీసుకుని స్నాక్స్‌గా ఏవైనా అందిస్తే వాటితో సరిపెట్టుకుంటున్నారు. లేదంటే స్టడీ క్లాసుల్లో సాయంత్రం వరకూ ఆకలితో నకనకలాడుతున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం దాదాపు 6లక్షల మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. గతేడాది కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకపోవడంతో స్టడీ క్లాసుల అవసరం లేకపోయింది. కానీ ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించింది. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా అసాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప జూన్‌ 7 నుంచి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు ఉదయం 10.30కు తిన్న భోజనంతో సాయంత్రం 5గంటల వరకు ఉండాల్సి రావడంతో విద్యార్థులు కాలే కడుపులతో నీరసించిపోతున్నారు. 2019లో పబ్లిక్‌ పరీక్షల వరకు కూడా పదో తరగతి విద్యార్థులకు స్టడీ క్లాసులు నిర్వహిస్తే స్నాక్స్‌ పెట్టేవారు. ఇందుకయ్యే ఖర్చు జిల్లా పరిషత్తులు భరించేవి. కానీ ఈసారి పరిషత్తులకు పాలకవర్గాలు ఇంకా ఏర్పడలేదు. జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకుని పిల్లలకు సాయంత్రం పూట అల్పాహారం అందించేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలూ లేవు. పబ్లిక్‌ పరీక్షల వరకు టెన్త్‌ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని పలువురు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-04-14T08:37:37+05:30 IST