రసవత్తరంగా సాగుతున్న Huzurabad ఉప ఎన్నిక..కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న స్థానికులు

ABN , First Publish Date - 2021-10-30T16:38:36+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెతిస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కీలక ఘట్టానికి చేరుకుంది. ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ ...

రసవత్తరంగా సాగుతున్న Huzurabad ఉప ఎన్నిక..కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న స్థానికులు

హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెతిస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కీలక ఘట్టానికి చేరుకుంది. ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో హుజురాబాద్ పీఠాన్ని ప్రజలు ఎవరికి కట్టబెడుతారోనని రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.


కౌశిక్ రెడ్డిని నిలదీసిన స్థానికులు..

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గణుముక్కుల గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‎లో టీఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డి ప్రచారం చేస్తున్నట్లు స్థానికులు నిలదీశారు. దీంతో పోలీంగ్ బూత్ వద్ద ఉద్రిక్తత వాతావరణానికి దారి తీసింది. పోలింగ్ బూత్‌లో ప్రచారం చేయడం ఏంటీ అంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గనుముక్కులలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా తనకు ఏజెంట్ పాస్ ఉందని కౌశిక్ రెడ్డి చెప్పగా... స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


మరోవైపు జమ్మికుంటలో టీఆర్ఎస్, బీజేపీ నేతల ఘర్షణ

జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గల 176వ బూత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికేతరుల ప్రచారాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 


పోలింగ్ బూత్‎ల్లో గందరగోళం 

ఉప్ప ఎన్నిక పోలింగ్ లో కొన్ని చోట్ల బూత్‎ల్లో గందగోళం ఏర్పడింది. బూతుల్లో 30 మందికి సరిపడా రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో..మొదటి ఈవీఎం పెట్టాల్సిన స్థానంలో రెండవ ఈవీఎంను పెట్టారు. దీంతో బూత్‎లో గందరగోళం నెలకొంది. ఓటు వేయడానికి వచ్చిన ఓట్లరు అయోమయానికి గురై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-30T16:38:36+05:30 IST