లాక్‌డౌన్‌ దొంగ..!

ABN , First Publish Date - 2020-07-05T13:39:45+05:30 IST

లాక్‌డౌన్‌ దొంగ..!

లాక్‌డౌన్‌ దొంగ..!

కరోనా కాలంలో వరుస చోరీలు

సైబరాబాద్‌, రాచకొండ పరిధుల్లో..

అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్‌ చేసిన ఎస్‌వోటీ

రూ.70 లక్షల విలువైన సొత్తు స్వాధీనం


హైదరాబాద్‌: తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి దొంగతనాలు చేయడం, దోచేసిన సొత్తును తాకట్టు పెట్టడం, వచ్చిన డబ్బుతో జల్సా చేయడం అతడి దినచర్య. కర్ణాటక, తమిళనాడులో చోరీలు చేసి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. అయినా పద్ధతి మార్చు కోకుండా హైదరాబాద్‌కు మకాం మార్చాడు. లాక్‌డౌన్‌కు ముందు నగరానికి వచ్చి.. ఇక్కడే తిష్ఠ వేసిన ఈ చోర శిఖామణి  సైబరాబాద్‌, రాచకొండ, సంగారెడ్డి పరిధుల్లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. చివరకు సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శనివారం కమిషనరేట్‌లో నిందితుడి వివరాలు వెల్లడించారు. 


కర్ణాటక రాష్ట్రం బెంగళూరు హంపాపూర్‌కు చెందిన బస్వరాజ్‌ ప్రకాశ్‌ లాక్‌డౌన్‌కు ముందు నగరానికి వచ్చాడు. సంగారెడ్డి పరిధిలోని అమీన్‌పూర్‌ ప్రాంతంలో ఉండేవాడు. పగలంతా రాచకొండ, సైబరాబాద్‌, సంగారెడ్డి ప్రాంతాల్లోని కాలనీల్లో తిరుగుతూ ఖరీదైన ఇళ్లు, విల్లాలు, అపార్టుమెంట్లలో రెక్కీ నిర్వహించేవాడు. ఆయా ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, అర్ధరాత్రి ఒంటరిగా వచ్చి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి, నగదు అందినంతా దోచుకొని వెళ్లిపోయేవాడు. ఇలా లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటి వరకు మొత్తం 18 చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

 

ఎస్‌వోటీ ప్రత్యేక నిఘా..

కేపీహెచ్‌బీ, బాచుపల్లి పరిధుల్లో వరుస చోరీలు జరుగుతుండటంతో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘరానా దొంగను పట్టుకోవడానికి మాదాపూర్‌ ఎస్‌వోటీ, కేపీహెచ్‌బీ పోలీసులను రంగంలోకి దింపారు. సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలు, టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో సుమారు 15 రోజుల పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిందితుడు గతంలో కర్ణాటకలో అరెస్ట్‌ అయినట్లు గుర్తించారు. అక్కడి నుంచి మరికొన్ని ఆధారాలు సేకరించి నిందితుడు ప్రకాశ్‌ను పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 1,013 గ్రాముల బంగారం, 3.2 కేజీల వెండి, బ్రీజా కారు, డియో స్కూటీ సహా మొత్తం రూ.70లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.


నిందితుడిని పట్టుకుని సైబరాబాద్‌లో ఆరు, రాచకొండలో ఏడు, సంగారెడ్డిలో మూడు, తమిళనాడులో రెండు చొప్పున మొత్తం 18 కేసులను ఛేదించారు. సీపీ సజ్జనార్‌ ఆదేశాలతో మాదాపూర్‌ అడిషనల్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సందీప్‌ పర్యవేక్షణలో ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌, కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ, డీఐ సైదులు, ఎస్‌వోటీ ఎస్సై లాలు, విజయ్‌కుమార్‌, హరిశంకర్‌లు ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసి ఘరానా నిందితుడి ఆట కట్టించారు. వారందరినీ సీపీ సజ్జనార్‌ అభినందించి రివార్డులు అందజేశారు.


Updated Date - 2020-07-05T13:39:45+05:30 IST