‘రుచి’లేని జీవితాలు

ABN , First Publish Date - 2021-06-02T17:14:59+05:30 IST

నగరంలో నిత్యం వినియోగదారులతో కిటకిటలాడే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు కరోనా కారణంగా దివాలా తీశాయి. మొదటి దశ కరోనాలో రెండు నెలల పాటు

‘రుచి’లేని జీవితాలు

ఈవెనింగ్‌ స్నాక్స్‌ చప్పగా..

కరోనాలో కుదేలైన ఫాస్ట్‌ఫుడ్‌, బజ్జీల వ్యాపారం

అద్దెలు, ఫైనాన్స్‌ల వడ్డీల భారం

రోడ్డున పడుతున్న వేలాది జీవితాలు

రాత్రి టిఫిన్‌ బండ్ల వ్యాపారులకూ ఇబ్బందులే..


హైదరాబాద్/బంజారాహిల్స్‌: నగరంలో నిత్యం వినియోగదారులతో కిటకిటలాడే ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు కరోనా కారణంగా దివాలా తీశాయి. మొదటి దశ కరోనాలో రెండు నెలల పాటు లాక్‌డౌన్‌లో మిర్జిబజ్జీ, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. రెండో దశ వారిని మరింత చిదిమేస్తోంది. 


వేల కుటుంబాలకు ఉపాధి..

నగరంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బండ్లపై బజ్జీలు, రాత్రి టిఫిన్‌ సెంటర్లు నడుపుతూ వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం ప్రత్యక్షంగా సుమారు 40 వేల కుటుంబాలు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నాయి. పరోక్షంగా నాలుగు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే, లెక్కల్లోకి రాని వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఫుట్‌పాత్‌, చిన్న పాటి అడ్డా దొరికితే చాటు మిర్చీబండి లేదా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. దీనికితోడు రాజస్థాన్‌ నుంచి వచ్చిన కొంత మంది చిన్నపాటి స్థలం దొరికితే అందులో జిలేబీలు, సమోసా, పకోడి దుకాణాలు పెడుతున్నాయి. బడా వ్యాపారాలతో ధీటుగా నడవకపోయినప్పటికీ నాలుగు మెతుకులకు మాత్రం కొదవ ఉండదు. కానీ కరోనా కారణంగా ఈ వ్యాపారాలన్నీ దివాలా తీస్తున్నాయి. వ్యాపారులకు నష్టాలు తెచ్చి పెట్టగా ఉపాధి పొందుతున్న వంట వారు, వడ్డించే వారికి ప్రస్తుతం పనులు లేక ఖాళీగా ఉంటున్నారు. ఆకలి తీర్చుకునేందుకు అవకాశాలు లేకపోవడంతో వీరిలో మెజారిటీ శాతం సొంత గ్రామాల బాట పడ్డారు. మిగతా వారు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తుపై ఆశలతో కాలం గడుపుతున్నారు. 


చిల్లి గవ్వ లేక..

ఫుట్‌పాత్‌ మీద ఫాస్ట్‌ఫుడ్‌ వ్యాపారాలు నిర్వహించే  వారు రోజుకు కనీసం రూ.1500 నుంచి రూ.2000 సంపాదించేవారు. ఇందులో పనిచేసే వంటవారు జీతం రూ.800 నుంచి వెయ్యి రూపాయల పైనే ఉంటుంది. ఇక పనివారుఎంత లేదన్నా రూ.500 సంపాదిస్తారు. కానీ, యేడాది కాలంగా వీరి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. మొదటి దశ కరోనా ముగిసినప్పటికీ ఈ వ్యాపారాలు  యేడాది చివరి వరకు ఊపందుకోలేదు. దీంతో చాలీచాలనీ సంపాదనతో నెట్టుకొచ్చారు.  ఈ యేడాది జనవరి నుంచి వ్యాపారాలు కాస్త ఆశాజనకంగా ఉండటంతో ఇక తిరుగు లేదనుకున్నారు. కానీ, రెండో దశ కరోనాతో ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ విధించింది. దాచుకున్న డబ్బు లేదు, సంపాదన లేకపోవడంతో చాలా మంది తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఇళ్లలో పని వారిగా, సెక్యూరిటీ గార్డులుగా మారుతున్నారు.  మరికొందరు కూలీ వెళ్లడానికి మొగ్గు చూపిస్తున్నారు. 


తరుముకొస్తున్న ఆర్థిక సమస్యలు

ఫుట్‌పాత్‌ వ్యాపారుల పరిస్థితి ముందుకు వెళితే గొయ్యి వెనక్కి వెళితే నుయ్యి అన్న చందంగా మారింది. కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్‌ విధించడంతో వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి. ఇరవై రోజులు ఎలాగో అలా వ్యాపారులు నష్టాలు తట్టుకుంటూ వచ్చారు. కానీ, ఒకటో తారీఖు దాటిందంటే షాపు అద్దె, తీసుకున్న రుణానికి వడ్డీ అది కట్టకపోతే చక్రవడ్డీ, కుటుంబ పోషణ కోసం డబ్బు ఇలా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టుకొస్తున్నాయి. వ్యాపారాలు చిన్నవే అయినా ఒకో బండి నిర్వాహకుడు రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అద్దె కడుతున్న వారు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారాలు లేవు. ఇలాంటి సమయంలో అద్దె కట్టడం ఇబ్బందితో కూడుకున్న అంశం. అలా అని అద్దె కట్టకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాధి కల్పిస్తున్న అడ్డా చేయి జారిపోతుంది. ఇలాంటి తరుణంలో ముందుకు ఎలా వెళ్లాలో తెలియక ఫుట్‌పాత్‌ వ్యాపారులు దిగాలు పడుతున్నారు. 


సంపాదన ఆవిరి

రోజంతా కష్టపడితే వచ్చేది నాలుగు రూపాయలు. కరోనా పుణ్యమాని అవి గతేడాదే ఆవిరయిపోయాయి. అయినప్పటికీ సంపాదించుకోవచ్చు లే అనుకున్నా. కానీ రెందో దశ కారణంగా వ్యాపారం దివాలా తీసింది. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసినా వ్యాపారం మనుపటిలా సాగుతుందన్న ఆశ కూడా లేదు. పనివారు ఊరెళ్లిపోయారు. ప్రభుత్వం మాలాంటి చిన్న వ్యాపారులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా అద్దె, రుణం వంటి వాటి విషయంలో వెలుసుబాటు కల్పిస్తే మేలు చేసిన వారవుతారు. 

- సాయి, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు,  కూకట్‌పల్లి  


ఆర్థిక ఇబ్బందులు 

పది సంవత్సరాల నుంచి వ్యాపారం నిర్వహిస్తున్నా. ఉదయం లేచి, అన్ని సిద్ధం చేసుకుంటేనే సాయంత్రం స్నాక్స్‌ అందించగలుగుతాం. ఇంత చేసినా పెద్దగా సంపాదించినది లేదు. ఇప్పుడు కరోనా కారణంగా భవిష్యత్తుపై భరోసా కోల్పోతున్నాం. పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేలా కనిపించడం లేదు. లాక్‌డౌన్‌ సాయంత్రం వేళ కొంచెం మినహాయింపు ఇస్తే కనీసం కొంత వ్యాపారం జరిగి ఉండేది.కాని ప్రభుత్వం ఉదయం సమయాల్లో మాత్రమే వేసులు బాటు ఇచ్చింది. మాలాంటి వ్యాపారుల ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించలేకపోయింది. 

- అంజీ, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌, శ్రీనగర్‌ కాలనీ

Updated Date - 2021-06-02T17:14:59+05:30 IST