Abn logo
Sep 17 2021 @ 12:17PM

నిరంకుశత్వం తలవంచిన రోజు...

1948, సెప్టెంబర్‌17... నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు. రజాకార్ల ఆగడాలు అంతమైన రోజు. ఈ నేలపై త్రివర్ణపతాకం ఎగిరిన రోజు. అంతటి ఘన చరిత్ర కలిగిన ఇదే రోజు ఇప్పుడు అత్యంత వివాదాస్పదం. ఈ నేపథ్యంలో నిజాం వ్యతిరేక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాడిన కొందరు ఉద్యమ వీరులు ఏమంటున్నారంటే.. 


హైదర్‌బాద్‌ సిటీ:

మేముండగానే చరిత్రను వక్రీకరిస్తారా

నిజాం వ్యతిరేక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రతో జన సంఘ్‌కి కానీ, బీజేపీకి కానీ, వీటి మాతృసంస్థ ఆర్‌ఎ్‌సఎ్‌సకు గానీ అస్సలు సంబంధం లేదు. ఇన్నాళ్లు ఆ చరిత్రను తలవని వాళ్లు ఇప్పుడు కొత్తగా విమోచనం అంటూ రాద్ధాంతం చేస్తున్నారు. ఆ మహత్తర పోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాడిన మేమంతా బతికుండగానే చరిత్రను వక్రీకరిస్తున్నారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే రెండు మూడేళ్లుగా విమోచనం పాటెత్తుకున్నారు. 1948, సెప్టెంబరు17కు ముందే భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్‌ సంస్థానంలోని కొన్నివేల గ్రామాలను విముక్తి చేసింది. కొన్ని లక్షల ఎకరాలను పేదలకు పంచింది.  ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వల్లే హైదరాబాద్‌ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనం అయిందనేది వాస్తవం. 

- కందిమళ్ల ప్రతాపరెడ్డి, కార్యదర్శి, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌


చరిత్రకు మతం రంగు పులమవొద్దు...

ఆంధ్రమహాసభ స్ఫూర్తితో నిజాం వ్యతిరేక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోకి వెళ్లాను. మూడేళ్లు రహస్య జీవనం గడుపుతూ ఉద్యమించాను. జైలు శిక్షా అనుభవించాను. నిజాం వ్యతిరేక పోరాటానికి మతం రంగు పులమడం అన్యాయం. రజాకార్ల కబంధహస్తాల నుంచి గ్రామాలను విడిపించారు. ఆ పోరాటానికి మగ్దూం మొహియుద్దీన్‌ వంటి ప్రజా నాయకులు నాయకత్వం వహించారు. ఇమ్రోజ్‌ పత్రిక నిర్వాహకుడు షోయబుల్లాఖాన్‌ రజాకార్ల దౌర్జన్యాలను నిరసించి, హత్యకు గురయ్యారు. ఇలా ఆ పోరాటంలో ప్రాణాలకు తెగించి పాల్గొన్న ముస్లింనాయకులు, కార్యకర్తలు చాలా మందే ఉన్నారు. నిజాం పరిపాలనను భూస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా చూడాలేగానీ మతం  కోణం నుంచి చూడటం సరికాదు. 

- దొడ్డా నారాయణరావు, నిజాం వ్యతిరేక పోరాట యోధుడు


నిజాం పరిపాలనను వ్యతిరేకించా...

మాది ఒకప్పుడు దేశ్‌ముఖ్‌ల కుటుంబం. సిద్దిపేట పరిసరాల్లోని కొన్నిగ్రామాలకు మా నాన్న జాగిర్దార్‌. హైదరాబాద్‌లోని దారుల్షిఫా స్కూల్లో చదువుకోడానికి వచ్చిన నేను హెడ్‌ మాస్టారు నూరుల్‌హాసన్‌ ప్రభావంతో సామ్యవాద భావజాలానికి ఆకర్షితుడనయ్యాను. ఆల్‌ హైదరాబాద్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌కు సిటీ కార్యదర్శిగా 1947లో ఎంపికయ్యాను. ఆ తర్వాత నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మందుగుండు సామగ్రి, తుపాకులు రహస్యంగా చేరవేసేవాడిని. రజాకార్లు అంటే భూస్వామ్య వ్యవస్థని కాపాడేందుకు పుట్టిన సైనిక సంస్థ. గుండారం కిష్టారెడ్డి, ధర్మారెడ్డి వంటి దొరలెందరో ఆ సంస్థని పెంచి, పోషించారు. నేను రెండు సార్లు రజాకార్ల వద్ద ఆయుధాలను దొంగిలించి, వాటిని కమ్యూనిస్టు కార్యకర్తలకు అందచేశాను. నా మీద నిజాం పోలీసులు కక్షకట్టడంతో కొన్నాళ్లు రహస్య జీవనం గడిపాను. అప్పుడూ కరపత్రాలు పంచడం, లిఖిత పత్రికలు రాయడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. సామ్రాజ్యవాదులకు తొత్తుగా వ్యవహరించిన నిజాం అంటే నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. కనుకే నిజాం వ్యతిరేక ఉద్యమంలో నేనూ భాగమయ్యాను. ఆ రోజుల్లోనే నా ఇంటి బురుజును కూలగొట్టాను. ‘దున్నేవాడిదే భూమి’ నినాదంతో మాకున్న నాలుగువందల ఎకరాలను కూడా పేదలకు ఇచ్చాను. 

- మొహ్మద్‌ ఖాజా మొయినుద్దీన్‌, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు

క్రైమ్ మరిన్ని...