సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాడు పని.. నిఘా పెట్టి పట్టిన పోలీసులు

ABN , First Publish Date - 2020-12-10T12:22:42+05:30 IST

మహ్మద్‌ సోహెబ్‌ఖాన్‌ (22) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాడు పని.. నిఘా పెట్టి పట్టిన పోలీసులు

  • పలు ప్రాంతాల్లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు
  • 55 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, 3 కిలోల గంజాయి స్వాధీనం
  • నలుగురి అరెస్ట్‌, 3 బైకులు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్‌ : రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది దాడులు చేసి 55 ఎల్‌ఎస్‌డీ బ్లాట్లతోపాటు 3 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మెహిదీపట్నం, బోయినపల్లి ప్రాంతాల్లో నిఘా పెట్టి డ్రగ్స్‌ విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి మూడు ద్విచక్రవాహనాలు, మూడు మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


ఆన్‌లైన్‌లో ఆర్డర్‌...

రేతిబౌలి ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సోహెబ్‌ఖాన్‌ (22) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఇతడికి గంజాయి వంటి మాదక ద్యవ్యాలతోపాటు సైకడలిక్‌ పేరుతో నిర్వహించే పార్టీల్లో ఇతర డ్రగ్స్‌ కూడా అలవాటయ్యాయి. సొంతంగా డ్రగ్స్‌ అమ్మేందుకు పథకం రచించాడు. తనకున్న పరిచయాలతో ఆన్‌లైన్‌లో బిట్‌కాయిన్‌లు చెల్లించి (350 ఎంజీ) ఎల్‌ఎస్‌డీ బ్లాట్‌ల డ్రగ్స్‌ 100 కొనుగోలు చేశాడు. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్డర్‌ తీసుకుంటూ అవసరమున్నవారికి విక్రయిస్తున్నాడు.


ఒక్కో ఎల్‌ఎస్‌డీ బ్లాట్‌ రూ. 850 కొనుగోలు చేసి, దానిని కస్టమర్లను బట్టి రూ. 1700 నుంచి రూ. 2000 వరకు విక్రయిస్తున్నాడు. ఇతడి వ్యవహారంపై పక్కా సమాచారమందుకున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది మెహదీపట్నం కేఎఫ్‌సీ వద్దకు ఎల్‌ఎస్‌డీ విక్రయించేందుకు హోండా యాక్టివా వాహనంపై వచ్చిన సొహెబ్‌ను అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 55 ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు, హోండా యాక్టివా వాహనం, మొబైల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం సామగ్రితోపాటు నిందితుడిని గోల్కొండ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు.


3 కిలోల గంజాయి స్వాధీనం..

బోయినపల్లి ఆశి్‌షగార్డెన్‌ ప్రాతంలో రూట్‌వాచ్‌ నిర్వహిస్తున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందానికి రాజన్నగారి సందీ‌ప్‌రెడ్డి(29) కిలో ఎండు గంజాయితో పట్టుబడ్డాడు. విచారణలో బాలానగర్‌ ప్రాంతానికి చెందిన బొల్లా దుర్గాప్రసాద్‌, మూసాపేట ప్రాంతానికి చెందిన కంచర్ల సత్య నారాయణ అలియాస్‌ సత్తిబాబు(25) గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకొని మరో 2కిలోల ఎండుగంజాయి, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరిస్తున్న కుత్బుల్లాపూర్‌కు చెందిన ఉన్నం శివాజి పరారీలో ఉన్నాడు. అరకు, ఒడిషా ప్రాంతాల నుంచి కిలో గంజాయి రూ.3 వేలకు కొనుగోలు చేసి, ఇక్కడ కిలో రూ.5 వేలకు అమ్ముతున్నట్లు నిందితుడు బొల్లా దుర్గాప్రసాద్‌ అంగీకరించాడు. వీరి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 3సెల్‌ఫోన్లతోపాటు 3కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-12-10T12:22:42+05:30 IST