హైదరాబాద్‌లో టీకా వేసుకున్న స్టాఫ్‌ నర్సు పరిస్థితి ఇదీ..

ABN , First Publish Date - 2021-01-17T11:59:29+05:30 IST

కరోనా నివారణకు ఇస్తున్న వ్యాక్సిన్‌ తొలిడోస్‌ వేసే కార్యక్రమం విజయవంతమైంది.

హైదరాబాద్‌లో టీకా వేసుకున్న స్టాఫ్‌ నర్సు పరిస్థితి ఇదీ..

హైదరాబాద్/ఉప్పల్‌/ నేరేడ్‌మెట్‌/అల్వాల్‌ : కరోనా నివారణకు ఇస్తున్న వ్యాక్సిన్‌ తొలిడోస్‌ వేసే కార్యక్రమం  విజయవంతమైంది. అపోహలన్నీ పటా పంచలు చేస్తూ ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉప్పల్‌ నియోజకవర్గంలోని కాప్రా జమ్మిగడ్డలోని, మల్లాపూర్‌, ఉప్పల్‌, రామంతాపూర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కోవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భేతి సుభా‌ష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్‌ సర్కిల్‌ డీసీ అరుణకుమారి, ఉప్పల్‌ తహసీల్దార్‌, కార్పొరేటర్లు భేతి స్వప్నారెడ్డి, గంధం జ్యోత్స్న నాగేశ్వర్‌రావు, పన్నాల దేవేందర్‌రెడ్డి, గోపు సరస్వతి సదానంద్‌, నూతనంగా గెలుపొందిన కార్పొరేటర్‌ బన్నాల గీతా ప్రవీణ్‌ముదిరాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎదుల్ల కొండల్‌రెడ్డి, పల్లె నర్సింగరావు, వేముల సంతోష్‌రెడ్డి, యాదిరెడ్డి, సోమసాని ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్‌ పరిధిలో 30మంది వ్యాక్సిన్‌ వేసుకోగా అందులో 26మంది మహిళలు, నలుగురు పురుషులున్నారు. రామంతాపూర్‌, హబ్సిగూడ పరిధుల్లో తొలిరోజు 16 మందికి మాత్రమే టీకాలను వేయించుకున్నట్లు ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రఘునాథ్‌ స్వామి తెలిపారు. ఏఎ్‌సరావు నగర్‌ పరిధిలోని జమ్మిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం 24 మందికి టీకాలు వేశారు.


మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో..

మల్కాజిగిరి పీహెచ్‌సీ, అల్వాల్‌ పీహెచ్‌సీలలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఎమ్మె ల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. మల్కాజిగిరి ఆస్పత్రిలో మొత్తం 30 మందిలో 29 మందికి వ్యాక్సిన్‌  వేశారు. మరొకరు అందుబాటులో లేనికారణంగా వ్యాక్సిన్‌కు హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కె. మీనాఉపేందర్‌రెడ్డి, జగదీశ్‌గౌడ్‌, సునీతారాముయాదవ్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ డీసీ దశరథ్‌, ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్‌ రెడ్డి కుమారి, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఉపేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అల్వాల్‌లో 30 మందికి వ్యాక్సిన్‌ వేశారు. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆరుగురు హాజరు కాలేకపోవడంతో యాప్‌లో నమోదైన మరో ఆరుగురిని ఎంపిక చేసి వ్యాక్సిన్‌ వేశారు. వీరిలో 26మంది మహిళలు, నలుగురు పురుషులున్నారు.


మలక్‌పేట ఏరియా ఆస్పత్రి పరిధిలో..

మలక్‌పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 30 మందికి టీకాలు ఇచ్చారు. అందులో 22 మంది పురుషులు, ఎనిమిది మహిళలు ఉన్నారు. 


వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో...

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ను కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ హరీష్‌ ప్రారంభించారు. మొదటి విడతలో 30 మంది ఆస్పత్రి సిబ్బందికి టీకాలను అందజేశారు. ఎన్నికల సమయంలో వేసిన సిరాను టీకాను తీసుకున్న వ్యక్తుల ఎడమ చేతి బొటన వేలికి అంటించారు. ఈ కార్యక్రమంలో హయత్‌నగర్‌ తహసీల్దార్‌ శైలజ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ వినయ్‌, ఆర్‌ఎంవో సోమశేఖర్‌, బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ ముద్దగౌని లక్ష్మీప్రసన్నగౌడ్‌ పాల్గొన్నారు. 


అపోహలు వీడండి..

టీకాతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, అపోహలను వీడాలని మర్రిగూడ బస్తీ దవాఖాన వైద్యుడు డాక్టర్‌ అజయ్‌, రామంతాపూర్‌ వెంకట్‌రెడ్డినగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రం స్టాఫ్‌ నర్సు మాధవి, మాతృపురి కాలనీ పీహెచ్‌సీ డాక్టర్‌ వెంకటేష్‌ సూచించారు. మల్లాపూర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదటి టీకాను తనకే ఇచ్చారని,  టీకాను వేయించుకున్న తరువాత ఒంట్లో కాస్త నలతగా అనిపించిందని, అరగంటలోనే తగ్గిపోవడం తప్పితే ఎలాంటి ఇతర ఇబ్బందులు కలగలేదని వ్యాక్సిన్‌ను వేయించుకున్న కొందరు  వెల్లడించారు.


మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం  

రామంతాపూర్‌ పబ్లిక్‌ స్కూల్‌ వద్ద ప్రధాని మోదీ చిత్ర పటానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. దేశ ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్న మహనీయుడు మోదీ అని బీజేపీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కక్కిరేణి చేతన హరీష్‌, బండారు శ్రీవాణి వెంకట్‌రావు తదితరులు పాల్గొన్నారు.


    స్టాఫ్‌ నర్సుకు వాంతులు  

    వ్యాక్సినేషనల్‌లో భాగంగా జమ్మిగడ్డ ఆస్పత్రిలో కొవీషీల్డ్‌ టీకాను వేసుకున్న స్టాఫ్‌ నర్సు రీనారాణికి మూడుసార్లు వాంతి కావడంతో మల్కాజిగిరి ఆస్పత్రిలో చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యాధికారి స్వప్నారెడ్డి తెలిపారు. 


    గర్వంగా ఉంది 

    మన దేశంలో తయారుచేసిన వ్యాక్సిన్‌ తీసుకోవడం గర్వంగా ఉంది. అన్ని విధాల పరీక్షలు చేసి ప్రవేశపెట్టారు. దీనిపై అపోహలు వద్దు.. త్రిలోక్‌ శ్యామ్‌ , మెడికల్‌ సూపరింటెండెంట్‌


    స్ఫూర్తి దాయకంగా నిలుస్తా.. 

    అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండా లని వాక్సిన్‌ తీసుకున్నాను.  ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా, ఒత్తిడికిలోను కాకుండా వాక్సినేషన్‌ తీసుకోవాలి.  ఈ రోజు వాక్సిన్‌ తీసుకొన్నవారందరిలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు లేవు. - రెడ్డికుమారి, మల్కాజిగిరి పీహెచ్‌సీ  


    అందరికీ అనువుగా టీకా 

    కొవీషీల్డ్‌  టీకా వల్ల ఎలాంటి దుష్పరిమానాలు రావు.. వ్యాక్సిన్‌ తీసుకొన్న తర్వాత  కొద్దిగా గిడ్డినెస్‌ అనిపించినా అది కొద్దిసేపే.. ఆ తర్వాత ఇబ్బందేమీ లేదు. - వైద్యాధికారి శైలజ 


    మొదటి టీకాతో గర్వపడుతున్నా..

    కరోనా నివారణకు తయారు చేసిన వ్యాక్సిన్‌ను తొలి దఫాలో మొదటి టీకాగా తీసుకోవటం సంతోషంగాను, గర్వంగాను ఉంది. - మస్తాన్‌బీ, హెడ్‌నర్సు  వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి.

    Updated Date - 2021-01-17T11:59:29+05:30 IST