ఆమె పయనం... ఆకాశమంత!

ABN , First Publish Date - 2020-02-28T06:43:08+05:30 IST

‘‘నాసాలో ఉద్యోగం మాట దేవుడెరుగు, అసలు లెక్కలతో సంబంధం ఉన్న పని చెయ్యాలని నేను ఎప్పుడూ అనుకోలేదు’’ అంటారు సుసాన్‌ ఫిన్లే. అలాంటి ఆమె గత ఏడాదికి నాసా ఉద్యోగిగా...

ఆమె పయనం... ఆకాశమంత!


  • వయసు నలభై దాటగానే ‘ఉద్యోగం విసుగేసేస్తోంది!’ అనే వాళ్ళు...
  • యాభై రాగానే ఆఫీసులో వీలైనంత పని తగ్గించుకుంటే బాగుంటుందనుకొనే వాళ్ళు...
  • వాలంటరీ రిటైర్‌మెంట్‌కు సిద్ధమైపోయే వాళ్ళు ఎందరో...
  • వయసైపోయిందని పక్కన పెట్టేసేయజమానులూ ఎందరో...
  • అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు సుసాన్‌ ఫిన్లే గురించి తెలుసుకోవాలి...
  • ఆమె ఎనభై రెండేళ్ళ వయసులోనూ ఉత్సాహంగా పని చేస్తున్న హ్యూమన్‌ కంప్యూటర్‌...
  • అది కూడా అరవయ్యేళ్ళుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’లో కొలువు!
  • శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల సంఖ్య మరీ తక్కువగా కనిపిస్తున్న వేళ...  ఆమె సుదీర్ఘ  విజయగాథ స్ఫూర్తిదాయకం!


‘‘నాసాలో ఉద్యోగం మాట దేవుడెరుగు, అసలు లెక్కలతో సంబంధం ఉన్న పని చెయ్యాలని నేను ఎప్పుడూ అనుకోలేదు’’ అంటారు సుసాన్‌ ఫిన్లే. అలాంటి ఆమె గత ఏడాదికి నాసా ఉద్యోగిగా అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ సంస్థలో సుదీర్ఘకాలం పని చేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. మరి ఆమె ఏం కావాలనుకున్నారు?


టైపిస్ట్‌ ఉద్యోగానికి వెళ్ళి...

ఆర్కిటెక్ట్‌ కావాలన్నది సుసాన్‌ కోరిక. చిన్న వయసులో కాలిఫోర్నియాలోని స్కిప్స్‌ కాలేజీలో ఆర్ట్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరారు కూడా! అయితే త్వరలోనే ఆర్ట్స్‌ విభాగంలో రాణించే సామర్థ్యం తనకు లేదనిపించింది. నిజానికి గణితంలో ఆమె చిన్నప్పట్నుంచీ మేధావి. హైస్కూల్లో చదువుతున్నప్పుడు, మిగిలిన వాళ్ళ కన్నా వేగంగా రసాయన శాస్త్ర సమీరణాలు పూర్తిచేసి, బహుమతులు కూడా గెలుచుకున్నారు. కాబట్టి ‘ఇంజనీరింగ్‌ వైపు మళ్ళితే బాగుంటుందేమో!’ అని ఆమెకు అనిపించింది. ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక ఇంజనీరింగ్‌ కంపెనీలో టైపిస్ట్‌ ఉద్యోగానికి ఆమె దరఖాస్తు చేశారు. ఆ ఉద్యోగం ఆమెకు రాలేదు. అప్పట్లో క్లిష్టమైన లెక్కలను అలవోకగా చేసే వారిని ‘కంప్యూటర్లు’ అని పిలిచేవారు. వారిని ఉద్యోగాల్లోకి తీసుకొనేవారు. ఇలాంటి ‘కంప్యూటర్లు’ సాధారణంగా మహిళలే అయి ఉండేవారు. సుసాన్‌ దరఖాస్తు చేసిన కంపెనీ అటువంటి కంప్యూటర్లను నియమించుకొనేది. ఇంటర్వ్యూకు ఆమె వెళ్ళినప్పుడు, ‘లెక్కలు నీకు బాగా ఇష్టమా?’ అని అడిగారు. ‘అక్షరాల కన్నా అంకెలే ఎంతో ఇష్టం’ అని ఆమె బదులిచ్చారు. దీంతో ఆమెకు ‘కంప్యూటర్‌’గా ఉద్యోగం దొరికింది. ‘‘అన్ని లెక్కలనూ ఆలోచించి చేసేదాన్ని కాదు. ఒక పెద్ద ఫ్రిడెన్‌ కాలిక్యులేటింగ్‌ మెషిన్‌ మీద నేనూ, మరొక మహిళ పని చేసేవాళ్ళం. నలభై మంది ఇంజనీర్లకు వాళ్ళు అడిగిన గణాంకాలను అందజేసేవాళ్ళం’’ అని సుసాన్‌ ఆనాటి సంగతులు చెప్పారు.


అప్పటికి ‘నాసా’ లేదు!

అయితే ఆ ఉద్యోగంలో ఆమె ఎక్కువ కాలం చేయలేదు. వివాహం కావడంతో వేరే చోటుకు వెళ్ళాల్సి వచ్చింది. సుసాన్‌ భర్త పీటర్‌ ఫినాలే కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (కాల్టెక్‌)లో చదివారు. ఆ సంస్థే నాసా తరఫున ‘జెట్‌ ప్రొపల్షన్‌ లేబరేటరీ’ (జేపీఎల్‌)ని ప్రస్తుతం నిర్వహిస్తోంది. ‘‘మేము నివసిస్తున్న ప్రాంతానికి దగ్గర్లో ఒక ప్రయోగశాలను కొండల మధ్య కాల్టెక్‌ విద్యార్థులు, రాకెట్‌ సైన్స్‌ రంగానికి చెందిన ఔత్సాహికులు ఏర్పాటు చేశారు. నా భర్త సూచన మేరకు నేను ఉద్యోగం కోసం అప్లై చేశాను. నాకు ఉద్యోగం వచ్చింది. నేను చేరే సమయానికి అమెరికా సైన్యం దానికి నిధులు సమకూర్చేది. అప్పటికి ‘నాసా’ ఇంకా ఏర్పాటు కాలేదు’’ అన్నారు సుసాన్‌. అమెరికా తన మొదటి శాటిలైట్‌ ఎక్స్‌ప్లోరర్‌-1ను 1958లో ప్రయోగించింది. ఆ ప్రయోగానికి రెండు రోజుల ముందే జెట్‌ ప్రొపల్షన్‌ లేబరేటరీలో సుసాన్‌ ఉద్యోగిగా చేరారు. అరవై ఒక్క సంవత్సరాలుగా అక్కడే పని చేస్తున్నారు. ఇప్పటికీ, ఎనభై రెండేళ్ళ వయసులో కూడా అక్కడే విసుగూ, విరామం లేకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.



గృహిణిగా ఉండిపోవాలనుకోలేదు!

మూడేళ్ళు జేపీఎల్‌లో ఉద్యోగం చేసిన తరువాత, ఆమె భర్త మాస్టర్‌ డిగ్రీ కోసం సహకరించడానికి కొన్నాళ్ళు ఉద్యోగానికి సుసాన్‌ విరామం ఇచ్చారు. ఖాళీ సమయాల్లో ప్రోగ్రామింగ్‌ నేర్చుకున్నారు. తిరిగి జేపీఎల్‌లో చేరినప్పుడు ‘కంప్యూటర్‌’గా కాకుండా ప్రోగ్రామర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. మరో ఏడాదిన్నర గడిచింది. సుసాన్‌కు ఇద్దరు అబ్బాయిలు పుట్టడంతో వారిని పెంచడానికి మూడేళ్ళపాటు ఇంట్లోనే ఉండిపోయారు. అయితే గృహిణిగా ఉండిపోవడం తనకు సాధ్యం కాదని ఆమెకు అర్థమైపోయింది. ‘‘ఎంతో నిస్పృహగా ఉండేది. గృహిణిగా నేను పూర్తిగా విఫలమయ్యాను. నా మానసిక పరిస్థితిని భరించలేకసైకియాట్రిస్ట్‌ను కలిశాను. తిరిగి ఉద్యోగంలో చేరితే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. ‘జేపీఎల్‌’లో మళ్ళీ ప్రవేశించాను’’ అని ఆమె చెప్పారు. ఆ తరువాత ఆమె వెనుతిరిగి చూడలేదు. ‘‘1970ల్లో విడాకులు తీసుకున్నాను తరువాత పూర్తిగా ఉద్యోగానికే అంకితం అయ్యాను. మా ఇద్దరు పిల్లలూ కంప్యూటర్‌ సంబంధిత రంగాల్లో ఇప్పుడు పని చేస్తున్నారు’’ అంటారు సుసాన్‌. 


సంకోచం వద్దు!

ఈ సుదీర్ఘ కాలంలో ఆమె ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుల్లో పని చేశారు. కుజుడిపైకి ప్రయోగించిన మెరైనర్‌ శాటిలైట్లు మొదలుకొని, గురుగ్రహం చుట్టూ పరిభ్రమించే జునో వరకూ వీటిలో ఉన్నాయి. ‘‘ఉద్యోగినిగా నేను ఇక్కడ ప్రతిరోజూ ఎంతో సంతోషంగా గడుపుతున్నా. ఈ వాతావరణం, ఇక్కడ మనుషులు అంటే నాకు ఎంతో ఇష్టం. నేను చాలా అదృష్టవంతురాలిని. మహిళలకైనా, పురుషులకైనా నేను ఇచ్చే సలహా ఒక్కటే. మీకు సందేహాలుంటే తీర్చుకోవడానికి సంకోచించకండి. 

నాకు వచ్చిన సంశయాలను వెంటనే తీర్చుకోవడం ద్వారానే ఇన్నాళ్ళు పని చెయ్యగలిగాను. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు... ఎప్పుడు రిటైర్‌ అవుతారని. కానీ నాకు అలాంటి ఆలోచనలేవీ లేవు. నేను చేస్తున్న పనిని ఆస్వాదిస్తున్నాను. ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్‌ నన్ను ఆకర్షిస్తూనే ఉంది. భవిష్యత్తులో కూడా ఏదో ఒకటి నాకు అప్పగిస్తూనే ఉంటారు. నేను చేస్తూనే ఉంటాను. అయినా ఇంట్లో కూర్చుంటే చెయ్యడానికి నాకు పనేం ఉంటుంది?’’ అంటారు సుసాన్‌. 


సంగీతం అంటే ఇష్టం!

సుసాన్‌ రచయిత్రి కూడా! ‘నాసా’ చేపట్టిన వివిధ మిషన్ల గురించీ, అంతరిక్ష రంగంలో మార్పులు, అభివృద్ధి గురించి దాదాపు ఎనిమిది పుస్తకాలు రాశారు. ‘‘సంగీతం అంటే నాకెంతో ఇష్టం. సింఫనీలనూ, బ్యాలేలనూ థియేటర్లలో చూడడాన్ని బాగా ఆస్వాదిస్తాను. అలాగే ప్రయాణాలంటే సరదా. సెయింట్‌ లూయీస్‌, అండోవోర్‌లలో ఉంటున్న నా మనుమల్ని చూడడానికి తరచూ వెళ్తూ ఉంటాను’’ అని ఆమె చెప్పారు.

Updated Date - 2020-02-28T06:43:08+05:30 IST