నేను బోధించేది జీవతత్త్వం!

ABN , First Publish Date - 2020-10-16T05:03:59+05:30 IST

ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్‌ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. మన దేశ విశిష్టతను, సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని, యోగ, ధ్యానాల వల్ల కలిగే ప్రయోజనాలను అక్కడి ప్రజలకు వివరిస్తున్నారు...

నేను బోధించేది జీవతత్త్వం!

ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్‌ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. మన దేశ విశిష్టతను, సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని, యోగ, ధ్యానాల వల్ల కలిగే ప్రయోజనాలను అక్కడి ప్రజలకు వివరిస్తున్నారు. అంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి 11వ వార్షికోత్సవ సందర్భంగా ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలోని కొన్ని విశేషాలు ‘నివేదన’ పాఠకుల కోసం


‘‘ఆధ్యాత్మికత అనేది ఒక తాత్త్విక చింతన కాదు. సిద్ధాంతం కూడా కాదు. ‘మీరు ఏది నమ్ముతారు, ఏది నమ్మరు’ అనే విశ్వాసం కూడా కాదు. ఆధ్యాత్మికత జీవితాన్ని అన్వేషించే ప్రక్రియ. జీవితాన్నీ, జీవిత మూల సూత్రాలనూ అన్వేషించడమే ఆధ్యాత్మికత. 

ఎక్కడ అన్వేషిస్తున్నారన్నది ఇక్కడ ప్రధానం కాదు. ఎందుకంటే నిజం ఎక్కడైనా నిజమే! కాబట్టి ‘అమెరికా ఆధ్యాత్మికత’, ‘ఇండియా ఆధ్యాత్మకత’ అనేవి లేవు. దురదృష్టవశాత్తు చాలామంది చెబుతున్న ఆధ్యాత్మికత వాళ్ల సిద్ధాంతాలకూ, ఆలోచనలకూ సంబంధించినది.. వాస్తవానికి ‘ఆధ్యాత్మికత’ అంటే మీ దృష్టికోణాన్ని మెరుగుపరచుకోవడం. 

మీరు అనుభూతి చెందే విషయాలను పంచేద్రియాలు చెబుతాయి. ఆధ్యాత్మికత వీటన్నింటి కన్నా భిన్నమైనది. ఆధ్యాత్మికత ద్వారా  జీవితాన్ని రుచి చూస్తాం, తెలుసుకుంటాం.  ఇది ప్రదేశాన్ని బట్టి మారదు. సంస్కృతి, భాషలు, నేపథ్యాన్ని బట్టి మన వ్యక్తీకరణ భిన్నంగా ఉండొచ్చు. కొన్ని పద్ధతులు భిన్నంగా ఉండొచ్చు. కానీ ఆఽధ్యాత్మిక అనుభవాలు మాత్రం మారవు. భారతీయ ఆధ్యాత్మికతకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి  కొంత సౌకర్యంగానూ, కొంత సంక్లిష్టంగానూ ఉంటుంది. నేటివ్‌ అమెరికన్ల ఆధ్యాత్మికత చాలా సింపుల్‌గా ఉంటుంది. 


అదే నిజమైన తత్వం..

నేను కృష్ణతత్త్వం బోధించడం లేదు, శివతత్త్వం బోధించడం లేదు. నేను జీవతత్వాన్ని బోధిస్తున్నా. శివతత్త్వం, కృష్ణతత్త్వం- రెండూ జీవతత్త్వాలే. శివుడు, కృష్ణుడు జీవించినన్ని రోజులూ పూర్తిస్థాయి జీవితం గడిపారు. ఈశా ఫౌండేషన్‌లో శివరాత్రితో పాటు నవరాత్రిని కూడా బాగానే నిర్వహిస్తాం.. శివుడిని ఆదియోగిగా గుర్తిస్తాం. ఎందుకంటే ఆయనే మొదటి యోగి. అందుకే మేము ‘ఆది యోగి పండుగ’ ఘనంగా జరుపుకొంటాం. ఆయన సబ్‌ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ కోసం 112 శాస్త్రీయ సాధనాలను అందించాడు. కృష్ణుడు కూడా సాధనాలను అందించాడు. కానీ దురదృష్టవశాత్తు అవి మతాచారాల్లోకి వెళ్లాయి. శివుడిని కూడా మతాచారాల్లోకి తీసుకున్నారు . మేము ‘వైబర్‌ శివ’, ‘లీలా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాం. ఇవి రెండూ శివుడు, కృష్ణుడు యోగా గురించి ఏం చెప్పారో వివరిస్తాయి.


శివభక్తులు సాధనాపరులు, కృష్ణుణ్ణి నమ్మేవారు భక్తిపరులు. వాళ్లు ఉదయాన్నే లేచి ప్రార్థన లు చేస్తారు. పాటలు పాడతారు. సాధన చేయరు. అయుతే ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయాన్నే యోగాసనం లేదా వ్యాయామం సాధన చేయడం చాలా ముఖ్యం. కృష్ణుడు ప్రవచించిన భక్తిని ప్రజలు మరోలా అర్థం చేసుకున్నారు. ‘భక్తి’ అంటే పూర్తిగా భగవంతుడి ధ్యానంలో లీనమవడం. అంతేగానీ దేవుడితో కుదుర్చుకున్న ఒప్పందం కాదు. ఇప్పుడు భక్తి అనేది డీల్‌గా మారింది. ‘నేను పది రూపాయలు ఖర్చు పెడితే నాకు ఎంత వస్తుంది’ అని ఆలోచిస్తున్నారు. సాధారణ ప్రజలు భక్తిని ఏదో ఒకటి పొందేందుకూ, బతికేందుకూ అనువుగా వాడుకుంటున్నారు.’’

Updated Date - 2020-10-16T05:03:59+05:30 IST