Abn logo
Feb 10 2020 @ 05:24AM

‘‘ప్రకృతి పట్ల బాధ్యతను గురించి ఆలోచనలను పంచుకున్నాను’’

ఇటీవల విడుదలైన మీ ‘సీమేన్‌’ కథా సంపుటికి ఆ ఇంగ్లీష్‌ పేరున్న ఆ కథ పేరే ఎందుకు ఎంచుకున్నారు? ఆ కథను ఈ సంపుటికి ప్రాతినిధ్య కథగా అనుకోవచ్చా? 

సముద్ర తీర ప్రాంతాల్లో షిప్‌లలో పని చేసి వచ్చిన వాళ్ళని సీమేను అని పిలుస్తారు. అది ఇంగ్లీషే అయినా అలాంటి పేర్లు మన గ్రామాల్లో వుంటాయి. పోలీసు, మాస్టారు లాంటివి. శ్రీకాకుళంలో సముద్ర తీర ప్రాంతంలో ఒక సీమేను నాకు స్నేహితుడు. అతడు నిజంగా కథలో పాత్రలా అనిపించేవాడు. నెల్లూరు నుండి ఇచ్చాపురం వరకూ కోస్టల్‌ కారిడార్‌ అన్నపుడు ఈ తీరం పొడవునా జరుగుతున్న విధ్వంసం జనానికి నిద్ర లేకుండా చేసింది. బీల భూముల్లో థర్మల్‌ ప్లాంట్‌కి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేసారు. కాల్పులు కూడా జరిగాయి. గంగవరంలో కాల్పులు జరిగాయి. కాకినాడ సెజ్‌కి వ్యతిరే కంగా సంవత్సరాల తరబడి ప్రజలు పోరాడుతున్నారు. మన తీరప్రాంతంలో జరుగుతున్న విధ్వంసంలో పర్యావరణ విధ్వంసం ముఖ్యమైంది. సముద్రం, దాని చుట్టూ వున్న పర్యావరణం దెబ్బ తిని పోవడం ప్రత్యక్షంగా తెలుస్తోంది. సముద్రపు తాబేళ్లు చచ్చిపోతున్నాయి. 1575 చదరపు కిలోమీటర్ల తీర భూభాగంలో పొలాలు, ఊర్లు ఖాళీ అయిపోయే ప్రమాదం ముంచుకు వస్తోంది. దీన్ని జనం ప్రతి ఘటిస్తున్నారు. అలా ఆ కథ తయారైంది. కథలో ఈ విష యాలు రాయాలని ప్రయత్నించాను. అప్పుడు సీమేను కథలోకి హీరోగా వచ్చాడు. అతడు సముద్రపు మనిషి! సంపుటిలో కథలలో ఎక్కువ కథలు ఈ అంశంపైవే. సీమేనులో ప్రతిఘటన కూడా వుంది. కాబట్టి ప్రాతినిధ్య కథేనేమో. అయితే నేను పేరు పెట్టడానికి కారణం సీమేను మీద ప్రేమ. అలాంటి జనం మీద ప్రేమ.

ఈ సంపుటిలో కథలు విధ్వంసకర అభివృద్ధిపై నిరసన అనిపిస్తాయి. మీ అభిప్రాయం ఏమిటి?

పర్యావరణం, అభివృద్ధి విధ్వంసం... ఈ మాటలన్నీ మానవులతో సంబంధం వున్నవి. మనిషికి వెలుపల వున్నవి కాదు. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలోనే పర్యావరణ శత్రుత్వం వుంది. కానీ మానవులు నిర్మించుకుంటూ వచ్చిన సంస్కృతిలో పర్యావరణం పట్ల బాధ్యత ఉంది. మన లాంటి దేశాల్లో అభివృద్ధి పేరుతో ఈ బాధ్యతను తీసిపారేయడమే అసలైన విధ్వంసం. పర్యావరణంపట్ల బాధ్యతతో అభివృద్ధిని సాధించుకోవడం అనేది కావాలి. అభివృద్ధికీ, పర్యావరణానికీ అంత శత్రుత్వం ఏమీ లేదు. ఈ కథల్లో తానొక భాగమైన ప్రకృతి పట్ల బాధ్యతను గురించి నేను ఆలోచనలను పంచుకున్నాను.

ఈ సంపుటిలో బాగా పేరు తెచ్చుకున్న ‘అతడు మనిషి’ కథ వెనుక స్పూర్తి ఏమిటి?  

ఈ కథకి మొదటి స్ఫూర్తి చలం జీవితాదర్శం. ఆ నవల చివరిలో దేశికాచారి ఊ అన్నాడు కానీ అందులో చాలా కంపనం వినిపిస్తుంది లాలసకి. ఈ కంపనం నాలో ధ్వనిస్తూనే ఉంది. ఆ నవల అంతా ఒక ఎత్తు. ఆ ఒక్క ముగింపు ఒక ఎత్తు. గోర్కీ ఒక జననం కూడా. అలా రాయాలని అనుకునేవాణ్ణి. బోడసకుర్రు రేవులో గోదావరి వొడ్డున ఒక తుఫాను సాయంత్రం ఆ కథలో లానే ఉండిపోవలసి వచ్చింది. ఇప్పుడంటే ఆ గోదావరి పాయ మీద వంతెన వచ్చింది కానీ అప్పుడు రేవు దాటడానికి లాంచీలే ఉండేవి. లేదా చిన్న పడవలు. ఆనాటి తుఫానులో గోదావరిని చూస్తుంటే ఇస్మాయిల్‌ కవిత గుర్తొచ్చింది. పైనా కిందా అంటూ ఏమీ లేదు. అంతా వైనతేయ గోదావరే.... నేలనీ నీటిని కూడా కమ్మేసిన మబ్బు... వెనక కనీ కనిపించని కొబ్బరి చెట్లు.... అప్పుడు ఆ అనుభూతి గురించి కథో కవితో రాయాలని అనుకునే వాణ్ణి. అప్పుడు రాయలేక పోయాను. చాలా కాలం తరువాత ప్రపంచీకరణ, మత్స్యకారుల పిల్లలని చదువు పేరుతో సముద్రాన్నించి దూరంచేయడం మొదలైంది. తీరప్రాంతంలో పిల్లల చదువు మీద ఒక సర్వేలో పాల్గొన్నాను. చదువు గురించి చాలా ఆలోచనలు రేకెత్తాయి. మాటలు కూడా సరిగా రాని పిల్లల చేత దేశాల పేర్లు చెప్పించడంలాంటివి గమనించిన తరువాత కథ అల్లడం మొదలైంది. మెయిన్‌ ప్లాట్‌ అయితే రాజు గారు ముసలామె దగ్గర గడ్డి పచ్చడి తిన్న కథే. కాకపోతే ఇది ముసలామె కథ.

అద్దేపల్లి ప్రభు

98489 30203

Advertisement
Advertisement
Advertisement