మంత్రులు, ఎమ్మెల్యేలం ప్రగతి భవన్‌కు వెళ్తే.. గేటు వద్దే నిలిపేశారు

ABN , First Publish Date - 2021-05-05T08:07:39+05:30 IST

తనకు జరిగిన అవమానం భరించలేకనే కోర్టుకు వెళ్లానని, ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్న వారంతా ఒకప్పటి తన సహచరులేనని, గతంలో వారు తనతో ఏమి మాట్లాడారో..

మంత్రులు, ఎమ్మెల్యేలం ప్రగతి భవన్‌కు వెళ్తే.. గేటు వద్దే నిలిపేశారు

  • సీఎంను కలవకుండానే లోపలికి వెళ్లొస్తామన్నా పంపలేదు..
  • ఇలాగైతే కరీంనగర్‌ నుంచే మళ్లీ విప్లవం వస్తదని గంగుల అన్నడు
  • ఇప్పుడు మాట మార్చిండు.. మాపై దాడి చేసిందెవరో ప్రజలకు తెలుసు
  • పిలిచి అడిగితే సంతోషంగా రాజీనామా చేసేవాడిని: ఈటల 


హుజూరాబాద్‌, మే 4: తనకు జరిగిన అవమానం భరించలేకనే కోర్టుకు వెళ్లానని, ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్న వారంతా ఒకప్పటి తన సహచరులేనని, గతంలో వారు తనతో ఏమి మాట్లాడారో.. ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారో తనకు తెలుసుని తాజా మాజీ మంత్రి,  ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ‘‘కొందరు నాయకులు ఇప్పుడు నన్ను వివమర్శిస్తున్నారు. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్లు నేను టీఆర్‌ఎస్‌లోకి వచ్చానంటున్నారు. మేక వన్నె పులులంటున్నారు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎవరు మా మీద దాడి చేశారో ప్రజలకు తెలుసు. ఇది ప్రజాక్షేత్రంలో ఉంది. గొప్ప స్థానంలో ఉన్నంత మాత్రాన చేసిన చెడ్డ పనులను కప్పి పుచ్చుకోవాలనుకోవడం సాధ్యం కాదు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో కరీంనగర్‌ జిల్లాకు ఓ సమస్య వచ్చింది. అప్పుడు ఇక్కడి నుంచి నేను, కేటీఆర్‌ మాత్రమే మంత్రులుగా ఉన్నాం. కేటీఆర్‌ నన్ను జిల్లా వ్యవహారాలు చూసుకోమన్నారు. నేను, తొమ్మిది మంది ఎమ్మెల్యేలం కలిసి ఒకసారి ప్రగతి భవన్‌కు వెళ్లాం. మమ్మల్ని గేటు వద్దే నిలిపివేశారు. 


ఎందుకు ఆపారని అడిగితే.. ఎవర్నీ అనుమతించడం లేదని అక్కడి సిబ్బంది తెలిపారు. ఒక్కసారి లోపలికి వెళ్లి ముఖ్యమంత్రిని కలవకుండానే బయటకు వస్తామని అభ్యర్థించాం. అయినా అనుమతించలేదు. దీంతో అవమానంతో తిరిగి వస్తుండగా మా సహచరుడు గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ఇంత అహంకారం ఉంటదా అన్నా.. పరిస్థితి ఇలాగే ఉంటే కరీంనగర్‌ నుంచే మళ్లీ విప్లవం వస్తది అని అన్నాడు. ఇప్పుడు ఎన్నో మాటలు మాట్లాడుతుండు. కేసీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు వేలాది మంది గులాబీ జెండాను గొప్పగా నిలిపారు. నేను పార్టీలోకి వచ్చే నాటికే కొంతమంది జడ్పీటీసీలుగా గెలిచారు. నేను 2002లో గజ్వేల్‌ నుంచి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నా. అప్పటి మెదక్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాధాకృష్ణ దేశ్‌పాండే సూచన మేరకు నేను టీఆర్‌ఎ్‌సలో చేరాను. నా పనితీరు చూసిన తర్వాత కేసీఆర్‌ నన్ను మా స్వగ్రామం కమలాపూర్‌ వెళ్లి పార్టీని బలోపేతం చేయమన్నారు. 2003లో పల్లెబాట ముగింపు సభను చాలా గొప్పగా నిర్వహించాం. నా పనితనాన్ని గుర్తించిన కేసీఆర్‌.. 25 మంది పోటీలో ఉన్నా కమలాపూర్‌ నుంచి నాకు పార్టీ టికెట్‌ ఇచ్చారు. అందరి ఆశీస్సులతో గెలిచాను. కరీంనగర్‌లో ఉద్యమం నడిచిందంటే అప్పటి కమలాపూర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాలే కారణం. నేను ఆ సమయంలో కరీంనగర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశాను’’ అని ఈటల చెప్పారు. 


మేం కొట్లాడిందే ఆత్మగౌరవం కోసం

మాలాంటి వాళ్లం ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నామంటే.. మేం కొట్లాడిందే ఆత్మగౌరవం కోసం. 2014 వరకు మా ముఖ్యమంత్రి పోరాటాలు, ఉద్యమాలను నమ్ముకున్నాడు. తర్వాత ఆయన మారాడు కాబట్టే మేం ఇలా మాట్లాడుతున్నాం. తెలంగాణ గాంధీగా ఉన్నత స్థాయికి ఎదిగిన కేసీఆర్‌ మంత్రులకు కనీస గౌరవం ఇవ్వడం మరిచారు. నేనొక్కడినే కాదు.. మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి లాంటి వాళ్లకు కూడా అపాయింట్‌మెంట్‌ దొరకక సీఎంను కలవలేకపోయేవారు. కొద్ది రోజులయితే ఎమ్మెల్యేలకు అనుమతే లభించడం లేదనే వార్తలు వినిపించాయి. కేసీఆర్‌ తర్వాత ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవుతాడంటే స్వాగతించానే తప్ప ఎన్నడూ ఎదురు చెప్పలేదు’’ అని ఈటల అన్నారు.


నామీద బురదజల్లితే వారికే నష్టం

2014 కంటే ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం వద్దకు వెళ్లి మేం అభివృద్ధి పనులు చేయించుకోలేదా.. ఇప్పుడాపరిస్థితులు లేవు. వేరే పార్టీ వారితో మాట్లాడితే వాళ్లతో ఫిక్స్‌ అయ్యారు అని ప్రచారం చేస్తున్నారు. నాకు అన్ని పార్టీల వారితో సంబంధాలు ఉన్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్మేలు కాంగ్రె్‌సలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సందర్భంలో నేను ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లాను. అప్పుడు విలేకరులు.. ముఖ్యమంత్రిని కలుస్తున్నారు.. ఫిక్సయ్యారా అని ప్రశ్నించారు.  అప్పుడు.. ‘నేను ఈటల రాజేందర్‌ను.. నన్నే అనుమానిస్తున్నారా’.. అని అన్నాను. ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య సత్సంబంధాలు అవసరం. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏడు సంవత్సరాలుగా చూస్తున్నా.. ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కలిసే అవకాశం లేదు. నామీద బురదజల్లితే వారికే నష్టం తప్పితే నాకు కాదు.


ఇంత కక్ష సాధింపు అవసరమా?

యుద్ధంలో ఎంతగొప్ప కమాండర్‌ ఉన్నా పోరాడేది మాత్రం సైనికులే. అందరి సమన్వయంతోనే విజయాలు సాధించవచ్చు. నన్ను పిలిచి అడిగితే సంతోషంగా రాజీనామా చేసేవాడిని. కానీ నాపై భూకుంభకోణాల ఆరోపణలు చేసి, వందల మంది పోలీసులు, రెవెన్యూ అధికారులను పురమాయించి ఇంత కక్ష సాధింపులకు దిగడం అవసరమా? నా బ్యాంకు ఖాతాలు చూస్తున్నారు. తప్పంటూ జరిగితే ఏ శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరి వ్యాఖ్యలకు స్పందించను. అది నా నైజం కాదు. నా సహచరులతో ఉన్న బంధంతో వారు నాతో ఎన్నో మాట్లాడారు. అవన్నీ చెప్పలేను. నా నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు హుజూరాబాద్‌కు వచ్చాను. భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను కాబట్టి అందరితో మాట్లాడుతాను.

Updated Date - 2021-05-05T08:07:39+05:30 IST