Abn logo
Apr 11 2020 @ 00:46AM

ట్రంప్ మళ్ళీ గెలిస్తే...

అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నిక సాధారణంగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక, ప్రభావ శీల ప్రజాస్వామిక అభ్యాసం. అమెరికన్ పౌరులు మాత్రమే ఓటు వేస్తున్నప్పటికీ , ఆ ఎన్నిక ఫలితాలు అమెరికా పౌరులు కాని అసంఖ్యాక మానవుల భవిష్యత్తును నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తాయి. ఈ దృష్ట్యా , 2020 అమెరికా అధ్యక్ష ఎన్నిక ఇంతకు పూర్వపు అధ్యక్ష ఎన్నికల కంటే చాలా ముఖ్యమైనది. 


బ్రిటిష్‌వారు సుదీర్ఘకాలం నుంచి ఎన్నికలు నిర్వహిస్తున్నారు; భారతీయులు అత్యధిక సంఖ్యలో ఓటు వేస్తా రు. అయితే అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నికలలో ప్రజాస్వామికంగా ఓటుహక్కును వినియోగించుకునే ప్రక్రియ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, ప్రభావశీలంగా చోటుచోటుచేసుకోవడం కద్దు. బహుశా, ఇది ఒక శతాబ్దానికి పైగా జరుగుతున్నది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న, శక్తిమంతమైన దేశమయినందున అమెరికాకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది మానవాళిని విశేషంగా ప్రభావితంచేసే అంశంగా వున్నది. బోరిస్ జాన్సన్ (బ్రిటిష్ ప్రధాని) విధానాల ప్రభావం ఐరోపా వెలుపల ఏమీ వుండదు. దక్షిణాసియా వెలుపల నరేంద్రమోదీ విధానాలకు ఎలాంటి ప్రాధాన్యముండదు. అయితే అమెరికా అధ్యక్షుడు ఏమి చేస్తున్నారు, ఏమి చేయడం లేదనేది సమస్త విశ్వాన్ని ప్రభావితం చేస్తుంది. 2000 సంవత్సరం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జార్జి బుష్ బదులు అల్ గోర్ ఎన్నికయి వుంటే ఇరాక్ యుద్ధం ఖచ్చితంగా జరిగివుండేది కాదు. ప్రపంచం ఇప్పుడు మరింత భద్రంగా వుండేది. 


2020 అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నికలు మామూలుగానే ప్రపంచానికి ఎంతో కీలకమైనవి. అందునా కొవిడ్ -19 విజృంభణతో అవి మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడు అవడం అమెరికాకు శ్రేయస్కరమేనా అనే విషయాన్ని అమెరికా ప్రజలే నిర్ధారించవలసివున్నది. అయితే ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడవడమనేది ప్రపంచానికి హానికరమనడంలో సందేహం లేదు. పారిస్ ఒడంబడిక నుంచి అమెరికా వైదొలగాలన్న ఆయన నిర్ణయంతో వాతావరణ మార్పుల ముప్పు మరింత తీవ్రమయింది. ఇరాన్‌పై మళ్ళీ ఆంక్షలు విధించడం వల్ల పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత అస్థిరమయ్యాయి. ట్రంప్ విధానాల వల్లే శరణార్థుల సంక్షోభం మరింతగా విషమించింది. ఆసియా, ఆఫ్రికా ప్రజల విషయంలో ఆయన ఉపయోగించే మొరటు, జాత్యహంకార భాష అమెరికాకు గానీ, ప్రపంచానికి గానీ ఏమాత్రం మేలు చేసేది కాదు. 


2017 జనవరిలో కంటే ప్రపంచం ఇప్పుడు తక్కువ సురక్షితంగాను, మరింత అసంతృప్తితోను వున్నది. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలు చాలా వున్నాయనడంలో సం దేహం లేదు. అయితే ట్రంప్ పాలనా శైలి, ఆయన విధానాలు వాటిలో చాలా ప్రధానమైనవని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ కారణంగానే అమెరికా పౌరులు కాని అసంఖ్యాక ప్రజలు అమెరికా అధ్యక్ష ఎన్నికల పూర్వరంగాన్ని ఆసక్తితోను, ఆం దోళనతోను గమనిస్తున్నారు. ప్రపంచం మరింత సురక్షితంగాను, మరింత సంతృప్తితోను ఉండే అవకాశాలు ట్రంప్ ఓటమిలో కంటే గెలుపులో చాలా తక్కువగా వుంటాయి. 

గత ఫిబ్రవరిలో నేను అమెరికాలో వున్నాను. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న వారి మధ్య చర్చలను నిశితంగా గమనించాను. ఆ దశలో వెర్మాంట్ సెనేటర్ బెర్నీ శాండర్స్ ఆ పోటీలో అగ్రగామిగా వున్నారు. ట్రంప్ విధానాలను వ్యతిరేకించే, ఆయన వ్యవహారశైలిని అసహ్యించుకునే నా అమెరికన్ స్నేహితులలో కొంతమంది, శాండర్స్ మాత్రమే ప్రస్తుత అధ్యక్షుడిని ఓడించేలా డెమొక్రాటిక్ ఓటర్లను పురిగొల్పగల సమర్థుడని భావిస్తున్నారు. శ్వేతజాతి కార్మికులలోను, యువ అమెరికన్లలోను శాండర్స్‌కు గట్టి మద్దతు వున్నందునే ఆయనపై వారు ఆశలు పెట్టుకున్నారు. అయితే శాండర్స్ సంపూర్ణ వామపక్షవాది గనుక ట్రంప్‌ను ఓడించలేడని మరికొంత మంది వాదించారు. మార్చి తొలినాళ్ళలో న్యూయార్క్ నుంచి నేను నిష్క్రమించే నాటికి శాండర్స్ కంటే జో బిడెన్ ముదంజలో వున్నారు. చివరకు, నా అమెరికన్ స్నేహితులు కొంత మంది భయపడినట్టు పోటీ నుంచి శాండర్స్ విరమించుకున్నారు. శ్వేతజాతి ఓటర్లలో ఒక వర్గం వారు జో బిడెన్‌కు మద్దతునివ్వగలరని, పైగా బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడుగా ఉన్నందున ఆఫ్రికన్- అమెరికన్లు గణనీయంగా ఆయనకే ఓటు వేసే అవకాశముందని నా అమెరికన్ స్నేహితులు పలువురు విశ్వసిస్తున్నారు. అయితే బిడెన్ వృద్ధుడు కావడంతో పాటు, ఆయన కుమారుడి వివాదాస్పద వ్యాపార లావాదేవీల మూలంగా ట్రంప్‌ను ఆయన ఓడించలేడని కూడా కొంతమంది భావిస్తున్నారు.


అమెరికాలో కొవిడ్ -19 ప్రబలడంపై ఇప్పటికీ పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ విషయమై ట్రంప్ తొలుత చాలా తీవ్రంగా ప్రతిస్పందించారు. దాని వల్ల అమెరికా ప్రజలకు ముప్పు ముంచుకురాబోతుందన్న హెచ్చరికలను తిరస్కరించారు. ఆ వైరస్‌ను అరికట్టడానికి తన ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని (ఇందులో నిజం లేదు) ట్రంప్ చెప్పారు. కరోనా కేసుల సంఖ్య ఆకస్మికంగా పెరగడంతో ట్రంప్ ఎట్టకేలకు రంగంలోకి దిగాడు. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు, ఆర్జిత అత్యవసర సెలవులు ఇచ్చేందుకు అవసరమైన ఆర్థికసహాయాన్ని సమకూర్చేందుకు ఉద్దేశించిన ఒక శాసనానికి కాంగ్రెస్ ఆమోదాన్ని పొందారు. కరోనా కట్టడికై సంబంధిత అధికారులు, నిపుణులతో నిత్యం సంప్రదింపులు జరపడం ప్రారంభించారు. ఇదే సమయంలో కరోనాను ‘చైనీస్ వైరస్’ అని జాత్యహంకార ధోరణితో ట్రంప్ ప్రస్తావించసాగారు. అయితే తన సలహాదారుల సూచనపై చైనాపై విమర్శలను విరమించాడు. కరోనా వ్యాప్తి విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ తక్కువ అంచనా వేసిందని, తత్ఫలితంగానే తాము సకాలంలో కట్టడి చర్యలు చేపట్టలేకపోయామని ట్రంప్ చెప్పాడు. నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తదితర ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థల పట్ల ట్రంప్ మొదటి నుంచీ తిరస్కార పూరిత వైఖరితో వ్యవహరిస్తూ వస్తున్నాడు. గతంలో ఆ సంస్థ సలహాలను చులకన చేశాడు. చివరకు అమెరికా తరఫున ఇవ్వాల్సిన నిధులను సైతం నిలిపివేశాడు. మరోముఖ్యమైన విషయమేమిటంటే గత జనవరి చివరి రోజులలోనే ట్రంప్ సొంత వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కరోనా వైరస్ అమెరికా ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేయనున్నదని హెచ్చరించాడు. సరైన వ్యాక్సీన్ లేకపోవడం వల్ల లక్షలాది అమెరికన్ల ప్రాణాలను హరించివేయగలదని స్పష్టం చేశాడు.


ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యేందుకు కొవిడ్ -19 ఆటంకమవుతుందా లేక దోహదం చేస్తుందా అనే విషయమై ప్రస్తుత దశలో ఎవరూ ఏమీ చెప్పలేరు. ఆయన అస్థిర వ్యక్తిత్వం అమెరికా అధ్యక్ష పదవికి ఏ మాత్రం వన్నె తెచ్చేది కాదు. ఈ సంక్షోభ పర్యవసానాల కారణంగా ఓటర్లు జో బిడెన్ వైపు మొగ్గు చూపే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ను అమెరికా తీరానికి ‘శత్రువు’ తీసుకొచ్చాడని ఆక్రోశిస్తూ ఓటర్లను ట్రంప్ తన వైపుకు తిప్పుకునే అవకాశమూ వున్నది. జెనోఫోబిక్ (విదేశీయుల మీద వైముఖ్యత) భయాలను రెచ్చగొట్టడంద్వారా 2016 ఎన్నికలలో ట్రంప్ విజయం సాధించగలిగారు. మన ప్రధానమంత్రి యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా 2019 ఎన్నికలలో విజయం సాధించిన రీతిలో 2020 ఎన్నికలలో విజయానికి ట్రంప్ ప్రయత్నించవచ్చునని పలువురు భావిస్తున్నారు. జాతీయ సంక్షోభాల సమయంలో దేశ పౌరులు అధికారంలో ఎవరు వున్నప్పటికీ వారినే తప్పక సమర్థిస్తారనే అభిప్రాయం ఒకటి వున్నది. ఈ కారణంగా బ్రిటన్‌లో బోరిస్ జాన్సన్‌కు, భారత్‌లో నరేంద్ర మోదీకి, అమెరికాలో డోనాల్డ్ ట్రంప్‌కు అధికార గండం వుండదని భావిస్తున్నారు.

2016లో అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నిక, ప్రపంచానికి దుర్వార్త అయితే 2020లో ఆయన మళ్ళీ విజయం సాధించడం మానవాళికి మరింత ఘోరమైన దుర్వార్తే కాగలదు. వాతావరణ మార్పుల వల్ల మానవాళికి ఎదురవుతున్న సవాళ్లు మరింతగా విషమిస్తాయి. పశ్చిమాసియాలో అంతర్యుద్ధాలు మరింత తీవ్రమవుతాయి. అమెరికా, చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించే అవకాశమున్నది. అమెరికా, ఐరోపాల మధ్య సంబంధాలు కూడా తీవ్ర చిక్కుల్లో పడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలైన ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు మరింతగా బలహీనపడతాయి.


కొవిడ్- 19 ప్రబలిపోతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థే విజయం సాధించాలన్న ఆకాంక్ష అమెరికాయేతర ప్రపంచ ప్రజలలో మరింతగా బలీయమవుతోంది. కరోనా వైరస్ మూలంగా మానవాళి ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా చెల్లించుకుంటున్న మూల్యాలు అపరిమితమైనవి. ఇరవయో శతాబ్దిలో రెండు ప్రపంచ యుద్ధాలతో వాటిల్లిన అపారనష్టాలతో వాటిని పోల్చవచ్చు. కొవిడ్ -19 ముప్పు నుంచి మానవాళి సంపూర్ణంగా బయటపడినప్పుడు ప్రపంచాన్ని యథాపూర్వస్థితికి తీసుకురావడానికి అసాధారణ శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, సహానుభూతి ఎంతైనా అవసరమవుతాయి. ప్రపంచ అగ్రరాజ్యాలు మున్నెన్నడూలేని విధంగా మరింత సమన్వయ సహకారాలతో కృషి చేయవలసివుంటుంది. ఈ ధరిత్రిపై అత్యంత శక్తిమంతమైన దేశమైన అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఎన్నికయితే ఆయన మొండివైఖరి, వివేకరహిత విధానాలు దేశాల మధ్య నిర్మాణాత్మక సహకారానికి దోహదం చేయవు. కరోనా విధ్వంసం నుంచి కోలుకోవడానికి ప్రపంచానికి ఏవైతే - దేశాలు, జాతులు, సమాజాల మధ్య సహాయ సహకారాలు-అత్యవసరమో అవే కొరవడతాయి. 

అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నిక సాధారణంగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక, ప్రభావ శీల ప్రజాస్వామిక అభ్యాసం. అమెరికన్ పౌరులు మాత్రమే ఓటు వేస్తున్నప్పటికీ, ఆ ఎన్నిక ఫలితాలు అమెరికా పౌరులు కాని అసంఖ్యాక మానవుల భవిష్యత్తును నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తాయి. ఈ దృష్ట్యా, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నిక ఇంతకు పూర్వపు అధ్యక్ష ఎన్నికల కంటే కూడా చాలా ముఖ్యమైనది.
రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...

Advertisement