నీకు దమ్ముంటే రా.. ప్రజాస్వామ్యంలో తేల్చుకుందాం

ABN , First Publish Date - 2021-06-21T09:26:02+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో జన చైతన్యాన్ని ఆపడం నీ జేజెమ్మతో కూడా కాదని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

నీకు దమ్ముంటే రా.. ప్రజాస్వామ్యంలో తేల్చుకుందాం

  • నా ఆత్మగౌరవమంటే.. నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవం
  • సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు

హుజూరాబాద్‌, జూన్‌ 20: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో జన చైతన్యాన్ని ఆపడం నీ జేజెమ్మతో కూడా కాదని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో ఓ చదువుకున్న యువకుడు ఉన్నాడని, రాబోయే కాలంలో వాళ్లే కథానాయకులు అవుతారని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ 90 సీట్లు గెలిచినా మూడు నెలలుగా కేబినెట్‌ లేకుండా సీఎం కేసీఆర్‌ పాలించారని, ఇది చీకటి పాలన అని ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి వచ్చే మంత్రుల చరిత్ర ఏటో తనకు తెలుసన్నారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘నీకు దమ్ము ఉంటే రా.. ప్రజాస్వామ్యంలో తేల్చుకుందాం. నా ఆత్మగౌరవమంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. 


తెలంగాణ ఆత్మగౌరవం కాపాడే బాధ్యత హుజూరాబాద్‌ ప్రజలపై ఉంది. రాబోయే రోజుల్లో నీ నీచపు చరిత్రకు చరమగీతం పాడేది కూడా హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలే. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మానుకోట ఉద్యమకారులపై దాడులు చేసిన వారిని మీ పంచన పెట్టుకొని నాపై విమర్శలు చేస్తున్నారు. 2023 తరువాత నీ ప్రభుత్వం రాదు. మాయి గొప్ప ప్రణాళికలు ఉంటాయి’’ అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ధ్వజమెత్తారు. మొదట్లో ఈటల రాజేందర్‌కు మంత్రి పదవి రాదని, సొంత పత్రికలో కేసీఆర్‌ రాయించారని ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖ ఇస్తే రోజు నెగిటివ్‌ వార్తలు వస్తాయని, కానీ తనకు కాలం కలిసి వచ్చిందని, పనిచేసే వారికి ఎక్కడైనా గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. తమకు దొరకని ముఖ్యమంత్రి ఒక సామాన్య మనిషికి దొరుకుతాడని ఎద్దేవా చేశారు. మామూలు మనిషి వచ్చి దరఖాస్తు ఇవ్వగానే టీవీలలో ప్రచారం చేయించి తనపై కుట్ర చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఓట్లు గల్లంతు చేయడానికి తహసీల్దార్లను బదిలీలు చేశారని చెప్పారు.


నేడు సన్నాహక సమావేశం

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సన్నాహక సమావేశాన్ని బీజేపీ సోమవారం నిర్వహించనుంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈటల రాజేందర్‌తో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొననున్నారు. కాగా, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన రోజే సీఎం కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటనలు, ప్రారంభోత్సవాలు మొదలు పెట్టారని, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేసేందుకు సిద్ధపడ్డారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. 



Updated Date - 2021-06-21T09:26:02+05:30 IST