Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబుతో 45 నిమిషాలపాటు బుచ్చయ్య ఏకాంత చర్చ.. ఒక్కసారిగా మారిన సీన్..!?

  • రాజీనామాను వెనక్కు తీసుకొంటున్నా
  • నేను బ్లాక్‌ మెయిలర్‌ని కాదు
  • పార్టీలోని ఇబ్బందులను మనసువిప్పి చెప్పా
  • రాష్ట్రాన్ని గాడిలో పెట్టే శక్తి బాబుకే ఉంది: గోరంట్ల


అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న నా ఆలోచనను వెనక్కు తీసుకొంటున్నాను. నేను బ్లాక్‌మెయిల్‌ చేసేవాడిని కాను. అందరం సమిష్టిగా పనిచేసి పార్టీని గెలిపించాలి. ఈ రెండేళ్లలో రాష్ట్రం బాగా నష్టపోయింది. అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. రాష్ట్రం పారిశ్రామికంగా దివాళా తీసింది. చంద్రబాబు మళ్లీ రావాలని ప్రజలు కోరుకొంటున్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే శక్తి ఒక్క ఆయనకే ఉంది. ఆయన నాయకత్వంలో పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి నా శక్తివంచన లేకుండా పనిచేస్తాను’’ అని టీడీపీ సీనియర్‌ నేత, టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పా రు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై అలకబూనిన ఆయన గురువారం ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. పార్టీ నేతలు చినరాజప్ప, రామకృష్ణారెడ్డి, గద్దె రామ్మోహన్‌తో కలిసి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన గోరంట్ల సుమారు 45 నిమిషాలపాటు చంద్రబాబుతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మా ట్లాడారు.

దాచుకోకుండా..!

‘‘పార్టీ కార్యకర్తల మనోభావాలు, వారి సమస్యలు, అంతర్గత సమస్యలు తదితర కారణాల వల్ల రాజీనామా చేయాలని అనుకొన్నాను. చంద్రబాబు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆయన పిలుపుమేరకు వచ్చి కలిశాను. అనేక విషయాలు ఆయనతో మాట్లాడాను. నాకేమీ పదవులు అక్కర్లేదు. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారికి న్యాయం జరగాలి. కష్ట సమయంలో కూడా పార్టీని అంటిపెట్టుకొని నిస్వార్థంగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. నాలాంటి వాళ్లయినా చెప్పకపోతే అధినాయకునికి అన్ని విషయాలూ తెలియవు. బాబుగారు కూడా ఏ సమస్యలు ఉన్నా దాచుకోకుండా చెప్పాలని సూచించారు. ఆ అవకాశం ఇవ్వడంవల్ల అధినాయకునికి అన్నీ చెప్పాను’’ అని అన్నారు. తాను చెప్పిన విషయాలపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Advertisement
Advertisement