కెప్టెన్సీతో ఎవరు బాగుపడ్డారంటూ ఐసీసీ ఓటింగ్.. కోహ్లీ కంటే ఇమ్రాన్ పైచేయి!

ABN , First Publish Date - 2021-01-14T00:46:54+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించిన ఓ పోలింగ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీద పాకిస్తాన్ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్...

కెప్టెన్సీతో ఎవరు బాగుపడ్డారంటూ ఐసీసీ ఓటింగ్.. కోహ్లీ కంటే ఇమ్రాన్ పైచేయి!

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించిన ఓ పోలింగ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని పాకిస్తాన్ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ వెనక్కినెట్టారు. కెప్టెన్లు అయిన తర్వాత తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని మెరుగుపర్చుకున్న ఆటగాళ్లు ఎవరంటూ ఐసీసీ ఇటీవల ట్విటర్లో ఓటింగ్ నిర్వహించింది. కోహ్లీ, ఇమ్రాన్, ఏబీ డివిలియర్స్, మెగ్ లాన్నింగ్‌లలో ఎవరిని ఎన్నుకుంటారంటూ నిర్వహించిన ఈ పోలింగ్‌లో మొత్తం 536,346 ఓట్లు నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఇమ్రాన్, కోహ్లీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఇమ్రాన్‌కు 47.3 శాతం ఓట్లు రాగా... కోహ్లీకి 46.2 శాతం ఓట్లు వచ్చాయి. సౌతాఫ్రికా దిగ్గజం డివిలియర్స్  6 శాతం ఓట్లతో సరిపెట్టుకోగా.. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ లాన్నింగ్ కేవలం 0.5 శాతం ఓట్లు వచ్చాయి. కెప్టెన్సీ అనేది ఎవరికి ‘‘వరంగా’’ మారింది.. దాని ఫలితంగా ఎవరి సరాసరి పెరిగింది అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ నలుగురినీ ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్ కాకముందు కేవలం 51.29 సగటుతో ఉండగా.. కెప్టెన్ అయిన తర్వాత ఇది ఏకంగా 73.88కి పెరిగింది. ఇక పాకిస్తాన్‌కు 1992లో ప్రపంచ కప్ తెచ్చిపెట్టిన ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్ కాకముందు బ్యాటింగ్‌లో 25.43  సగటుతోనూ, బౌలింగ్‌లో 25.53 సగటుతోనూ ఉన్నాడు. అయితే కెప్టెన్ అయిన తర్వాత బ్యాటింగ్ యావరేజ్ 52.34కి పెరగ్గా.. బౌలింగ్‌లో కూడా అతడి యావరేజ్ 20 శాతం పెరిగింది. 



Updated Date - 2021-01-14T00:46:54+05:30 IST