యుద్ధరంగం

ABN , First Publish Date - 2020-03-29T09:06:45+05:30 IST

ఎక్కడో ఉండిపోయి ఏకాకులమయ్యామన్న భావనలోనూ ఇదీ ఒక పోరాటమేనన్న చిన్న తృప్తి– యుద్ధం ఆకలి వైరస్‌తోనో అసలు వైరస్‌తోనో గానీ ఇప్పుడు కనిపించని శత్రువుతో...

యుద్ధరంగం

ఎక్కడో ఉండిపోయి

ఏకాకులమయ్యామన్న భావనలోనూ

ఇదీ ఒక పోరాటమేనన్న చిన్న తృప్తి– 

యుద్ధం ఆకలి వైరస్‌తోనో 

అసలు వైరస్‌తోనో గానీ

ఇప్పుడు కనిపించని శత్రువుతో

సహచరులెవరూ లేకుండా

ఒంటరితనమే ఆయుధంగా

ఎంతో సహనంగా చేయాలట– 

స్వీయ గృహ నియంత్రణలోనూ

అసలు ఇండ్లే లేనోల్ల లెక్కలు

సామాజిక దూరంలోనూ 

ఒకే గది ఉన్న కోట్ల కుటుంబాల లెక్కలు

ఎంతగా విడమర్చి చెప్పావే కరోనా!

ప్రపంచమంతా మాదనుకుని 

పొట్టతిప్పలకు పరుగెత్తిన వాల్ల 

గమ్యమేమిటో... గతేమిటో... గానీ

ఇంకా రహదారులు రాసులు పొస్తున్నాయి

క్వారంటైన్‌లు వరిస్తున్నాయి

కరోనా వారంటు లేకుండానే

దేశ దేశాల్ని బందీ చేశావు

పుట్టుకతోనే ఉన్నవో, పుట్టిస్తే వచ్చావో గానీ

ఉత్పత్తి పంపకాలపై సమ్మెట వేశావు

పెట్టుబడి లాభాపేక్షల పీచమణిచావు

బక్క జీవుల పక్కలో బల్లెమయ్యావు

అయినా కొత్త కొత్త గత్తర్లకేం తత్తరపడం 

మనిషిపుట్టింది మొదలు

మనుగడ కోసం పోరాటమే కదా 

కోరంకోనో కరోనానో ఏదయితేనేం

ప్రజలంతా జెర పయిలంగుండాలి!

విడివిడిగా ఉండే కలివిడి తనం కావాలి!!

ఆకలి పోరాటాన్ని జయించాలంటే

అసలు బతికుండాలిగా...

ఇప్పుడు తాత్కలిక యుద్ధరంగం ఇల్లేనట

మిత్ర (అమర్‌)

Updated Date - 2020-03-29T09:06:45+05:30 IST