15 వేల మంది ఆభరణాల విక్రేతలకు ఐటీ నోటీసులు

ABN , First Publish Date - 2020-02-28T07:22:44+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ 2016 నవంబరు 8న డీమానిటైజేషన్‌ ప్రకటించిన వెనువెంటనే కస్టమర్లకు భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు విక్రయించిన 12 మందికి పైగా ఆభరణాల వర్తకులకు ఐటీ శాఖ నోటీసులు...

15 వేల మంది ఆభరణాల విక్రేతలకు ఐటీ నోటీసులు

ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ 2016 నవంబరు 8న డీమానిటైజేషన్‌ ప్రకటించిన వెనువెంటనే కస్టమర్లకు భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు విక్రయించిన 12 మందికి పైగా ఆభరణాల వర్తకులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ రోజున నెక్లె్‌సలు, ఉంగరాలు వంటి ఆభరణాలతో పాటుగా బంగారం కూడా భారీ పరిమాణంలో విక్రయించినట్టు జైన్‌ అనే వ్యాపారి ఒకరు చెప్పారు. వాస్తవ ధర కన్నా చాలా ప్రీమియం ధరకు తాను ఒక్క రోజులోనే మొత్తం బంగారం అమ్మేశానని, రెండు నెలల పాటు కష్టపడితే తప్ప రాని ఆదాయం అందుకున్నానని తెలిపారు. మూడు నెలల క్రితం తనకు ఐటీ నోటీసు అందిందని ఆయన చెప్పారు. నల్లధనంతోనే ప్రజలు బంగారం కొన్నారని, అందుకే ఆ రాత్రి తాను ఆర్జించిన ఆదాయం మొత్తం తిరిగి చెల్లించాలని ఆ నోటీసులో ఆదేశించారని జైన్‌ తెలిపారు.


ఆ ఉత్తర్వులపై తాను అప్పీలుకు వెళ్లగా అప్పీలు చేయాలంటే భారతీయ చట్టాల ప్రకారం వివాదంలో చిక్కుకున్న సొమ్ము మొత్తంలో 20 శాతం డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, జైన్‌కు అందినట్టుగానే 15 వేల మంది వర్తకులకు కూడా నోటీసులు అందాయని భారతీయ బులియన్‌, ఆభరణాల వ్యాపారుల సంఘం కార్యదర్శి సురేంద్ర మెహతా చెప్పారు. ఆ రకంగా వ్యాపారులందరి నుంచి ఐటీ అధికారులు కోరుతున్న సొమ్ము సుమారు రూ.50 వేల కోట్లని ఆయన అన్నారు.

Updated Date - 2020-02-28T07:22:44+05:30 IST