Abn logo
Jul 10 2020 @ 02:43AM

కరోనాలోనూ ఖజానా వేట!

  • ఆగస్టు నుంచి రిజిస్ర్టేషన్‌ చార్జీల పెంపునకు కసరత్తు?
  • రాజధానుల సమస్య, ఇసుక కొరతతో 
  • అసలే కుదేలవుతున్న రియల్‌ ఎస్టేట్‌
  • కొవిడ్‌తో పరిస్థితి మరింత దారుణం
  • అయినా, చార్జీల పెంపునకే మొగ్గు
  • క్షేత్రస్థాయిలో ఇప్పటికే మొదలైన ఆరా

అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కరోనా కాలంలోనూ ఆదాయం పెంచుకోవడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రజల ఆదాయాలు తగ్గిపోవడం...రాబోయే ఆరేడు నెలలు పరిస్థితి ఇలాగే ఉండబోతున్నదన్న ఆందోళన నేపథ్యంలో కూడా రిజిస్ర్టేషన్ల శాఖ తన పని తాను చేసుకుపోతోంది. అసలే మూలుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలపై బండరాయి వేసేందుకు కసరత్తు ప్రారంభించేసింది. సుమారు గత 15 రోజుల నుంచి క్షేత్రస్థాయిలో సబ్‌ రిజిస్ర్టార్లతో పాటు తహసీల్దార్లు, ఆర్డీవోలు, పట్టణాభివృద్ధి సంస్థల అధికారులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసింది. రిజిస్ర్టేషన్‌ చార్జీలను ఎక్కడెక్కడ పెంచాలన్నది నిర్దేశించి, ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలంటూ మౌఖిక ఆదేశాలిచ్చింది.


లే అవుట్లు, హైవే పక్కన ఉన్న భూములు, కన్వర్షన్‌ చేసిన భూములు, వివిధ ప్రాజెక్టులు వస్తాయనుకుంటున్న వాటి సమీపంలోని భూము లు, వీటితోపాటు నగరాలు, పట్టణాల్లోని స్థలాలు, అపార్టుమెంట్ల ఽధరల పెంపుపైనా కసరత్తు చేయాలని ఈ శాఖ కోరింది. గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి, పట్టణ ప్రాంతాల్లో ఏడాదికోసారి రిజిస్ర్టేషన్‌ ధరలను పెంచడం ఆనవాయితీ. జూన్‌, జూలై నెలల్లో దీనికి సంబంఽధించిన కసరత్తు ప్రారంభించి...ఆగస్టు ఒకటి నుంచి కొత్త రేట్లను అమలుచేస్తారు. అయితే, ఎప్పటికప్పుడు అప్పటికి ఉన్న మార్కెట్‌ పరిస్థితులను బట్టి వీటిని పెంచుతారు. గత ఏడాది అప్పట్లో ఉన్న ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ చార్జీలను పెంచలేదు. ఆగస్టు ఒకటో తేదీనుంచి రిజిస్ర్టేషన్‌ చార్జీలను పెంచాలన్న ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది.


అరకోటి మందిపై దెబ్బ..

వాస్తవానికి ఈ ఏడాదికాలంలో భూముల ధరలు కానీ, అపార్ట్‌మెంట్‌ ధరలు కానీ పెరిగిందేమీ లేదు. పైగా మరింత దిగజారాయనే చెప్పొచ్చు. రాజధానుల మార్పు ప్రకటనలు, ఇసుక కొరత, ఉద్యోగ కల్పన లేకపోవడం, నిర్మాణ కార్యకలాపాలు స్తంభించిపోవడం తదితర కారణాలతో రియల్‌ ఎస్టేట్‌ రంగం పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. వ్యవసాయ భూములు, గ్రామాల్లో స్థలాలు, లే అవుట్లు, పట్టణాలు, నగరాల్లోనూ ఇదే పరిస్థితి. దీనికితోడు నాలుగు నెలల నుంచి కరోనా తోడైంది. పరిస్థితిని ఇది మరింత దారుణంగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రిజిస్ర్టేషన్‌ చార్జీలను వీలైతే తగ్గించాలేగానీ, పెంచడం ఏమాత్రం సరికాదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ఆధారపడి దాదాపు అరకోటి మంది జీవిస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయ భూముల నుంచి పట్టణాల్లో స్థలాల అమ్మకాలు, కొనుగోళ్ల వరకు చూస్తే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా. మరోవైపు ఎవరైనా ఒక 200గజాల స్థలం, ఒక అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేయాలన్నా, లేకుంటే కాడిగట్టు పొలం అరెకరం, ఎకరం కొనుగోలు చేయాలన్నా రిజిస్ర్టేషన్‌ చార్జీల భారం తడిసిమోపెడవుతుంది. దీంతో కొనుగోళ్లకు వెనకాడే పరిస్థితి కూడా ఉంటుంది.


వేగంగా కసరత్తు.. 

రిజిస్ర్టేషన్‌ ధరల పెంపుకోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవోలు చైర్మన్‌గా, సబ్‌ రిజిస్ర్టార్‌ కన్వీనర్‌గా కమిటీ ఉంటుంది. తహసిల్దార్లు, ఎంపీడీవోలు సభ్యులుగా ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో జాయింట్‌ కలెక్టర్‌ ఛైర్మన్‌గా...సబ్‌ రిజిస్ర్టార్‌ కన్వీనర్‌గా కమిటీ ఉంటుంది. ఈ కమిటీలు ఆయా ప్రాంతాల్లోని స్థలాలు, నిర్మాణాల ఽధరలను పరిశీలించి ఎంత శాతం పెంచొచ్చన్నది ఒక అంచనాను ప్రభుత్వానికి అందిస్తాయి. ఈ కమిటీల కన్వీనర్లుగా ఉన్న సబ్‌ రిజిస్ర్టార్లు ఇప్పటికే ఈ ప్రక్రియను మొదలుపెట్టేశారు. భూముల ధరలు ఎంతున్నాయి? కొత్తగా వచ్చిన లే అవుట్లు, కన్వర్షన్‌ అయిన భూముల వివరాలు, జాతీయ రహదారుల పక్కనున్న భూముల వివరాలను సర్వేనంబర్లతో సహా వేగంగా సేకరిస్తున్నారు. ఆగస్టు 1 నాటికి కొత్త రిజిస్ర్టేషన్‌ చార్జీలను అమల్లోకి తెచ్చేలా కార్యాచరణ రూపొందించుకుని పనిచేస్తున్నారు. ఈ కమిటీలు అంచనాలను ఇచ్చినా, ప్రభుత్వ ఆదేశాల మేరకే రిజిస్ర్టేషన్‌ చార్జీలు ఎంత పెంచాలన్నది నిర్ణయమవుతుంది. 

Advertisement
Advertisement
Advertisement