తేమ తెచ్చిన తంటా!

ABN , First Publish Date - 2021-11-24T09:09:44+05:30 IST

నైరుతి రుతు పవనాలు వెళ్లిపోయినప్పటికీ.. కొన్నిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో వరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

తేమ తెచ్చిన తంటా!

  • గణనీయంగా తగ్గిన కొనుగోళ్లు
  • ధాన్యంలో 30 శాతం పెరిగిన తేమ
  • నిబంధనల మేరకు 17 శాతానికే అనుమతి
  • రాష్ట్రంలో ఇప్పటివరకు 14.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యమే కొనుగోలు
  • లక్ష్యంలో ఇది 15 శాతం మాత్రమే
  • అకాల వర్షాలతో రైతుల ఇబ్బందులు


హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతు పవనాలు వెళ్లిపోయినప్పటికీ.. కొన్నిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో వరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరికోతలు ముమ్మరంగా సాగుతున్న స మయంలో వర్షాలు కురుస్తుండటం, చేతికొచ్చిన ధాన్యం తడిసిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం లో తేమ ఏకంగా 30 శాతానికి పెరగటంతో కొనుగోళ్లు కూడా మందగించాయి. తేమ ఎక్కువగా ఉండటంతో కొనుగోలు చేయబోమని కొనుగోలు కేంద్రాల నిర్వాహకు లు తెగేసి చెబుతున్నారు. ప్రొక్యూర్‌మెంట్‌ నిబంధనల ప్రకారం 17 శాతం వరకు తేమ ఉంటే కొనుగోళ్లకు అనుమతి ఉంది. కొద్దిరోజుల క్రితం, వర్షాలు పడకముందుకు 14 శాతానికి కూడా తేమ పడిపోయిన సందర్భాలున్నాయి. అప్పుడు కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవటంతో రైతులు ధాన్యం అమ్ముకోలేకపోయారు. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచేసరికి వర్షా లు అందుకున్నాయి. కొనుగోలు కేంద్రాల ప్రాంగణంలో, రోడ్లమీద, ఎక్కడజాగా దొరికితే అక్కడ... రైతులు ధాన్యం పోశారు. పైకప్పు ఉండే షెడ్లు, తాటిపత్రులు అందుబాటులో లేకపోవటంతో ధాన్యం తడిసిపోతోంది. కొన్నిచోట్ల మొలకలు కూడా వస్తున్నాయి. 


తడిసినా, తేమ ఎక్కువున్నా ధాన్యాన్ని కొనుగోలుచేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాలమేరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రొక్యూర్‌మెంట్‌ చేయటంలేదు. కొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 14.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలుచేశారు. ఇది లక్ష్యంలో 15 శాతం మాత్రమే కావటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది. నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో కాస్త కొనుగోళ్లు చేశారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిర్మల్‌, హనుమకొండ, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 6,811 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం ేసకరించాలని సర్కారు టార్గెట్‌ పెట్టుకుంది. ఇప్పటివరకు 5,126 సెంటర్లు ప్రారంభించారు. 7 జిల్లాల్లో కొనుగోళ్లే ప్రారంభించలేదు. ములుగు, నాగర్‌ కర్నూల్‌, జోగులాంబ గద్వాల, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, వికారాబాద్‌ జిల్లాల్లో సెంటర్లు ప్రారంభించలేదు. వరంగల్‌ జిల్లాలో 172 సెం టర్లకు 54 సెంటర్లు, భూపాలపల్లిలో 185 సెంటర్లకు 22, మహబూబాబాద్‌ జిల్లాలో 188 సెంటర్లకు 27, వికారాబాద్‌ లో 146 సెంటర్లకు 11 మాత్రమే ప్రారంభించారు. వికారాబాద్‌లో 11 సెంటర్లు తెరిచినా ఒక్క గింజ కొనలే దు. దీంతో ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోతోంది. మొలకలు వచ్చిన ధాన్యాన్ని పట్టుకొని కొన్నిచోట్ల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఆర బెట్టేందుకు వసతులు లేవు. దీంతో తేమ ఎక్కువున్నా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 


రైతన్న దైన్యం! 

చేతికందిన పంటను విక్రయించుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు, పంట పొలా ల్లో కుప్పలుగా పోసిన ధాన్యం వారం రోజులుగా కు రుస్తున్న వర్షాలతో తడిసి ముద్దయి దిగాలు చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని, రామగిరి, ముత్తా రం, కమాన్‌పూర్‌, పెద్దపల్లి మండలాల్లో మంగళవారం కురిసిన వర్షాలకు పెద్దఎత్తున ధాన్యం తడిసిం ది. జిల్లాలో 4.6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకో గా, ఇప్పటి వరకు 40 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్‌, మేడిపల్లి మండలాల్లో సుమారు 1200 క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వర్షపు నీటి ఉధృతికి ధాన్యం కొట్టుకుపోయింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్‌గౌరెల్లికి చెందిన బిచ్యానాయక్‌ రెండెకరాల్లో 1.10 లక్షలు ఖర్చు చేసి వరి సాగు చేశాడు. పదిహేనురోజుల క్రితం కోత కోసి, నూర్పిడి కోసం ధాన్యాన్ని కళ్లం వద్ద నిల్వ చేశాడు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి 20 క్వింటాళ్ల ధాన్యం పూర్తిగా తడిసి మొలకెత్తడంతో లబోదిబోమంటున్నాడు. మరోవైపు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిసూ జగిత్యాల జిల్లాలో అన్నదాతలు ఆందోళన చేశారు. 


తూకంలో మోసం.. రైతుల రాస్తారోకో  

రైస్‌ మిల్లర్లు, ధాన్యం తూకం వేసే వే బ్రిడ్జి యజమాని కుమ్మక్కై తూకంలో మోసాలకు పాల్పడుతున్నారని ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం పొతంగల్‌ విండో పరిధిలోని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా తమ వరి ధాన్యాన్ని పలు రైస్‌మిల్లులకు సరఫరా చేశారు. తూకంలో 40 కిలోల బస్తాకు కిలోన్నర చొప్పున నిర్వాహకులు తరుగు తీశారు. ఇది చాలదన్నట్టు రైస్‌మిల్లర్లు సమీపంలోని ‘కరం ఇండస్ర్టీస్‌’ వే బ్రిడ్జి యజమానితో కుమ్మక్కై లారీ లోడుకు 14 బస్తాల చొప్పున (ఆరు క్వింటాళ్ల మేర) తూకంలో తేడా చూపిస్తూ రైతులను మోసగించారు. దీంతో రైతులు.. మోసాలకు పాల్పడ్డ రైస్‌మిల్లర్లు, వేబ్రిడ్జి యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లారీలను నిలిపివేసి, రాస్తారోకో చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు. 

Updated Date - 2021-11-24T09:09:44+05:30 IST