ఔరా.. బుమ్రా

ABN , First Publish Date - 2020-12-12T09:58:22+05:30 IST

గులాబీ టెస్టుకు సన్నాహకంగా జరుగుతున్న మూడు రోజుల వామప్‌ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. అయితే ఎవరూ ఊహించని విధంగా పదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (57 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 నాటౌట్‌) అదరగొట్టాడు.

ఔరా.. బుమ్రా

జస్‌ప్రీత్‌ ఆల్‌రౌండ్‌ షో 

మొదటి రోజే 20 వికెట్లు పతనం

భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ 194 

ఆసీస్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ 108


సిడ్నీ: గులాబీ టెస్టుకు సన్నాహకంగా జరుగుతున్న మూడు రోజుల వామప్‌ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. అయితే ఎవరూ ఊహించని విధంగా పదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (57 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 నాటౌట్‌) అదరగొట్టాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమైన చోట తనొక్కడి ఆటే తొలి రోజు   హైలైట్‌గా నిలవడం విశేషం. అంచనాలకు అందని రీతిలో బ్యాట్‌ ఝుళిపిస్తూ కెరీర్‌లో మొదటి ఫస్ట్‌క్లాస్‌ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. అలాగే సిరాజ్‌ (22)తో కలిసి పదో వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. దీంతో శుక్రవారం తొలి రోజు భారత్‌ ‘ఎ’ మొదటి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. పృథ్వీ షా (29 బంతుల్లో 8 ఫోర్లతో 40), గిల్‌ (43) ఫర్వాలేదనిపించారు. అబాట్‌, విల్డర్‌మత్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత భారత పేసర్ల షార్ట్‌ పించ్‌ బంతుల ధాటికి ఆసీస్‌ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 32.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. క్యారీ (32), హ్యారిస్‌ (26) రాణించారు. సైనీ, షమిలకు మూడేసి.. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. భారత్‌ ప్రస్తుతం 86 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇదిలావుండగా బ్యాటింగ్‌కు అనుకూలించే ఎస్‌సీజీలో తొలిరోజే ఇరు జట్లు ఆలౌటవడంతో 20 వికెట్లు నేలకూలాయి.


ఆదుకున్న బుమ్రా: కీలక మొదటి టెస్టుకు ముందు భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఆకట్టుకోలేకపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ మయాంక్‌ (2) వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో వేగంగా ఆడిన షా, గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తొమ్మిదో ఓవర్‌లో షా బౌల్డయ్యాడు. విహారి (15) నిరాశపర్చగా ఆ తర్వాత గిల్‌, రహానె (4), పంత్‌ (5), సాహా (0), సైనీ (4), షమి (0) ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరడంతో 123 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఇక ఆఖరి వికెట్‌ పడడం కూడా ఎంతోసేపు పట్టదులే అని భావించినా.. బుమ్రా ఆదుకున్నాడు. తనలో మంచి బ్యాట్స్‌మన్‌ కూడా ఉన్నాడని చాటుకుంటూ పరుగుల వరద పారించాడు. ఎలాంటి బంతినైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అబ్బురపరిచాడు. తన హాఫ్‌ సెంచరీని కూడా డీప్‌స్క్వేర్‌ లెగ్‌లో సిక్సర్‌ బాది పూర్తి చేశాడు. కాసేపటికే సిరాజ్‌ అవుటైనా భారత్‌ మంచి స్కోరు సాధించగలిగింది. ఇక డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళుతున్న సమయంలో ఆటగాళ్లంతా బుమ్రాకు సరదాగా ‘గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ ఇవ్వడం విశేషం.


సంక్షిప్త స్కోర్లు: 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 48.3 ఓవర్లలో 194 ఆలౌట్‌  (పృధ్వీ షా 40, శుభ్‌మన్‌ గిల్‌ 43, బుమ్రా 55 నాటౌట్‌, అబాట్‌ 3/46, విల్డర్‌మత్‌ 3/13); ఆస్ర్టేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: 32.2 ఓవర్లలో  108 ఆలౌట్‌ (హారిస్‌ 26, క్యారీ 32, షమి 3/29, సైనీ 3/19, బుమ్రా 2/33).

Updated Date - 2020-12-12T09:58:22+05:30 IST