సౌదీపై భారత్‌ గుస్సా

ABN , First Publish Date - 2021-04-03T06:27:01+05:30 IST

ముడి చమురు ఎగుమతులపై సౌదీ అరేబియా అనుసరిస్తున్న అడ్డగోలు విధానాలపై భారత్‌ ఆగ్రహంతో ఉంది. ఆ దేశం నుంచి చమురు దిగుమతులకు కోత పెట్టడం ద్వారా ‘

సౌదీపై భారత్‌ గుస్సా

దిగుమతులను ఆయుధంగా మార్చే యత్నం.. స్పాట్‌ చమురు మార్కెటపై దృష్టి పెట్టండి

చమురు కంపెనీలకు ప్రభుత్వం సూచన.. ఆఫ్రికా, అమెరికాలపై ప్రత్యేక నజర్‌


న్యూఢిల్లీ : ముడి చమురు ఎగుమతులపై సౌదీ అరేబియా అనుసరిస్తున్న అడ్డగోలు విధానాలపై భారత్‌ ఆగ్రహంతో ఉంది. ఆ దేశం నుంచి చమురు దిగుమతులకు కోత పెట్టడం ద్వారా ‘చమురు’నే ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సౌదీ నుంచి వార్షిక కాంట్రాక్టుల ప్రాతిపదికన చమురు దిగుమతులకు కోత పెట్టాలని ప్రభుత్వ రంగంలోని ఆయిల్‌ రిఫైనింగ్‌ కంపెనీలను ప్రభుత్వం కోరినట్టు సమాచారం. ఉత్పత్తి కోతలపై సౌదీ అరేబియా వంటి ఒపెక్‌ దేశాలు అనుసరిస్తున్న వైఖరిపై భారత్‌ ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. ఉత్పత్తి కోతలతో చమురు ధర పెరిగి మా ఆర్థిక వ్యవస్తలు తలకిందులవుతున్నాయని ఎంత మొరపెట్టుకున్నా ఈ దేశాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఇక మన చమురు కొనుగోలు శక్తినే ఆయుధంగా మలుచుకోవాలని నిర్ణయించింది.


ఇలాంటి దేశాలతో వార్షిక ముడి చమురు సరఫరా కాంట్రాక్టులు కుదుర్చుకునే బదులు అమెరికా, రష్యా, ఆఫ్రికా వంటి దేశాల్లోని స్పాట్‌ మార్కెట్లో కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) కంపెనీలను కోరింది. ఈ కంపెనీలు తమ ముడి చమురు అవసరాల్లో ఎక్కువ భాగం వార్షిక ప్రాతిపదికన సౌదీ వంటి పశ్చిమాసియా దేశాల నుంచి కొనుగోలు చేస్తుంటాయి.



  పట్టించుకోని సౌదీ

దేశంలో చమురు మంట తగ్గించేందుకు ఒపెక్‌ దేశా లు ఉత్పత్తి కోతలు తగ్గించాలని ఇటీవల కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కోరారు. సౌదీ అరేబియా ఈ విజ్ఞప్తిని పక్కన పెట్టడమేగాక, చమురు ధరల పతనం సమయంలో కారు చౌకగా కొన్న ముడి చమురు వాడుకోండని ఉచిత సలహా పారేసింది. వార్షిక కాంట్రాక్టుల ప్రకారం ఆయా దేశాలు.. ఆ సంవత్సరం మొత్తం మీద నిర్ణీత మొత్తం చమురు సరఫరా చేయాలి. అయితే సౌదీ అరేబియా వంటి దేశాలు ఈ సరఫరాను ఒపెక్‌ కోతలతో ముడి పెడుతున్నాయి. ధరను కూడా లోడింగ్‌ రోజు ఉండే ధరకు బదులు.. ఆ నెల సగటు ధర ప్రకారం వసూలు చేస్తున్నాయి.


దీనికి తోడు ఏ నెల్లో ఎంత చమురు కావాలో ఆరు వారాల ముందే భారత కంపెనీలు తెలియజేయాలి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గినా భారత్‌కు ఆ ప్రయోజనం లభించడం లేదు. దీనికి బదులు అమెరికా, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి స్పాట్‌ మార్కెట్లో ముడి చమురు కొనుగోలు చేయడం మంచిదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సను కూడా కలుపుకుని ముడి చము రు కోసం బేరం చేయాలని కోరనున్నట్టు సమాచారం. 

 


  దిగొచ్చేనా?

ఇరాక్‌లో అంతర్యుద్ధం, ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలతో భారత్‌.. సౌదీ అరేబియా, కువైట్‌ దేశాల నుంచి ఎక్కువగా ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. ధరలు పతనమైనప్పుడు వెంటపడి మరీ ముడి చమురు సరఫరా చేస్తున్న సౌదీ.. ధరలు పెరిగే సరికి బెట్టు చేస్తోంది. దీనికి తోడు అనధికారికంగా ఒక్కో పీపా చమురుపై ఈ దేశాలు భారత్‌ వంటి ఆసియా దేశాల నుంచి పది డాలర్ల వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. ఇరాన్‌, ఇరాక్‌ నుంచి చమురు సరఫరాలు పెరిగి.. మళ్లీ ధరలు పతనమైతే తప్ప సౌదీ వైఖరిలో మార్పు రాకపోవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. అమెరికా, రష్యాల నుంచి స్పాట్‌ మార్కెట్లో మరింత చమురు కొనుగోలు చేయడం ఇందుకు మార్గంగా కనిపిస్తోంది. 



  క్రమంగా కోతలు తగ్గిస్తాం: ఒపెక్‌

చమురు ధరలపై అంతర్జాయంగా వ్యక్తమవుతున్న ఆందోళనతో ఒపెక్‌, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు కొంత మెత్తబడ్డాయి. వచ్చే నెల నుంచి మూడు నెలల పాటు రోజువారీ ఉత్పత్తిని 20 లక్షల బ్యారళ్లు పెంచేందుకు అంగీకరించాయి. 

ఇందులో 10 లక్షల బ్యారళ్ల చమురును సౌదీ అరేబియా అదనంగా ఉత్పత్తి చేస్తుంది. అయితే ఉత్పత్తిని ఒక్కసారిగా కాకుండా నిదానంగా మూడు నెలల్లో పెంచుతామని ఒపెక్‌ తెలిపింది.




ప్రధానాంశాలు 

 గత ఏడేళ్లలో 25 శాతం పెరిగిన భారత చమురు దిగుమతులు

అమెరికా, చైనా తర్వాత భారత్‌ మూడో అతి పెద్ద చమురు దిగుమతి దేశం

2040 నాటికి మూడింతలు పెరిగి 25,000 కోట్ల డాలర్లకు చేరనున్న చమురు దిగుమతులు

మేలో సౌదీ నుంచి 25ు తగ్గనున్న దిగుమతులు

2016-19 మధ్య దిగుమతుల్లో పశ్చిమాసియా దే శాల వాటా 64 ు నుంచి 60 శాతానికి తగ్గుదల

కొత్తగా గయానా, బ్రెజిల్‌ నుంచి దిగుమతులు

వెనిజులా, కువైట్‌, అమెరికా నుంచి మరింత చమురు దిగుమతికి ప్రయత్నాలు


Updated Date - 2021-04-03T06:27:01+05:30 IST