దుష్ప్రభావాలొస్తే పరిహారం

ABN , First Publish Date - 2021-01-17T08:28:08+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన ‘కొవాగ్జిన్‌’ ఇచ్చే ముందు లబ్ధిదారుల నుంచి తప్పనిసరిగా అంగీకార పత్రం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం

దుష్ప్రభావాలొస్తే పరిహారం

కొవాగ్జిన్‌తో ఆరోగ్యానికి హాని జరిగితే బాధ్యత మాదే

భారత్‌ బయోటెక్‌ పూచీకత్తుతో అంగీకార పత్రం


హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన ‘కొవాగ్జిన్‌’ ఇచ్చే ముందు లబ్ధిదారుల నుంచి తప్పనిసరిగా అంగీకార పత్రం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఆ కంపెనీ కన్సెంట్‌ కాపీని శనివారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖలకు పంపింది. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ మోడ్‌లో మాత్రమే కొవాగ్జిన్‌ టీకాను తీసుకునేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. అందుకే టీకా తీసుకునే వారి నుంచి అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నామని కేంద్రం పేర్కొంది. తొలి రెండు దశల ప్రయోగ పరీక్షల్లో కొవాగ్జిన్‌ ప్రభావంతో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించామని, చివరి దశ ట్రయల్స్‌ జరుగుతున్నాయని తెలిపింది. తమ వ్యాక్సిన్‌ వల్ల హాని జరిగితే అందుకు పూర్తి బాధ్యత తామే వహిస్తామని, అవసరమైన చికిత్స అందిస్తామని అంగీకార పత్రంలో భారత్‌ బయోటెక్‌ హామీ ఇచ్చింది. వ్యాక్సిన్‌ వల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తినట్లు రుజువైతే నష్టపరిహారం కూడా అందిస్తామని పేర్కొంది.


ఈ రిస్క్‌కు అంగీకరిస్తున్నట్లు టీకా వేయించుకునే వారు, లబ్ధిదారుడికి ఈ రిస్క్‌ గురించి వివరించినట్లుగా ఒప్పుకుంటూ టీకా ఇచ్చే వ్యక్తి అంగీకార పత్రంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈనేపథ్యంలో ‘‘కొవాగ్జిన్‌ను దేశ సేవ కోసం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసింది. దేశానికి అలుపెరుగని సేవలు అందిస్తున్న కరోనా యోధులకు అది రక్షణ కవచంలా నిలుస్తుంది’’ అంటూ భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా ట్వీట్‌ చేశారు.


వ్యాక్సిన్‌ కంపెనీలకు.. ‘పూచీకత్తు’ ఇవ్వలేదు

టీకాల కొనుగోలుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌లతో ఒప్పందాలు కుదుర్చుకున్న కేంద్ర ప్రభుత్వం.. వాటిలో పూచీకత్తు (ఇండెమ్నిటీ)కు సంబంధించిన నిబంధనను చేర్చలేదని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారవర్గాలు తెలిపాయి. అయితే ఒప్పందంలో ‘ఇండెమ్నిటీ’ని కూడా చేర్చాలని రెండు టీకా కంపెనీలూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయని పేర్కొన్నాయి. ఇండెమ్నిటీ అంటే.. చట్టపరమైన క్లెయిమ్‌ల నుంచి లభించే బీమా లాంటిది. టీకా వేయించుకున్న వారు తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తినప్పుడు నష్టపరిహారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంటారు. ఒకవేళ టీకా కంపెనీలకు ప్రభుత్వం ఇండెమ్నిటీని వర్తింపజేస్తే.. కోర్టులను ఆశ్రయించే బాధితులకు పరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. 


‘కొవాగ్జిన్‌ వద్దు.. కొవిషీల్డే కావాలి’

ఢిల్లీలోని రాం మనోహర్‌ లోహియా ఆస్పత్రి రెసిడెంట్‌ డాక్టర్లు తమకు కొవిషీల్డే కావాలంటూ మెడికల్‌ సూపరింటెండెంట్‌కు శనివారం లేఖ రాశారు. కొవాగ్జిన్‌ ప్రయోగ పరీక్షలు ఇంకా పూర్తికాకపోవడాన్ని వారు గుర్తుచేశారు.

Updated Date - 2021-01-17T08:28:08+05:30 IST