Advertisement
Advertisement
Abn logo
Advertisement

వన్డే క్రికెట్ చరిత్రలో.. భారత సంతతి క్రికెటర్ సరికొత్త రికార్డ్!

డబ్లిన్: ఐర్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఐర్లాండ్ జట్టులోని భారత సంతతి క్రికెటర్ సిమి సింగ్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఎనమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ కొట్టిన తొలి బ్యాట్స్‌మెన్‌గా సిమి రికార్డుకెక్కాడు. 34 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 91 బంతుల్లో 14 బౌండరీల సహాయంతో 100 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 346 పరుగుల భారీ స్కోర్ చేసింది. మలాన్(177), డికాక్(120) సెంచరీలతో విజృంభించారు. 


అనంతరం 347 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు మొదట్లోనే తడబడింది. 92 పరుగులకే కీలకమైన మొదటి 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సిమి సౌతాఫ్రికా బౌలర్లకు ధీటుగా సమాధానం చెప్పాడు. కర్టిస్ కాంఫర్(54)తో జతకట్టిన సిమి జట్టు స్కోర్‌ను 200 పరుగులు దాటించాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన సిమి 91 బంతుల్లో శతకం నమోదు చేశాడు. కానీ, కాంఫర్ ఔటైన తర్వాత బ్యాట్స్‌మెన్లు లేకపోవడంతో సిమి ఒంటరి పోరు వృధా అయింది. ఐర్లాండ్ 276 పరుగులకే పరిమితమైంది. కాగా, ఎనిమిదో  స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన ఆటగాడిగా మాత్రం సిమి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. దీంతో ఈ పంజాబీ బ్యాట్స్‌మెన్‌ ఇన్నింగ్స్‌పై పలువురు ప్రముఖ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.     


Advertisement
Advertisement